నిర్దేశం, హైదరాబాద్ః రేసుగుర్రం సినిమాలో ఒక అనాథ పిల్లవాడి మీద అల్లు అర్జున్ చూపించిన ప్రేమ, ఆప్యాయత సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. హీరో ఎంత ఆకతాయి అయినా మానవ సంబంధాల విషయంలో చాలా సున్నితంగా ఉంటారు. అక్కడెక్కడో అమలాపురంలో చిన్న అన్యాయం జరిగితే హైదరాబాద్ నుంచి విమానం ఏసుకుని మరీ వెళ్లి రౌడీలతో ఫైట్ చేసి వారికి న్యాయం చేస్తారు. అయితే ఈ మానవత్వం, సామాజిక సేవ జస్ట్ రీల్ లోనే సుమా. పేమెంట్ ఇస్తే కానీ, హీరో కళ్లలో నుంచి నీళ్లు రాలవు, కాళ్లు-చేతులు కదలవు. కొంత మంది హీరోలు ప్రచారం కోసమైనా మీడియా ముందు షో చేస్తుంటారు. అయితే అల్లు అర్జున్ వీటన్నికీ విరుద్ధం. అతడి స్వార్థం, అమానవీయత, లోభితనంపై నెట్టింట్లో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
తన కారణంగా తన అభిమానే చావుబతుకుల మధ్య ఉన్నాడు. పైగా తల్లిని కూడా ఇదే ఇన్సిడెంట్ లో కోల్పోయాడు. ఇంత జరిగినా అల్లు అర్జున్ మాత్రం తనకు చీమ కుట్టినట్టైనా కనిపించడం లేదు. పైగా, ఈ సంఘటనతో తనకు ఏమాత్రం సంబంధం లేదని నిరూపించుకునే పనిలోనే ఉన్నాడు. తెరమీద బకెట్లు నిండేలా మానవత్వం చూపించే సగటు సినీ నటుడి నిజరూపం ఇది. బహుశా.. ఇక్కడ కూడా పేమెంట్ ఇస్తే కానీ చావుబతుకుల్లో ఉన్న శ్రీతేజ మీదకు అల్లు అర్జున్ ఆలోచన మళ్లకపోవచ్చు. పుష్ప సినిమాలో తగ్గేదే లేదని అతడు అంటుంటాడు. డబ్బులిస్తే తప్ప ఇంకెక్కడా తగ్గలేని జబ్బు అల్లు అర్జున్ ను అంటుంకుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
రేవతి చావుకు కారణం అల్లు అర్జునే
రేవతి చావులో వందకు వంద శాతం అల్లు అర్జునే మొదటి నిందితుడు. పుష్ప సినిమా క్రేజ్ ఏంటో అతడికి బాగా తెలుసు. తెలిసే కాదు.. పది సినిమాలు తీసే డబ్బుల్ని ఒకే సినిమాకు రెమ్యూనేషన్ గా తీసుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించి బిహార్ లో ఫంక్షన్ పెడితే కరెంట్ స్థంబాలు, సెల్ ఫోన్ టవర్లు ఎక్కారు. మరి లోకల్ లో క్రేజ్ ఎలా ఉంటుందో అతడికే కాదు, అందరికీ తెలుసు. అలాంటి టైంలో అతడు థియేటర్ కు రావాల్సిన అవసరం ఏంటి? పైగా థియేటర్ వరకు రాగానే కారు పైకి వచ్చి జనాలకు అభివాదం చేస్తూ షో చేశారు. కక్కిరిసి ఉన్న థియేటర్లో ప్రజలను తనవైపు వచ్చేలా ఉసిగొల్పాడు. అందుకే కదా తొక్కిసలాట జరిగింది. పోలీసులు అక్కడ ఉన్నారు. కానీ, ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామాన్ని ఎవరు మాత్రం కంట్రోల్ చేయగలరు? ఎంతసేపు వ్యాపారం, డబ్బు, పేరు ఇవేనా అతడికి కావాల్సింది? అతడి నాన్న వేళ్ల కోట్లు సంపాదించాడు. అప్పటికే అతడికి పెద్ద హీరోగా పేరుంది. అయినా చాలదు. అదేదో కథలో ఎన్ని ఉన్నా నక్క లోభిగానే ఆలోచిస్తుందని, అల్లు అర్జున్ కూడా అలాంటి బుద్దే చూయించాడు. అందువల్లే రేవతి చనిపోయంది.
మరీ అతి చేస్తోన్న సినీ ఇండస్ట్రీ
అల్లు అర్జున్ ను టెర్రరిస్టులు వచ్చి ఎత్తుకెళ్లలేదు. అల్లు అర్జున్ ఇళ్లు కూల్చి, ఆస్తులు ధ్వంసం చేయలేదు. చేయని తప్పుడు అరెస్ట్ చేసి హింసించలేదు. నిజానికి.. అతడు చేసిన నేరానికి క్రిమినల్ లా తీసుకెళ్లకుండా, రాచమర్యాదలతో అరెస్ చేసి, ఒక పూట కూడా గడవకముందే మళ్లీ రాచమర్యాదలతో ఇంటికి సాగనంపారు. దీనికి భూమి బద్దలైనట్లు సినీ ఇండస్ట్రీవారు చేస్తున్న అతి ఆకాశానికి అంటుతోంది. గత రెండు రోజులుగా అతడి ఇంటికీ క్యూ కట్టి ఓదార్చుతున్నారు. సినిమా రికార్డులు కూడా బద్దలు కొట్టిన అల్లు అర్జున్.. ఈ దెబ్బతో రాజకీయ రికార్డులు కూడా బద్దలు కొడతాడేమో అనిపిస్తోంది. అదేనండీ.. రాజకీయ నాయకులు ఓదార్పు యాత్రలు చేస్తారు కదా.. దాన్ని మించుతోంది.
అల్లు అర్జున్ పిల్లలు మాత్రమే పిల్లలా?
అతడు జైలు నుంచి ఇంటికి చేరుకోగానే అతడి పిల్లలు పరుగెత్తుకొచ్చి హత్తుకునే వీడియోలు చూసే ఉంటారు. వాటిని షేర్ చేస్తూ ముందు సానుభూతి వెల్లువెత్తింది. అయితే ఇవే వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో ఎక్కువ షేర్ అవుతున్నాయి. ఒక రాత్రి తండ్రి లేకపోతే ఆ పిల్లలు అంత బాధపడ్డారు. మరి తన తల్లి ఇక ఎప్పటికీ రాదని తెలిస్తే, ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య శ్రీతేజ పరిస్థితి ఏంటంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
పోయిన ప్రాణంపై పశ్చాతాపం లేదు, ఇచ్చిన ముష్టిపై గొప్పలు
రేవతి ప్రాణాన్ని ఎవరూ తీసుకురారు. కనీసం ఆసుపత్రిలో ఉన్న పిల్లాడి మీద కూడా కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నాడు అల్లు అర్జున్. సోషల్ మీడియా పెద్ద కాంట్రవర్సీ అయ్యాక 25 లక్షల రూపాయలు ప్రకటించారు. చావు మీద కనీసమాటైనా మాట్లాడని అతడు.. తాను ఇచ్చిన ఆ ముష్టి 25 లక్షలకు మాత్రం పదే పదే గొప్పలు చెప్పుకున్నాడు. కనీసం చికిత్స పొందుతున్న శ్రీతేజనైనా చూడడానికి పోలేదు. ఎందుకనంటే కోర్టులో కేసుందని అంటున్నాడు. ఆసుపత్రికి వెళ్లొద్దు, పిల్లాడిని పలకరించొద్దని కోర్టేమైనా చెప్పిందా? బంధువుల కుటుంబాలకు బాగానే తిరుగుతున్నాడు కదా. మరి ఆసుపత్రి వరకు వెళ్లి బాధిత కుటుంబానికి కాస్త ధైర్యం చెప్తే అతడి సొమ్మేం పోతుంది? ఛ.. అక్కడికి వెళ్తే అతడికి వచ్చేదేమీ లేదు కదా. అందుకే వెళ్లలేదేమో.