- 99 సీట్లు గెలిచి కూడా కాంగ్రెస్ ఎందుకు హ్యాపీగా ఉంది?
ఇలా జరగడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు
నిర్దేశం, న్యూఢిల్లీ: వాస్తవానికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఒకరికి ఆనందం, మరొకరికి దు:ఖం మిగులుతుంది. కారణం, ఎవరో ఒకరు గెలుస్తారు, మరొకరు ఓడుతారు. గెలిచిన వారు గంతులేస్తారు, ఓడినవారికి వేధన తప్పదు. కానీ, మంగళవారం విడుదలైన ఫలితాల్లో బీజేపీ కూటమి స్పష్టమైన మెజారిటీతో గెలిచింది. బీజేపీకి కూడా 240 సీట్లు వచ్చాయి. సరే.. బీజేపీ వాళ్లు ఆనందంతో గంతులేస్తున్నారు. మరి 100 సీట్ల మైలు రాయిని చేరుకోకుండా 99 వద్దే ఆగిపోయిన కాంగ్రెస్ కూడా ఆనందంలో మునిగితేలడం విచిత్రం. ఈ విషయమై నెట్టింట్లో పెద్ద చర్చే జరుగుతోంది.
కాంగ్రెస్ ఆనందానికి కారణం
నిజానికి 10 ఏళ్లకు పైగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు రావడం ఘోర అవమానమే. అలాగే ఇండీ కూటమిలోని పార్టీల సీట్లన్నీ కలిపినా బీజేపీ కంటే తక్కువ సీట్లే. అయినా కాంగ్రెస్ నేతల్లో ఆనందానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. 400 దాటుతాం అన్న ఎన్డీయే 300 దిగువకు పడిపోవడం వారి ఆనందానికి ప్రధాన కారణమైంది. అలాగే దేశంలో విపక్షాలను కలుపుకుని ఎంతో కొంత సక్సెస్ అవడం, భవిష్యత్ లో బీజేపీ వ్యతిరేక కూటమి కాంగ్రెస్ నేతృత్వంలోనే ఉంటుందనేది నిరూపణ అయిందనే ఆనందం కాంగ్రెస్ వర్గాల్లో ఉంది.
ఇకపోతే.. 1984లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తర్వాత ఏ పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లు రాలేదు. ఆ రికార్డును మోదీ 2014 లో తిరగరాశారు. బీజేపీకి సొంతంగా 282 సీట్లు సాధించారు. ఇక 2019లో 288 సీట్లు సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో మెజారిటీకి కొద్ది దూరంలో ఆగారు. అయితే ఎన్డీయే పక్షాలు కలుపుకుంటే మెజారిటీ కంటే ఎక్కువే సాధించారు. ఇలా రెండుసార్లు పూర్తి స్థాయి ప్రభుత్వాన్ని నడిపిన తర్వాత మూడోసారి మెజారిటీ మార్కుకు సమీపంలో సీట్లు సాధించడం.. నెహ్రూ తర్వాత ఆ ఘనత సాధించిన వ్యక్తి మోదీనే.