మళ్లీ సెంటిమెంట్ ఆలోచనలో గులాబీ దళం
హైదరాబాద్, నిర్దేశం:
తెలంగాణలో తమ ఇమేజ్ తగ్గిపోతుందని భావించినప్పుడల్లా బీఆర్ఎస్ కి ఒక బ్రహ్మాస్త్రం దొరుకుతుంది. ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య సెంటిమెంట్ రెచ్చగొట్టేలా మాట్లాడుతుంటారు ఆ పార్టీ నేతలు. తాజాగా తెలంగాణ నీళ్లను ఏపీ నాయకులు దొంగిలించుకు పోతున్నారంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఈ ధోరణి మరింత పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్లపై పట్టింపు లేదన్నారాయన. ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ నేతలు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే అయినా.. ఎవర్ గ్రీన్ పాయింట్ లాగా దీన్ని రైజ్ చేస్తూ సింపతీ కోసం చూస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.టీడీపీలో చంద్రబాబు, కేసీఆర్ కలసి పనిచేశారు. నందమూరి తారక రామారావుపై అభిమానంతో తన కుమారుడికి తారక రామారావు అనే పేరు పెట్టుకున్నారు కేసీఆర్. అయితే ఆ తర్వాత మాత్రం చంద్రబాబు అంటే కేసీఆర్, కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలంతా ఎగిరిపడుతున్నారు. అదే సమయంలో జగన్ ని మాత్రం కేసీఆర్ బాగా దగ్గరకు తీస్తుంటారు. తాజాగా మరోసారి జగన్ పై బీఆర్ఎస్ ప్రేమ బయటపడింది. వైసీపీ హయాంలో తెలంగాణ నీళ్లను ఏపీ తీసుకెళ్లలేదని, చంద్రబాబు సీఎం అయ్యాకే ఈ ధోరణి పెరిగిందంటున్నారు జగదీష్ రెడ్డి. నాగార్జున సాగర్ పూర్తిగా చంద్రబాబు చేతుల్లోకి వెళ్లిపోయిందని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకు సాగర్ వద్ద ఏపీ సీఆర్పీఎఫ్ బలగాలను రానివ్వలేదని అన్నారాయన. ములుగు సీఆర్పీఎఫ్ బలగాలయినా, విశాఖ బలగాలయినా.. అవి కేంద్ర బలగాలు, రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉన్నా కూడా అవి కేంద్ర బలగాలనే గుర్తించాలి.
మరి కేంద్రానికి చెందిన బలగాలు ప్రాజెక్ట్ ల వద్ద పహారా కాస్తుంటే జగదీష్ రెడ్డికి వచ్చిన అభ్యంతరమేంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.నీటి విషయంలో గతంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరోసారి అవే డైలాగులు చెబుతున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. కాళేశ్వరం తప్పుల్ని కప్పి పుచ్చుకోడానికి నానా తంటాలు పడిన బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని సాకుగా చూపించి ప్రజల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఏపీలో టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. వాస్తవానికి ఎన్డీఏకి, కాంగ్రెస్ కి పూర్తిగా పొసగదు. అలాంటప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీలోని కూటమి ప్రభుత్వంతో ఎందుకు లాలూచీ పడుతుంది. ఒకవేళ పడినా, తెలంగాణ ప్రజల భవిష్యత్ ని పణంగా పెడితే అది రాజకీయంగా తమకు ఇబ్బంది అనే విషయం నాయకులకు తెలియదా..? ఈ లాజిక్ తెలియకుండా జగదీష్ రెడ్డి ఏపీ పేరు చెప్పి తెలంగాణలో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్దగా పబ్లిసిటీ లేకపోవడంతో.. సభ ఫ్లాప్ అవుతుందేమోననే ఉద్దేశంతో ఇప్పుడిలా మాట్లాడుతున్నారని, ప్రజల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. మొత్తమ్మీద బీఆర్ఎస్ కి జగన్ పై సాఫ్ట్ కార్నర్ ఉందనే విషయం మరోసారి రుజువైంది. అదే సమయంలో చంద్రబాబుపై మాత్రం ఆ పార్టీ నేతలు కోపంతో రగిలిపోతున్నారు. బాబుని చూపించి తెలంగాణలో మరోసారి సెంటిమెంట్ రాజేయాలనుకుంటున్నారు.