భర్తను ఇంట్లోనే దహనం చేసిన భార్య
కర్నూలు మే 29 : పిల్లలిద్దరూ సెటిలయ్యారు. అయినా సరే తల్లిదండ్రుల సంపాదనపై ఆశ. అదే ఆ తల్లి ఎవరూ చేయని పని చేసేలా చేసింది. భర్త చనిపోయిన విషయం ఎవరికీ తెలియకుండా ఇంట్లోనే అంతిమ సంస్కారాలు నిర్వహించేలా ప్రేరేపించింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు..
విచారణ జరపగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణానికి చెందిన 60 ఏళ్ల పోతుగంటి హరికృష్ణ ప్రసాద్, లలిత భార్యాభర్తలు. వీరిద్దరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు దినేశ్ కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తుండగా.. చిన్న కుమారుడు కెనడాలో స్థిరపడ్డాడు. ఇంటివద్దే ఉంటూ జీవనం సాగిస్తున్న దంపతులు మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు.
అయితే సోమవారం ఉదంయ హరికృష్ణ ప్రసాద్ ఇంటి నుంచి పొగలు రావడాన్ని గమనించిన కాలనీ వాసులు… స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై వెంకటేశ్వర్లు వెంటనే సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వచ్చారు. ఇంట్లో ఉన్న లలితను విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. లలిత భర్త హరికృష్ణ ప్రసాద్ అనారోగ్ంతో సోమవారం ఉదయం కన్నుమూశారు. అది గమనించిన లలిత ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా.. ఇంట్లోనే అంతిమ సంస్కారాలు నిర్వహించాలనుకుంది.
వెంటనే పెట్రోల్ పోసి నిప్పంటించేసింది. అయితే తమను కుమారులు సరిగ్గా చూసుకోవడం లేదని.. ఆస్తి కోసం మాత్రం వాళ్లు తమ వద్దకు వస్తున్నారని లలిత చెబుతోంది. భర్త చనిపోయిన విషయం తెలిస్తే ఎక్కడ వచ్చి ఆస్తి పంపించవమంటారోనన్న భయంతోనే ఈ పని చేసినట్లు లలిత వివరించిందని పోలీసులు చెబుతున్నారు