తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు పెరగొచ్చు!

నిర్దేశం, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 175 అసెంబ్లీ సీట్ల‌ను 225కు, అలాగే తెలంగాణాలో 119 నుంచి 153కు పెంచాల్సి వుంది. విభజన చట్టంలో ఉన్నవి 10 ఏళ్ల లోపు అన్నీ జరిగిపోవాలి. కానీ, నియోజకవర్గాల పెంపు మాత్రం ఇప్పటికీ జరగలేదు. జ‌నాభా గ‌ణ‌న చేసిన త‌ర్వాతే, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలను పెంచుతామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెబుతూ వ‌స్తోంది. అయితే తాజా పరిణామాలు గమనిస్తుంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై ఆశ‌లు చిగురించాయి. వ‌చ్చే ఏడాది నుంచి దేశ వ్యాప్తంగా జ‌నాభా గ‌ణ‌న చేప‌ట్టాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అది పూర్తైతే నియోజకవర్గాల పెంపు జరుగుతుందని అంటున్నారు.

నిజానికి ఈ జనగణన 2021లోనే జ‌ర‌గాల్సింది. కానీ, క‌రోనా కార‌ణంగా చేప‌ట్ట‌లేదు. ఎట్ట‌కేల‌కు నాలుగేళ్ల త‌ర్వాత జ‌నాభా గ‌ణ‌న చేప‌ట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ముందుకొచ్చింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో త‌ప్ప‌నిస‌రిగా అసెంబ్లీ సీట్లు పెరుగుతాయ‌ని కేంద్ర ప్రభుత్వమే స్పష్టం చేసింది. 2022లో రాజ్య‌స‌భ‌లో బీజేపీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర ప్ర‌భుత్వం స్పందిస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు రాజ్యాంగ సవరణ అవసరమని పేర్కొంది. సీట్లు పెంచాలంటే 2026 వరకు ఆగాల్సిందేనని, అప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం 2026 తర్వాత మొదటి జనాభా గణనను ప్రచురించిన తర్వాత రాష్ట్రాల అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య పెంపు ఉంటుందని రాత మూల‌కంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. “ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014లోని సెక్షన్ 26(1) ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో ఉన్న నిబంధనలకు లోబడి.. ఈ చట్టంలోని సెక్షన్ 15 ఎలాంటి పక్షపాతం లేకుండా.. ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225, తెలంగాణలో 119 నుంచి 153 స్థానాలకు పెరుగుతాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం, 2026 సంవత్సరం తర్వాత మొదటి జనాభా గణనను ప్రచురించిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య తిరిగి సర్దుబాటు ఉంటుంది” అని కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి స్ప‌ష్టం చేయ‌డం నేడు మళ్లీ తెర‌పైకి వ‌చ్చింది.

ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని ఉత్సాహం చూపిస్తున్న నాయ‌కుల‌కు జ‌నాభా గ‌ణ‌న తీపి క‌బురుగానే చెప్పాలి. ఎందుకంటే ఇది పూర్త‌యితే విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు త‌ప్ప‌ని స‌రి అని చెప్పొచ్చు. ఇందుకోస‌మే రాజ‌కీయ నాయ‌కులు ఎదురు చూస్తున్నారు. ఇక మరో భయం కూడా రెండు తెలుగు రాష్ట్రాలను వెంటాడుతోంది. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. దక్షిణాదిలో సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో దక్షిణాదిలో మరింత ఆందోళన నెలకొంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!