‘‘ ఆమెను ఆమెలా ఉండనివ్వండి’’ ఆకట్టుకున్న మిర్చి ‘‘లెట్ హర్ బీ’’

‘‘ ఆమెను ఆమెలా ఉండనివ్వండి’’
ఆకట్టుకున్న మిర్చి ‘‘లెట్ హర్ బీ’’

( గణేష్ తాండ )

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘‘ ఆమెను ఆమెలా ఉండనివ్వండి’’ అంటూ 98.3 మిర్చి వినూత్నమైన కార్యక్రమం ‘లెట్ హర్ బీ’ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. సమాజంలో మగవాళ్లకు లేని నియమ నిబంధనలు మహిళలకు ఉంటాయి. సంకెళ్ల లాంటి జడ్జిమెంట్స్, అనుచిత అభిప్రాయాలను పక్కన పెట్టి ‘‘ ఆమెను ఆమెలా ఉండనివ్వండి’’ అనే నినాదంతో రేడియో మిర్చి ‘‘ లెట్ హర్ బి’’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది. మహిళల సామర్థ్యాన్ని వెలికి తీయడం, వారికి తమ స్వంత వ్యక్తిత్వంతో నిలదొక్కుకునే అవకాశాన్ని కల్పించాలనే సందేశాన్ని ఇస్తూ ‘‘లెట్ హర్ బి’’ కొనసాగింది. మార్చి 6న ప్రారంభమై, మూడు రోజుల పాటు కొనసాగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న మహిళా అతిథులు ఆసాంతం ఆకట్టుకున్నారు.


మహిళా ఆర్టీసీ కండక్టర్లతో మిర్చి ఆర్జే భార్గవి ప్రత్యేకంగా నిర్వహించిన మాట ముచ్చటలో ఉత్సాహంగా సాగింది. కుటుంబాలను ముందుకు నడిపించడంలో, సమాజంలో కీలక పాత్ర పోషించడంలో ఈ మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ళు, సమస్యలతో పాటు తాము తమ లక్ష్యాలను ఎలా సాధిస్తున్నారో మిర్చి శ్రోతలతో కండక్టెర్లు పంచుకున్నారు. డీజీపీ సీఐడీ, మహిళా భద్రతా విభాగం డైరెక్టర్ శిఖా గోయల్ తో నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మహిళా భద్రత, సాధికారతపై అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా తీసుకుంటున్న చర్యలపై ఆమె విలువైన ఆలోచనలు పంచుకున్నారు.

మహిళలకు కూడా తమకంటూ చాలా కోరికలు ఉంటాయి. కానీ, వాటిని బయటకు చెప్పుకునే స్వేచ్చ కూడా వారికి ఉండదు. ఈ నేపథ్యంలో ‘‘ వుమెన్స్ విష్ లిస్ట్’’ పేరుతో మిర్చి స్వాతి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనికోసం ఆమె నగరంలో వివిధ రంగాల్లో పని చేస్తున్న సాధారణ మహిళలతో ముచ్చటించి, వారి కోరికలు, ఆశలు, ప్రాధాన్యతలను మిర్చి శ్రోతలకు తెలియజేయడంతో, మహిళల తాలూకు కొత్త కోణాన్ని మిర్చి స్వాతి వెలికితీయగలిగారు. వీరితో పాటు నటీమణులు తమ విష్ లిస్ట్ ని స్వాతితో పంచుకున్నారు. వీరిలో ప్రముఖ నటీమణులు ఆమనితో పాటు నిత్య శెట్టి, నిత్య శ్రీ ఉన్నారు. ‘‘మహిళల విష్ లిస్ట్ లో స్వేచ్చ ఉండాలి. రాత్రి పూట కూడా ధైర్యంగా బయటకు వెళ్లి రావాలి. ఎలా ఉన్నా జడ్జిమెంట్ చేయకూడదు’’ అని ఆమని చెప్పిన మాటలు ఆలోచింపజేశాయి.
మధ్యాహ్నం షోస్ లో మిర్చి అమృత కింది స్థాయి నుంచి, కఠిన పరిస్థితుల నుంచి ఎదిగి వచ్చిన మహిళలను స్టూడియోకి తీసుకొచ్చి అనేక విషయాలు శ్రోతలకు తెలియజేశారు. మహిళలు తమదైన స్థైర్యంతో ఎదగడం ఎలా? మహిళలు విజయం సాధిస్తే సమాజం ఎలా బలపడుతుందో అమృత చర్చించారు. అమృత షోలో ప్రముఖ బిల్డర్ ఏస్తర్ రాణి చెప్పిన విషయాలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. “నారి” చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన సీనియర్ నటి ఆమని, ఆర్జే సరన్ షోలో తన భిప్రాయాలను పూర్తి స్థాయిలో పంచుకున్నారు. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ళు, ఆమె జీవన ప్రయాణం, ఆమెను బయటి వాళ్లు జడ్జ్ చేసే విషయాలను చాలా అందంగా, శ్రోతలతో పంచుకున్నారు. ఈ వినూత్న కార్యక్రమంలో ప్రత్యేక చెప్పుకోవాల్సిన పేరు ఆర్జే శ్వేత. మహిళలపై ఉన్న అనుచిత అభిప్రాయలు, జడ్జిమెంట్స్ ని ప్రశ్నిస్తూ… మహిళా సాధికారతను ఉద్దేశిస్తూ రూపొందించిన ప్రత్యేక గీతం అందరినీ ఆకట్టుకుంది.

‘‘సమానత్వం తీసుకురావడమే మహిళా దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని మా బాధ్యతగా తీసుకుని, లెట్ హర్ బీ కార్యక్రమం నిర్వహించాం. దీనికి శ్రోతల నుంచి వచ్చిన స్పందనలు మాకు చాలా సంతోషంగా కలిగించాయి. ఆమెను ఆమెలా ఉండనిస్తే… మనం ఇంకా ఆరోగ్యకరమైన సమాజాన్ని చూడొచ్చనే ఆలోచనకు ఈ కార్యక్రమం’’ అని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కంటెంట్ లీడర్ తేజ కొవ్వలి చెప్పారు. ‘‘ అందరికంటే భిన్నంగా ఆలోచించంచడం,అందరికంటే కొత్తగా హృదయానికి హత్తుకునేలా సందేశం ఇవ్వడంలో మా మిర్చి ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. లెట్ హర్ బీ కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఈ కార్యక్రమం ఇచ్చిన ఉత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని వినూత్న కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం’’ అని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బిజినెస్ డైరెక్టర్ హర్మన్ జీత్ సింగ్ పేర్కొన్నారు.

ఒక మహిళ జీవితంలో ఉండే భయాలు, బాధ్యాతలు, సెలబ్రేషన్స్, ప్రేమ, అనుబంధాలు ఇలా ప్రతి ఒక్క విషయం మీద మిర్చి ఆర్జేలు మాట్లాడారు. హైదరాబాద్ నుండి ఆర్జే అమృత, ఆర్జే భార్గవి, ఆర్జే స్వాతి, ఆర్జే శ్వేత, ఆర్జే సరన్ లు మూడు రోజుల పాటు ‘‘ లెట్ హర్ బి’’ కార్యక్రమాలు నిర్వహించగా… వైజాగ్, విజయవాడ స్టేషన్స్ నుండి ఆర్జే కావ్యాశ్రీ, ఆర్జే ఫర్హాత్, ఆర్జే ప్రేమ్ ‘‘ షీరో’’ పేరుతో మహిళా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »