ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు పీఏ అరెస్ట్
హైదరాబాద్, నిర్దేశం:
తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలతోపాటు, తమకు అనుకూలంగా లేనివారి ఫోన్లు ట్యాప్ చేయించింది. 2023 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంవిచారణకు ఆదేశించింది. పోలీసులు ఇప్పటికే విచారణ జరిపి పలువురిని అరెస్టు చేశారు. ఏడాదికాలంగా వారు జైల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఇటీవలే రాధాకిషన్‌రావుకు హైకోర్టు, తిరుపతన్నకు సుప్రీంకోర్టు కండీషన్ బెయిల్ ఇచ్చాయి. ప్రణీత్‌రావుకు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న పెద్దలు ఎవరన్నది మాత్రం ఇప్పటికీ తేలలేదు. ఈ తరుణంలో కేసు విచారణ నత్తనడకనా సాగుతున్న సమయంలో ఒక ట్విస్ట్ చోటుచేసుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరింపులు, వేధింపులకు గురిచేసిన ఫిర్యాదుకు సంబంధించి పంజాగుట్ట పోలీసులు వేగం పెంచారు. ఓ రైతుకు తెలియకుండా డ్యాకుమెంట్స్‌తో హరీశ్‌రావు పీఏ వంశీకృష్ణ సిమ్‌కార్డు కొనుగోలు చేసి ఆ సిమ్ వినియోగించి బెదిరింపులకు చక్రధర్‌గౌడ్‌ను బెదిరించాడు. విచారణలో నిర్ధారణ కావడంతో హరీశ్‌రావు పీఏ వంశీకృష్ణతోపాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా ఈనెల 28 వరకు ముగ్గురికి రిమాండ్ విధించారు. సిద్దిపేట జిల్లాలో చక్రధర్ గౌడ్ ఎలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా వంశీకృష్ణ, సంతోశ్ కుమార్, పరశురాములు కలిసి ఓ రైతు గుర్తింపు కార్డులతో సిమ్ కార్డు కొనుగోలు చేసి బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఆరోగ్యశ్రీ శాఖలో పనిచేస్తూ అవినీతికి పాల్పడినట్లు హరీశ్ రావు పీఏ వంశీకృష్ణపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అతడు కీలక వ్యక్తిగా ఉన్నారు. ఆరోగ్యశాఖ మంత్రిగా హరీశ్ రావు ఉన్నప్పుడు ఆయన పేషీలో వంశీకృష్ణ పనిచేశారు. గతేడాది ఫోన్ ట్యాపింగ్, బెదిరింపులపై చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు తాజాగా ఆ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 28వ తేదీ వరకు ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించారు.డీఎస్పీ ప్రణీత్‌రావు సహాయంతో సిద్దిపేటలో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసి 2023 నుంచి తన ఫోన్‌తోపాటు, తన భార్య, కుటుంబ సభ్యులు, డ్రైవర్ సహా అందరి ఫోన్లనూ ట్యాప్ చేశారని చక్రధర్‌గౌడ్ ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తనపై అక్రమ కేసులు పెట్టి పలు రకాలుగా వేధించారని చక్రధర్‌గౌడ్ ఆరోపణలు చేశారు. ఈ కేసులో ఏ1గాహరీష్ రావు, ఏ2గా రాధాకృష్ణన్ రావులు ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ప్రణీత్‌రావుకు బెయిల్ లభించింది. నాంపల్లి కోర్టు ఆయనకు ఫిబ్రవరి 14న బెయిల్ ఇచ్చింది. ప్రణీత్‌రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ప్రణీత్‌రావు ఏ–2గా ఉన్నారు. ఇదే కేసులో నిందితులగా ఉన్న తిరుపతన్న, ప్రభాకర్‌రావు, భుజంగరావుకు అనారోగ్య కారణాల దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరైంది. రాధాకిషన్‌రావుకు హైకోర్టు, తిరుపతన్నకు సుప్రీంకోర్టు కండీషన్ బెయిల్ ఇచ్చిందని.. ఈ క్రమంలో సంవత్సర కాలంగా చంచల్గూడా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రణీత్‌రావుకు కండీషన్ బెయిల్ ఇవ్వాలని కోరడంతో.. వాదనలను పరిగణనలోకి తీసుకుని కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.