రాజులు అవ్వండన్న బాబాసాహేబ్ మాటలు మనకింకా ఎక్కలేదు
– టోనీ బెక్కల్, రాజకీయ విశ్లేషకులు
మన దేశంలో ఉన్న కుల బానిసత్వం నుంచి బహుజన సమాజాన్ని విముక్తి చేయడం అంటే మన ఊహకు కూడా అందని ఒక అద్భుతం. అందుకే ఆయనను బాబాసాహేబ్ అని అంటారు. అంటే మరాఠీలో గొప్ప తండ్రి అని. ఒక తండ్రి తన పిల్లల పట్ల ఎంత దయతో, ఎంత ప్రేమతో ఉంటారో.. ఈ దేశంలో పీడిత సమాజాన్ని బాబాసాహేబ్ అంతలా ప్రేమించారు. అందుకే వారి కష్టాల సంకెళ్లను బద్దలు కొట్టగలిగారు. చెప్పుకుంటూ పోతే ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉంటాయి. అయితే వీటిపై ఏనాడూ గర్వం చూపించని బాబాసాహేబ్.. ఒక్కసారి మాత్రం ఆనందంతో పరవశించిపోయారు. నిజంగానే ఒక గొప్పది సాధించానన్న గర్వంతో ఉప్పొంగిపోయారు. బహుశా చాలా మందికి ఆ సంఘటన చాలా మందికి గుర్తుండదు. అది ఈ దేశంలోని ప్రజలకు వయోజనిత ఓటు హక్కును అందించినప్పుడు బాబాసాహేబ్ కళ్లల్లో కాంతులు కనిపించాయి.
మిగతా వాటికంటే ఓటు హక్కు విషయంలో బాబాసాహేబ్ కు అంత ప్రాధాన్యత ఉండడానికి కారణం ఉంది. మిగతా విషయాలు చాలా వరకు వ్యక్తిగతమైనవి కానీ, ఓటు అనేది దేశ పాలకులను నిర్ణయించే ఆయుధం. 2 వేల ఏళ్ల నుంచి అన్నింటికీ నిరాకరించబడిన బహుజన సమాజం నిర్ణయించినవారే ఈ దేశ పాలకులు అవుతున్నారంటే బాబాసాహేబ్ ఆనందం ఉండకుండా ఎలా ఉంటుంది. అందుకే ఎప్పుడూ చాలా బిజీగా, గంభీరంగా కనిపించే ఆయన.. ఆరోజు చాలా జాలీగా కనిపించారు. అందుకే.. “మేము ఈ దేశ పాలకులు కాబోతున్నామని మీ ఇంటి గోడల మీద రాసుకోండి” అని బాబాసాహేబ్ పిలుపునిచ్చారు. అంటరానితనం, బానిసత్వానికి చరమగీతం పాడాలంటే రాజకీయంగా ఎదగాలన్నారు. రాజకీయ అధికారం సాధించలేని జాతులు అంతరించిపోతాయని హెచ్చరించారు. పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని బాబాసాహేబ్ నినదించారు.
రాజకీయంతో మాత్రమే వెట్టిచాకిరినీ మూఢత్వాన్ని వెనుకబాటుతనాన్ని అంతం చేయగలమని నమ్మారు కాబట్టే స్వయంగా మూడు రాజకీయ పార్టీలు స్థాపించి, ఓటములు ఎదురైనా పలుమార్లు పోటీకి దిగారు. అణచివేతకు గురైన ప్రజలకు గొప్ప మానవత్వం ఉంటుందని, వారు ఏదో రోజు అధికారంలోకి వచ్చి ఈ దేశాన్ని తథాగత గౌతమ బుద్ధుడు సూచించిన సుందర దేశం చేయగలరని నమ్మారు. అందుకే శాసన సభకు సర్వాధికారాలు ఇచ్చారు. కానీ, ఆ మహనీయుడు మన మధ్య నుంచి వెల్లిపోయి 68 ఏళ్లు గడిచినా ఆయన కలలను మనం నెరవేర్చలేకపోయాం. బాబాసాహేబ్ ఆశించిన విధంగా మనం రాజకీయాల్లో గెలిచి అధికారం సాధించడం పక్కన పెడితే రాజకీయాల్నే అర్థం చేసుకోలేకపోయాం. అసలు రాజకీయాలకే దూరంగా ఉంటాం.
బానిసత్వంలో కూరుకుపోయిన బహుజన సమాజం.. రాజకీయం, అధికారం గురించి ఆలోచించవని, వారికి రిజర్వేషన్ అనే వెసులుబాటు కల్పించినా కూడా సామాజిక బానిసలు రాజకీయ బానిసలుగా మిగిలారే తప్ప.. తమ కాళ్లపై స్వతంత్రంగా నిలబడే అంబేద్కరైట్లుగా మాత్రం ఎదగలేకపోయారు. వీరిని చెంచాలని బహుజన నాయకుడు కాన్షీరాం ఉదహరించారు. అప్పటి అగ్రకుల రాజకీయ పార్టీలకు తొత్తులుగా ఉన్నవారికి దాదాపుగా అదే పేరుతో ఉదహరించారు. అంబేద్కరిజం అంటే జయంతి, వర్థంతులకు దండలు వేసి, దండాలు పెట్టడమేనన్ని సంస్కృతి నేటికీ కొనసాగుతోంది. ఇక అంబేద్కర్ ఆశయాలంటే చదువు చెప్పడం, సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం వరకే ఆగిపోయింది. అంబేద్కర్ ఫొటో చూపిస్తే ఓట్లేసేంత వరకు సమాజం ఎదిగింది కానీ, అంబేద్కర్ ఆశయాలు ఉన్న పార్టీకి ఓట్లేయాలన్నంత వరకు ఎదగలేదు.
ఈరోజు అంబేద్కరిజం అనేది పెద్ద మేనియా. అంబేద్కర్ జయంతి అనేది దేశంలోనే అతిపెద్ద పండుగ. అంతే కాదు, అంబేద్కర్ అనే పేరు అత్యంత బలమైన రాజకీయ నినాదం. మన దేశంలో ఒక్క అంబేద్కర్ తప్ప వేరే ఏ పేరు చెప్పినా ఓట్లు రావు. మరి ఇంత బలమైన రాజకీయ నామాన్ని స్మరించకుండా రాజకీయ పార్టీలు ఊరుకుంటాయా? కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాం. అంబేద్కర్ పేరు కూడా వినపడనివ్వకూడకుండా 60 ఏళ్లు దేశాన్ని పాలించింద కాంగ్రెస్. అయితే చివరికి వారికి అంబేద్కరే దిక్కయ్యారు. ఒక చేతిలో అంబేద్కర్ ఫొటో, మరొక చేతిలో రాజ్యాంగం ఫొటో పట్టుకుని ఓట్లు అడుక్కుంటోంది. కాంగ్రెస్ మీద రాజకీయంగా గెలిచేందుకు భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా ఇదే.
అంబేద్కర్ ను రాజకీయంగా ఇంతలా ఉపయోగించుకుంటుంటే.. బహుజన సమాజం మాత్రం ఆయన జయంతి, వర్థంతుల వద్దే ఆగిపోయింది. మేధావులనే చెప్పుకునే కొంత మంది కాంగ్రెస్, బీజేపీ లాంటి అగ్రకుల పార్టీల పంచన చేరి అంబేద్కర్ కు ఆ పార్టీలు చేసిన మెహర్బానీ గురించి గొప్పలు చెప్పే ప్రయత్నాలే చేస్తున్నాయి. ఇంకొంత మందికైతే అసలు రాజకీయమంటేనే గిట్టదు. తాము రాజకీయాలకే దూరమని గొప్పలు పోతారు. నిజానికి ఇలాంటివారు అంబేద్కరైట్లు ఎప్పటికీ కారు. అంబేద్కరిస్టులంటే సామాజిక పరివర్తతనో పాటు రాజ్యాధికార కాంక్ష-కార్యం ఉండాలి. బాబాసాహేబ్ కోరుకున్న వెనుకబడిన సమాజాన్ని అధికారం వైపు తీసుకెళ్లాలి. మీరు నిజంగా అంబేద్కరిస్టులేనా ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇక నుంచైనా అంబేద్కరిస్టుగా ఉండాలనుకుంటే ఎంతో పవిత్రమైన ఆ మహనీయుని జయంతి అయిన నేడే ఈ దేశంలో బహుజన రాజ్యం సాధిస్తామని ప్రతిణ పూనండి.