నిర్దేశం, హైదరాబాద్ః తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఫిజికల్ ప్రజెన్స్ లేకుండా కీలకమైన పరిణామాలు జరిగిపోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తర్వాత ఫామ్ హౌస్ కు వెళ్లిన కేసీఆర్ అప్పటి నుండి చిన్న ప్రకటన కూడా రీలీజ్ చేయలేదు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో తన పేరుపై సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. కానీ అందులో పోస్టులు పెట్టడం ఆపేశారు. అసలు రాజకీయంగా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. పార్టీ నేతలకూ ఆయన సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు కూడా కనిపించడం లేదు. కేటీఆర్ ఒంటరిగా పార్టీని లాగుతున్నారు. మధ్యలో హరీష్ కూడా తన వంతు సాయం చేస్తున్నారు.
కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి వస్తారన్న ప్రచారం జరిగింది. పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయని కారణంగా రైతుల్లో ఉన్న అసంతృప్తిని ఉద్యమంగా మార్చేందుకు ఆయన సిద్ధమవుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. ఒకటి రెండు రోజుల్లో టూర్ షెడ్యూల్ రెడీ అవుతుందని కూడా అన్నారు కానీ రెండు నెలలు గడుస్తున్నా ఆయన బయటకు రాలేదు. వస్తారన్న నమ్మకం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు లేదు. దీనికి కారణం కేటీఆర్ కూడా .. కేసీఆర్ వస్తారని ఉద్యమాలు చేద్దామని చెప్పడం లేదు.
ఎవరైనా కేసీఆర్ వస్తే బాగుండనే సహాలిస్తున్నా వెంటనే తుంచేస్తున్నారు కేటీఆర్. కేసీఆర్ లేని లోటును తీర్చేలా తానే ప్రతీ దానికి ముందు ఉండేలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. అందువల్ల ఆయన రాజకీయాల్లో ఢక్కా మొక్కీలు ఎదుర్కోలేదు. ఇప్పుడు అసలైన ప్రతిపక్ష నేతగా అనేక సవాళ్లను ఆయన ఎదుర్కోవాల్సి ఉంది. ఇప్పుడు ఎన్నో ఎదురు దెబ్బలు తిని రాటుదేలితేనే రాజకీయాల్లో మంచి భవిష్యత్ ఉంటుందన్న ఉద్దేశంతో కేటీఆర్‌కు ఫుల్ చార్జ్ ను కేసీఆర్ అప్పగించారని అంటున్నారు.
ఎంతో క్లిష్టమన సందర్భంలో తప్ప.. ఇతర విషయాల్లో కనీసం సలహాలు కూడా ఇవ్వడం లేదని మొత్తం కేటీఆర్ సామర్థ్యానికి వదిలేశారని చెబుతున్నారు. కేటీఆర్ కూడా ఇప్పుడు తనను తాను నిరూపించడానికి ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నారని అంటున్నారు. కేసీఆర్, కవిత ఇప్పుడల్లా మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చే చాన్స్ లేదని అంటున్నారు.