నిర్దేశం, హైదరాబాద్ః తెలంగాణ మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో వుంటూ, బాధ్యతా రహితమైన కామెంట్స్ చేయడం ఏంటని న్యాయస్థానం నిలదీసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా కొండా సురేఖకు న్యాయ స్థానం చురకలు అంటించింది. కేటీఆర్‌పై చేసిన కామెంట్స్ సమాజంలో చెడు ప్రభావం చూపుతాయని న్యాయ స్థానం పేర్కొంది.
సురేఖ అభ్యంతరకర కామెంట్స్‌ను మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్, ఫేస్బుక్, గూగుల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి వెంటనే తొలగించాలని న్యాయ స్థానం ఆదేశించింది. రానున్న రోజుల్లో ఎప్పుడూ కేటీఆర్‌పై ఇలాంటి అభ్యంతరకర కామెంట్స్ చేయొద్దని న్యాయ స్థానం సురేఖను ఆదేశించింది. తనపై కేటీఆర్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తున్నారని కొండా సురేఖ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆవేశంలో కేటీఆర్‌పై వివాదాస్పద కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున కుటుంబాన్ని బజారుకీడ్చారు. హీరోయిన్ సమంత, హీరో నాగచైతన్య విడిపోవడానికి కేటీఆర్ బెదిరింపులే కారణమని కొండా సురేఖ పేర్కొన్నారు. ముఖ్యంగా సమంత, హీరో నాగార్జునపై సురేఖ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. సినీ పరిశ్రమంతా సురేఖ వ్యాఖ్యల్ని తప్పు పట్టాయి. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకూడదని చిత్రపరిశ్రమ హెచ్చరించిన సంగతి తెలిసిందే. సురేఖ వ్యాఖ్యలు కాంగ్రెస్ సర్కార్‌ను ఆత్మరక్షణలో పడేశాయి. సురేఖపై కేటీఆర్, నాగార్జున వేర్వేరుగా పరువు నష్టం కేసులు వేశాయి. ఇప్పుడు విచారణలో ఉన్నాయి.