– వచ్చిన పదవి వచ్చినటే వెనక్కి పోతుంది
– కాంగ్రెస్ లో అత్యంత దురదృష్ట నేత
– సొంత పార్టీనే కుట్రపన్నుతుందని ప్రజల్లో చర్చ
– అన్నీ భరిస్తూ.. సెల్ఫీ వీడియోతో కవరింగ్
నిర్దేశం, హైదరాబాద్ః కొన్ని విచిత్రమైన కలలు వస్తుంటాయి. అనుకున్నది, ఆశపడ్డది, అర్హమైనది ఏదో వస్తుంటటుంది. అడుగు దూరంలో ఉంటుంది కానీ, ఎంత ప్రయత్నించినా చేతికంతదు. విపరీతంగా ప్రయత్నిస్తుంటాం, చేతికి అందినట్టే అందుతుంది, కానీ అందదు. మెలకువ వస్తే కానీ తెలియదు.. అది కల అని. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ రాజకీయ జీవితం కూడా ఇలాంటి విచిత్రమైన కలనే. బహుశా.. దీనిని అద్దంకి కల అనే కంటే కాంగ్రెస్ కళ అంటే ఇంకా బాగుంటుందేమో.
సరే.. అది పక్కన పెడితే అద్దంకి రాజకీయ దుస్థితి గురించి మాట్లాడుకుంటే ఎమ్మెల్యే దగ్గరి నుంచి ఎన్నో పదవులు గుమ్మం వరకు వచ్చి వెనక్కి వెళ్లాయి. వాటికవే వెళ్లాయి అనేకంటే, కొన్ని కుట్రల కారణంగా వెనక్కి తీసుకున్నారంటే బాగుంటుందేమో. కారణం.. కులమో, గుణమోనని విడమర్చి చెప్పనక్కర్లేదు. కానీ వెళ్తున్నాయి. రెండు ఎమ్మెల్యేగా కేవలం 2 వేల ఓట్లతో పరాజయం పాలైన అద్దంకికి.. ఆ తర్వాత టికెట్ రావడమే గగనమైంది. కొత్తగా వచ్చినవారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అవుతున్నారు. కానీ, అద్దంకికి మాత్రం అన్నీ అడ్డంకులే.
ఎంపీ పదవి పోయింది, ఎమ్మెల్సీ పదవి పోయింది. కనీసం కార్పొరేషన్ పదవికి కూడా నోచుకోని నేత. అలా అని ఆయనేదో చిన్నా చితకా లీడర్ అంటే కాదు. మీడియా ఆఫీసులో కూర్చుంటే కాంగ్రెస్ తరపున ఫుట్ బాల్ ఆడేస్తారు. కాంగ్రెస్ పార్టీని అద్దంకి డిఫెన్స్ చేసినంతగా తెలంగాణలో మరో నేత చేయలేరు. అలాగే కాంగ్రెస్ పార్టీ అద్దంకికి నామం పెట్టినంతగా మరే పార్టీ పెట్టదేమో. కాంగ్రెస్ కు ఏ కష్టమొచ్చినా వెంటనే మీడియా ముందు వాలిపోయే అద్దంకికి.. కాంగ్రెస్ నుంచి మాత్రం ఏ పదవీ ఓరకంటనైనా చూడకపోవడం శోచనీయం.
పార్టీల్లో ముఖ్య నాయకులకు పదవులు మిస్సైతే.. పార్టీలో పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి. పార్టీ అధినేతలే సంజాయిషీ ఇచ్చుకుంటారు. కానీ, అద్దంకి విషయంలో అలా కాదు. ఆయనకు అన్యాయం జరిగితే పార్టీ నుంచి ఒకరూ మాట్లాడరు. సరికదా.. ఆయనే తన మొబైలో సెల్ఫీ ఓపెన్ చేసి.. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అని తనకు తాను ఓదార్పునిచ్చుకుంటారు. ఇది కదా రాజకీయ చమత్కారం అంటే.
ప్రతి రాజకీయ నేతకు బయటి పార్టీ శత్రువుల కంటే సొంత పార్టీ శత్రువుల బెడదే ఎక్కువ. అద్దంకిని అతి దారుణంగా వెంటాడుతున్న రాజకీయ వైఫల్యం ఇదే. బహుశా.. ఈ మాట ఆయనకు రాజకీయంగా ఇబ్బందిగా ఉంటే ఉండొచ్చు. కానీ, తుంగతుర్తి ప్రజలే కాదు, కాంగ్రెస్ ఎరిగిన ప్రతి ఒక్కరూ అంటున్న మాట ఇదే. తుంగతుర్తి ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం అయినప్పటి నుంచి డైరెక్ట్ పోటీకి దూరంగా ఉన్నప్పటికీ.. అక్కడి కాంగ్రెస్ ఆధిపత్యం అంతా రాంరెడ్డి దామోదర్ రెడ్డిదేనని అక్కడి ఓటర్లే చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ అడ్డుకున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఉవాఛ. ఇక తమ అభ్యర్థిని బరిలోకి దింపి ఓట్లు చీల్చి ఓడగొట్టింది కోమటిరెడ్డి బ్రదర్స్ అని టాక్. ఇంతే కాదు, గత ఎన్నికల్లో ఈ బ్రదర్సే ఢిల్లీకి వెళ్లి మరీ మందుల సామ్యూయేల్ కు టికెట్ తెచ్చారని కూడా టాక్.
రాజకీయంగా రభస అనుకునే ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలకు కూడా ఖండించే ధైర్యం లేదు. ఇంత జరిగినా అద్దంకి మాత్రం సెల్ఫీ వీడియోతో వచ్చి కాంగ్రెస్ తనకేదో గొప్పది, ఉన్నతమైంది ఇవ్వబోతుందని కప్పిపుచ్చుకోవడం విడ్డూరం. ఇంతా చూసినవారికి అద్దంకిని చూసి అయ్యయ్యో అనుకోవడం తప్పితే మిగిలిందీ ఇంకేం లేదు.