క్యాబినెట్‌లోకి రాములమ్మ?
హైదరాబాద్, నిర్దేశం:
కాంగ్రెస్ ఎమ్మెల్సీగా అనూహ్యంగా విజయశాంతి పేరును తెరమీదకు తెచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. ప్రకటించిన మూడు పేర్లలో అద్దంకి దయాకర్ మినహా శంకర్ నాయక్, విజయశాంతి పేర్లు ఉంటాయని ఎవరూ పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ హఠాత్తుగా రాములమ్మను రంగంలోకి దించడం వెనుక కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ వేసిందంటున్నారు. బీఆర్‌ఎస్‌లో కీలకంగా ఉన్న కల్వకుంట్ల కవితకు దీటుగా ఉండే మహిళానేతగా విజయశాంతిని ప్రొజెక్ట్ చేయబోతోందట కాంగ్రెస్. అటు మండలిలో..ఇటు ప్రజాక్షేత్రంలో కవితను సమర్ధవంతంగా విజయశాంతి ఎదుర్కొంటారన్న భావిస్తున్నారట కాంగ్రెస్ నేతలు. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విజయశాంతి సైలెంట్‌గా ఉంటున్నారు.ఓ రకంగా రాజకీయాలకు అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తూ వస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆమె పెద్దగా యాక్టీవ్‌గా లేరనే చెప్పాలి. అప్పుడప్పుడు పలు అంశాలపై ట్వీట్స్ చేయడం తప్పితే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడమే మానేశారు రాములమ్మ. ఇదిగో ఇలాంటి సమయంలోనే అనూహ్యంగా ఎమ్మెల్సీగా విజయశాంతి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.అయితే అంతా అనుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని హఠాత్తుగా ఏమి రంగంలోకి ఏమీ దింపలేదని తెలుస్తోంది. పక్కా ప్రణాళికతో, ముందు చూపుతోనే రాములమ్మను తెరపైకి తీసుకువచ్చారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కూతురు కవిత చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు.అన్ని రాజకీయ అంశాల్లో తనదైన స్తైల్లో స్పందిస్తున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను మండలి నుంచి మొదలు అన్ని సందర్భాల్లో తీవ్రస్థాయిలో ఎండగడుతూ వస్తున్నారు. శాసనమండలిలో కవిత లేవనెత్తే అంశాలపై అధికార పక్షం సమర్ధవంతంగా స్పందించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. అందుకే కవితకు దీటుగా ఉండే మహిళా నేత అవసరం ఉందని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని తెరపైకి తీసుకొచ్చిందని అంటున్నారు.శాసనమండలిలో కవిత ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉండగా..ఇప్పుడు విజయశాంతి కూడా ఎమ్మెల్సీగా మండలిలో అడుగుపెట్టబోతున్నారు.
దీంతో ఇకపై మండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య జరిగే చర్చలు రసవత్తరంగా మారనున్నాయని భావిస్తున్నారు. మండలిలోనే కాకుండా రాజకీయంగా పలు అంశాల్లోనూ కవితను రాములమ్మ దీటుగా ఎదుర్కొని, అన్ని విషయాలలో సమర్ధవంతంగా సమాధానం చెబుతారని అంచనా వేస్తున్నారు.ప్రభుత్వ వైపల్యాలను ఎండగట్టే సమయంలో, విమర్శలు చేయడంలోనూ కవితను ఎదుర్కోవడంలో విజయశాంతి వాక్చాతుర్యం పనిచేస్తుందని కాంగ్రెస్ నేతలు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అంతే కాదు గతంలో బీఆర్ఎస్‌లో కేసీఆర్‌తో కలిసి పనిచేసిన రాములమ్మ .. గులాబీ పార్టీని కూడా అన్ని అంశాల్లో కార్నర్ చేయడంలో సక్సెస్ అవుతారని అంచనా వేస్తున్నారు.కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను రాజకీయంగా దీటుగా విమర్శించే మహిళా నేతగా రాములమ్మను క్యాబినెట్‌లోకి తీసుకునే అవకాశం లేకపోతేదని టాక్ గాంధీభవన్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాములమ్మను పార్టీలో చేర్చుకున్నప్పుడు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారట హస్తం పార్టీ పెద్దలు.అటు హామీని అమలు చేయడంతో పాటు ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మీద బాణాలు ఎక్కుపెట్టేందుకు రాములమ్మ వాక్చాతుర్యం పనికొస్తుందని భావించారట కాంగ్రెస్ నేతలు. విజయశాంతి బీఆర్ఎస్‌ను ఎంతవరకు కార్నర్ చేయగలుగుతారో చూడాలి మరి.