– తిరిగి రావాలంటూ మద్దతుదారులు పెద్ద ఎత్తున డిమాండ్
– సోషల్ మీడియాలో రెండు రోజులుగా ట్రెండింగ్
– తిరిగి తీసుకునే ఆలోచనలో బీఎస్పీ సుప్రెమో మాయావతి
నిర్దేశం: లోక్‌సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ పరాజయం తర్వాత మాయావతి మేనల్లుడు ఆకాష్ ఆనంద్ తిరిగి రావాలని, ఆయనే పార్టీ అధినేతగా ఉండాలంటూ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. చిత్రంగా పార్టీ అభిమానులే కాకుండా, పార్టీ వ్యతిరేకులు, ఇతర పార్టీ నేతలు కూడా ఆకాష్ కు పార్టీ పగ్గాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం గమనార్హం. ‘ఆకాష్ ఆనంద్ వాపస్ ఆవో’ (ఆకాష్ ఆనంద్ తిరిగి వచ్చేయండి) అనే హాష్‌ట్యాగ్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. బీఎస్పీ బలపడాలంటే ఆకాష్ ఆనంద్ పునరాగమనం అవసరమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవడం గమనార్హం.
15 ఏళ్లలో చాలా మార్పు
గత కొన్ని ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఓట్ల శాతం తగ్గుతూ వస్తోంది. 2009 ఎన్నికల్లో 200 పైగా సీట్లతో అధికారం సాధించిన బీఎస్పీ 2024లో సున్నా సీట్లకు పడిపోయింది. నాగినా వంటి సాంప్రదాయ సీటులో కూడా ఆజాద్ సమాజ్ పార్టీ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ పోటీ చేసి బీజేపీ, ఎస్పీ, బీఎస్పీలను ఓడించారు. ఇక్కడ బీఎస్పీ అభ్యర్థి 13,272 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు.
ఎందుకు తొలగించారు
మాయావతి ఆకాష్ ఆనంద్‌ను జాతీయ సమన్వయకర్తగా, ఆమె వారసుడిగా చేశారు. లోక్‌సభ ఎన్నికల తొలి రెండు దశల్లో ఆకాష్ ఆనంద్ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఆయన దూకుడు శైలి యువతను ఆకట్టుకుని పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కానీ ఆయన ప్రసంగాలలో ఒక విషయంపై వివాదం ఏర్పడడంతో ఆయన అపరిపక్వంగా ఉన్నారని మే 7న మాయావతి పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత ఆకాష్ ఆనంద్ ఎక్కడా ప్రచారంలో కనిపించలేదు.
తిరిగి రానున్న ఆకాష్
బహుజన్ సమాజ్ పార్టీలో తన పాత పొజిషన్ లోకి ఆకాష్ తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. పార్టీ చీఫ్ మాయావతి ఈ విషయమై పార్టీలో అంతర్గతంగా చర్చించారని, పార్టీ మద్దతుదారుల నుంచి ఆయనకు మంచి ఆదరణ ఉందనే విషయం చర్చలోకి వచ్చింది. దీంతో మళ్లీ ఆకాష్ ను తన పదవిలోకి తీసుకోవాలని మాయావతి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నెల ముగిసే లోపు ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నారు.