నిర్దేశం, న్యూఢిల్లీ: నేరస్తులు జైలులో ఉంటారు. ఇది అందరికీ తెలిసందే. అలాగే నేరస్తులు జైలు అధికారులుగా కూడా ఉంటారు. ఆ మాటకొస్తే నేరస్తులు లేనిది ఎక్కడ? మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది ఆశామాషీ నేరం గురించి కాదు. రక్తం చిందకుండా, ఎవరి సొమ్ము దొంగిలించకుండా, ఎదుటివారిని తాకకుండా చేసే నేరం గురించి. తాకకుండా అంటే కులం గురించేనని మీరు ఈపాటికే అర్థం చేసుకుని ఉంటారు. అవును.. దొంగతనం, దాడి చేయడం వంటి నేరాలు చేసిన వారికి శిక్షలు వేసే జైలు అధికారులు కులవివక్ష చూపిస్తూ అంతకంటే పెద్ద నేరమే చేస్తున్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో పెద్ద సంఖ్యలో పిటిషన్లు నమోదు అయ్యాయి.
కొన్ని రాష్ట్రాల జైలు అధికారులు కుల ప్రాతిపదికన వివక్షను ప్రోత్సహిస్తున్నాయని దాఖలైన అనేక పిటిషన్లపై ఈ గురువారం (అక్టోబర్ 3, 2024) సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన అక్టోబర్ 3 నాటి కాజ్ లిస్ట్ ప్రకారం.. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పనుంది. ఈ ఏడాది జనవరిలో కేంద్రంతో పాటు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌తో సహా 11 రాష్ట్రాలను కోర్టు స్పందన కోరింది.
ఈ రాష్ట్రాల జైలు మాన్యువల్‌ల్లలో పని కేటాయింపులో కుల వివక్ష చూపుతున్నాయని, ఖైదీలను ఉంచే స్థలాన్ని వారి కులం ఆధారంగా నిర్ణయిస్తారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. కేరళ జైలులో పాత నేరస్తులకు కొన్ని సౌకర్యాలు ఉంటాయి. అదే కొత్తవారైతే అలాంటివేమీ ఉండవు. పశ్చిమ బెంగాల్ జైలు కోడ్ ప్రకారం జైలులో పని కులాల ప్రాతిపదికన విభజిస్తారు. వంట పనిని ఆధిపత్య కులాలకు చెందిన ఖైదీలు చేయాలి. అలాగే అంట్లు తోమడం, జైలు కడగడం లాంటి పని వెనుకబడిన కులాలకు చెందిన ఖైదీలు చేయాలి.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూపొందించిన మోడల్ జైలు మాన్యువల్ ప్రకారం రాష్ట్ర జైలు మాన్యువల్‌లో సవరణలు చేసినప్పటికీ, రాష్ట్రాల జైళ్లలో కుల వివక్ష కొనసాగుతోందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.