– రాజకీయ, ప్రభుత్వ పదవుల్లో సగం రెడ్డీలే
– రిజర్వుడు తప్ప ఎక్కడా కనిపించని ఎస్సీ, ఎస్టీలు
– 50% పైగా ఉన్న బీసీలకు 10% చోటు లేదు
– రేవంత్ ప్రభుత్వంలో అయితే మరీ దారుణం
నిర్దేశం, హైదరాబాద్: ‘‘ఇందుగలడందులేడని. సందేహము వలదు. ఎందెందు వెదకి చూచిన. అందందే గలడు’’.. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈమాట బాగా సరిపోతుంది. సరిగ్గా మాట్లాడితే తెలంగాణ జనాభాలో 10% ఉండదు రెడ్డి సమాజం. ముఖ్యమంత్రి కుర్చీ నుంచి గ్రామంలో సర్పంచ్ వరకు.. హైదరాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ నుంచి కింది అధికారుల వరకు అంతా వారే. అధికారంలోకి రెడ్డీలు రావడంతో ఇది మరింత విపరీతానికి పోతోంది. తమది ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి.. తన రెడ్డి కులానికే అన్ని పదవులు కట్టబెడుతున్నారు. బహుశా.. ఆయన దృష్టిలో రెడ్డీలు మాత్రమే ప్రజలు కావచ్చు.
కాంగ్రెస్ అంటేనే రెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి నుంచే కాంగ్రెస్ అంటే రెడ్డి, రెడ్డి అంటే కాంగ్రెస్. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కూడా మారనిది ఏదైనా ఉందంటే ఇదే. పార్టీ అధ్యక్షుడి నుంచి గ్రామ స్థాయి అధ్యక్షుడి వరకు వారే ఉంటారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా రెడ్లు నామినేషన్లతో వాలిపోతారు. వారికి కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి మరీ టికెట్లు ఇస్తుంటుంది. మధ్యలో ఒకరిద్దరు బీసీ వర్గాల నుంచి అధ్యక్షులు అయినప్పటికీ అనతి కాలంలోనే వారు మారిపోయారు. ఇక రెడ్డియేతరులకు కాంగ్రెస్ లో పదవులు ఉంటాయి కానీ, పదవులు ఉండవు.
40 మంది రెడ్డి ఎమ్మెల్యేలే
తెలంగాణ జనాభాలో పట్టుమని 10% కూడా లేని రెడ్డిలకు అన్ని రంగాల్లో సగం పదువులు దక్కుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో 40 మంది రెడ్డీలే. 17 ఎంపీ స్థానాలు ఉంటే.. అందులో ఐదుగురు రెడ్డిలే. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల్లో కూడా వీరి వాటా ఘననీయంగానే ఉంది. మంత్రివర్గం కూడా దాదాపు ఇలాగే ఉంది. సీఎం కాకుండా మొత్తం 11 మంది మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి ఎలాగూ రెడ్డి కులస్తులే. ఆయనతో పాటు మరో ముగ్గురు మంత్రులు రెడ్డీలు ఉన్నారు. వీరు కాకుండా అగ్రవర్ణాలకి చెందిన మరో ముగ్గురు మంత్రులు ఉన్నారు. కేవలం ఒక ఎస్టీ మంత్రి, ఇద్దరు ఎస్సీ మంత్రులు, ఇద్దరు బీసీ మంత్రులు మాత్రమే ఉన్నారు.
ఎక్కడా కనిపించని 90 శాతం ప్రజలు
తెలంగాణలో 90 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు అవకాశాల్లో మాత్రం 40% కూడా లేరు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది కాబట్టి.. అక్కడక్కడా వారి సంఖ్య కొంత కనిపిస్తుంది కానీ, బీసీలు అయితే చూపుకే బంగారం. ఈ అసెంబ్లీలో బీసీ ఎమ్మెల్యేలు జస్ట్ 22 మంది. ఉద్యోగాల్లో కూడా అంతే. ఇక ప్రభుత్వం నుంచి అందే కాంట్రాక్టుల్లో మళ్లీ రెడ్డిలు సహా అగ్రకులం వారే ఉన్నారు. అందులో ఎవరూ బహుజన వర్గాలు కనిపించరు. అవార్డులు, రివార్డుల్లో కూడా వీరి ఎక్కడో ఉంటారు.