నిర్దేశం, జమ్మూ: లోక్ సభ ఎన్నికలు అయిపోయాయి. వరుసగా మూడోసారి భారతీయ జనతా పార్టీ విజయ దుందుభి మోగించింది. దీని తర్వాత భారతీయ జనతా పార్టీ ఎదుర్కోనున్న అతిపెద్ద పరీక్ష జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు. నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఆర్టికల్ 370 రద్దు ఒకటి. 2019 ఆగస్టులో పార్లమెంట్ ద్వారా ఇది రద్దైంది. దానికి ముందు 21 నవంబర్ 2018లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ రద్దైంది. అప్పటి నుంచి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనే సాగుతోంది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం అద్భుతాలు జరిగిపోయాయని మోదీ ప్రభుత్వం చెబుతోంది. మరి మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై జమ్మూ కశ్మీర్ ప్రజల తీర్పు ఎలా ఉంటుందనేది ఈ ఎన్నికల్లో తెలుస్తుంది.
బీజేపీకి ముస్లింల ముప్పు
భారతీయ జనతా పార్టీకి ఉన్న పెద్ద సమస్య ఆ రాష్ట్రంలో ముస్లింల జనాభా అధికంగా ఉండడం. జమ్మూ ప్రాంతంలో హిందూ జనాభా ఎక్కువగానే ఉన్నప్పటికీ కశ్మీర్ లోయ మొత్తంగా ముస్లింల జనాభే. పూర్తి హిందుత్వవాదంతో పోతున్న బీజేపీకి ముస్లింలు బద్దశత్రువులుగా మారారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ముస్లిం ప్రాంతాల్లో కూడా బీజేపీ సీట్లు గెలుచుకుంది. కారణం.. మిగతా భారత్ లోని ముస్లింలతో పోల్చుకుంటే జమ్మూ కశ్మీర్ ముస్లింలు ప్రత్యేకంగా ఆలోచిస్తారు. మరి ఈసారి వారు ఎలా ఆలోచిస్తారో చూడాలి.
పీడీపీ, ఎన్సీ విడిగా ఉండడం అడ్వాంటేజ్
జమ్మూ కశ్మీర్ ప్రాంతీయ పార్టీలైన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు విడివిడిగా పోటీ చేస్తున్నాయి. వాస్తవానికి ఈ రెండు పార్టీలు గుప్కార్ అలయన్స్ లో భాగంగా ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారాయి. ఈ రెండు పార్టీల వైరం బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. గతంలో బీజేపీతో కలిసి పీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బహుశా పీడీపీని ఎన్సీ, కాంగ్రెస్ కలిసి అటాక్ చేసి ముస్లిం ఓటు బ్యాంక్ ను తమకు డైవర్ట్ చేయొచ్చు. అలాగే ఎన్సీని చూపించి హిందూ ఓట్ బ్యాంక్ ను కాంగ్రెస్ కు కాకుండా బీజేపీ ప్రయత్నించొచ్చు. ఎటు చూసినా హిందూ డామినేటెడ్ సీట్లు బీజేపీవే అన్నట్లు కనిపిస్తోంది.
గులాం కలిసి వస్తారా?
కాంగ్రెస్ కు రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్ సొంతంగా డెమొక్రటిక్ ఆజాద్ అనే పార్టీని పెట్టారు. ఈయన బీజేపీతో కలిసి వచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎన్నికల్లో పోటీపై ఇప్పటికీ ఆజాద్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన పోటీ చేస్తారా లేదా అనే విషయం కూడా తెలీదు. ఇకపోతే.. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కసరత్తులో మిగతా పార్టీలతో పోలిస్తే బీజేపీ దూకుడు మీదుంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను మొదటి జాబితాలోనే 44 సీట్లు ప్రకటించింది. గత ఎన్నికల్లో 25 సీట్లు గెలిచి గేమ్ చేంజ్ చేసిన బీజేపీ.. ఈసారి కూడా పట్టు సాధిస్తే.. బీజేపీ సంపూర్ణ విజయం సాధించినట్టే.