కరీంనగర్ కాంగ్రెస్ లో గందరగోళం
నిర్దేశం, కరీంనగర్ః
కరీంనగర్ కాంగ్రెస్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మధ్య కోల్డ్ వార్‌తో క్యాడర్లో గందరగోళం నెలకొందట. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచే ఇద్దరి మధ్య గ్యాప్ ఓపెన్ సీక్రెటే అని జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌దే పెత్తనం అన్న టాక్ ఎప్పటినుంచో ఉంది. ఐతే గత అసెంబ్లీ ఎన్నికల్లో పొలిటికల్ ఈక్వేషన్స్‌లో భాగంగా హుస్నాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు.
కరీంనగర్లో బీఆర్ఎస్ జెండా ఎగిరింది.. ఐనా కరీంనగర్ కేంద్రంగా మంత్రి పొన్నం పాలిటిక్స్ నడిపిస్తున్నారు.. మరోవైపు సుడా చైర్మన్‌గా ఉన్న కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్‌లో పట్టు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.. ఇదే లోకల్‌గా ఆధిపత్యపోరుకు దారితీసిందనే టాక్ వినిపిస్తోంది.. అంతేకాదు నరేందర్‌రెడ్డికి సుడా చైర్మన్ పదవి దక్కకుండా పొన్నం ప్రయత్నించాడని, మంత్రి శ్రీధర్‌బాబు ఆశీస్సులతో సుడా చైర్మన్ సీట్లో కూర్చున్నారనేది లోకల్ సర్కిల్స్‌లో వినిపించే చర్చ..కరీంనగర్‌లో మంచి పట్టున్న మంత్రి పొన్నంకు పార్టీ అధిష్టానం నుంచి కూడా సపోర్ట్ ఉంది.. ఐతే 2023లో అధికారంలోకి వచ్చిన తరువాత సుడా చైర్మన్ విషయంలో తన మాట నెగ్గించుకున్నారు మంత్రి శ్రీధర్‌బాబు.
అలా ఆ సీటులోకి వచ్చి కూర్చున్న నరేందర్ రెడ్డి తన పట్టు పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక్కడే మంత్రి పొన్నంతో ఆయనకు ఆధిపత్య పోరు మొదలైందని తెలుస్తోంది.. ఇటీవల కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సన్న బియ్యం పంపిణి కార్యక్రమం చేపడితే..అదే సమయంలో ముఖ్యమైన ప్రెస్ మీట్ అంటూ కబురు పంపారట సుడా చైర్మన్.. ఇలా ఇద్దరూ ఒకే సమయంలో మీడియా సమావేశాలు నిర్వహించడం, ఒకరి కార్యక్రమాలకు మరొకరు హజరుకాకపోవడంతో క్యాడర్‌లో అయోమయం మొదలైందనేది లోకల్ న్యూస్..ప్రస్తుతం ఎమ్మెల్యేగా పొన్నం హుస్నాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండడం, మంత్రిగా పర్యటనలు సాగిస్తున్న క్రమంలో.. ఏదైనా సమస్య వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో క్యాడర్‌కు నరేందర్ రెడ్డే దిక్కవుతున్నారట.
ప్రస్తుత పరిస్థితుల్లో సుడా చైర్మన్ ను కాదనే పరిస్థితి అక్కడ లేదట..అలా అని పొన్నం ప్రభాకర్ ను దూరం పెట్టుకోలేమని వారు అంటున్నారట. అయితే క్యాడర్ నే కాదు.అధికార యంత్రంగాన్ని సైతం తన గ్రిప్ లో పెట్టుకోవాలని సుడా చైర్మన్ చూస్తుంటే.. మంత్రి హోదాలో పొన్నం తన మాట చెల్లు బాటయ్యేలా ఆదేశాలిస్తున్నారట. ఇలా ఇద్దరి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుతో కరవమంటే కప్పకు కోపం..విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఉందట అధికారులు, క్యాడర్ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు బీఆర్ఎస్, బీజేపీలకు అనుకూలంగా మారుతున్నాయట. మరి రాబోయే రోజుల్లో వీరిద్ధరి మధ్య ఆధిపత్య పోరు ఎటు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.