– 2024 నీట్ పరిక్షని రద్దు చేయలని డిమాండ్
– ఒకవైపు ఈవీఎం టాంపరింగ్, మరోవైపు నీట్ లీకేజీలు
– బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.తుంగ బాలు
నిర్దేశం, హైదరాబాద్: దేశంలో వివాదాస్పదమైన నీట్ పరీక్షను రద్దు చేయాలని బీఆర్ఎస్వీ డిమాండ్ చేసింది. ఈ విషయమై మంగళవారం మద్యాహ్నం రాజ్ భవన్ ని ముట్టడించింది. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బీఆర్ఎస్వీ నాయకులు గవర్నర్ కార్యాలయాన్ని చేరుకున్నారు. 2024 మే 5న 571 పట్టణాల్లోని 4,750 కేంద్రాల్లో నిర్వహించిన మెడికల్ ప్రవేశ పరీక్ష NEET UG-2024ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రవేశ పరీక్షలో 67 మంది అభ్యర్థులు గరిష్టంగా 720కి 720 మార్కులు సాధించడం గిన్నిస్ రికార్డు సాధించడమేనంటూ బీఆర్ఎస్వీ నాయకులు ఎద్దేవా చేశారు.
కాగా, ఈ విషయమై బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.తుంగ బాలు స్పందిస్తూ.. ఎన్డీయే భాగస్వామ్యంలో ఉన్న బీహార్ రాష్ట్రం నీట్ పరీక్షకి అక్రమాలకు వేదిక కావడం సిగ్గుచేటని అన్నారు. టీనేజి వయస్సులో ఎంతో ఒత్తిడితో ఉండే 15 లక్షల విద్యార్థులతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడటం మంచిది కాదని విమర్శించారు. దేశంలో 70 వేల సీట్ల కోసం జరిగే నీట్ ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కన్నా డబ్బునే చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
నీట్ పరీక్షని నీట్ గా నిర్వహించలేరు, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఎంసెట్ ను పాతర వేశారంటూ బీఆర్ఎస్వీ నాయకులు మండిపడ్డారు. పేరుకు ఫెడరల్ వ్యవస్థ అయినా మొత్తం కేంద్రమే ఎటువంటి మోరల్ లేకుండా మోసం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోఒకవైపు ఈవీఎం టాంపరింగ్, మరోవైపు నీట్ లీకేజీలు కూటమి పార్టీలకు ప్యాకేజీలుగా మారాయని, తక్షణమే నీట్ 2024 పరీక్షను రద్దు చేసి, పరీక్ష మళ్లీ నిర్వహించాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. కాగా, రాజ్ భవన్ వద్ద నిరసన చేస్తున్న బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.