నవ భారత జాతి పిత, రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహేబ్ అంబేద్కర్ మీద కేంద్ర హోంమంత్రి, భారతీయ జనతా పార్టీ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్ని ఒక ఊపు ఊపేస్తున్నాయి. ఈ విషయమై ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా నిరసనలు చేస్తోంది. ఈమధ్య కాలపు రాజకీయాల్ని చూస్తున్నవారికి కాంగ్రెస్ కాస్త మృదువుగా, లౌకికంగా కనిపిస్తుండొచ్చు కానీ, బాబాసాహేబ్ పోరాటమంతా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే సాగింది. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి దాదాపుగా ఆయన మరణించే వారకు కాంగ్రెస్ పార్టీతో పోరాడుతూనే ఉన్నారు. గాంధీ-నెహ్రూ-కాంగ్రెస్ లను బహుజన సమాజానికి (ముఖ్యంగా దళితులకు) ప్రధాన శత్రులుగా అంబేద్కర్ చెప్పేవారు. అంబేద్కర్ ను అణచివేసేందుకు కాంగ్రెస్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈరోజు కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ ఫొటోలు, రాజ్యాంగం కాపీలతో కనిపిస్తున్నారు కానీ, కాంగ్రెస్ తో అంబేద్కర్ కు జరిగిన పోరాటం గురించి ప్రతి భారతీయుడు తప్పకుండా తెలుసుకోవాలి.
స్వాతంత్ర్యానికి పూర్వం అంబేద్కర్-కాంగ్రెస్ మధ్య విభేదాలు
అంబేద్కర్, కాంగ్రెస్ మధ్య మొదటి అభిప్రాయ భేదం ఏమిటంటే, 1936 ఆగస్టు 15న కాంగ్రెస్ ను కాదని ప్రత్యేక రాజకీయ పార్టీ (ఇండిపెండెంట్ లేబర్ పార్టీ)ని స్థాపించారు అంబేద్కర్. దళితుల ప్రయోజనాలను కాపాడడమే ఈ పార్టీ ప్రధాన లక్ష్యం. వాస్తవానికి కాంగ్రెస్ పద్ధతులతో అంబేద్కర్ ఏకీభవించలేదు. దళితుల సమస్యలను కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అణగారిన వర్గాల హక్కులు, సామాజిక-ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి స్వతంత్ర రాజకీయ వేదిక అవసరమని అంబేద్కర్ విశ్వసించారు. అందుకే ఆ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత, 1938లో కాంగ్రెస్ ఒక బిల్లును తీసుకువచ్చింది. దళిత సంఘం పేరును ‘హరిజన్’గా మార్చాలని ఆ బిల్లు ఉద్దేశం. ఈ బిల్లును అంబేద్కర్ తీవ్రంగా విమర్శించారు. పేరు మార్చుకుంటే సమస్యలు పరిష్కారం కావని, దళితుల అసలు సమస్య సామాజిక వివక్ష, వారి హక్కుల పట్ల అజ్ఞానాన్ని తొలగించడాని కాంగ్రెస్ తో వాదించారు.
స్వాతంత్య్రానంతరం అంబేద్కర్-కాంగ్రెస్ మధ్య విభేదాలు
నెహ్రూ ప్రభుత్వంలో అంబేద్కర్ దేశ మొదటి న్యాయ, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంతో ఆయనకు అనేక విషయాలపై భిన్నాభిప్రాయాలు ఉండేవి. అందుకే అంబేద్కర్ ఎక్కువ కాలం మంత్రిగా కొనసాగలేదు. 1951లో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దానికి కారణం హిందూ కోడ్ బిల్. అంతే హిందూమతంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టే బిల్లును అంబేద్కర్ తీసకువచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును పాస్ కానివ్వలేదు. జన్‌సంఘ్ కు చెందిన శ్యామప్రసాద్ ముఖర్జీ, ఆర్‌ఎస్‌ఎస్ హిందూ సంప్రదాయవాద నాయకులు కూడా వ్యతిరేకించారు.
నెహ్రూ అనుసరిస్తున్న విదేశాంగ విధానాలపై అంబేద్కర్ కు చాలా భేదాభిప్రాయాలు ఉండేవి. నెహ్రూ ప్రభుత్వాన్ని బలంగా వ్యతిరేకించేవారు. కశ్మీర్‌కు ప్రత్యేక హోదా విషయంలో కూడా ఇదే జరిగింది. ఒక దేశ భూభాగంలో ఉన్న ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో చేర్చడాన్ని వ్యతిరేకించారు.
అంబేద్కర్ వర్సెస్ కాంగ్రెస్: మొదటిసారి ఎన్నికల పోటీ
1952లో జరిగిన భారతదేశంలో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో అంబేద్కర్, కాంగ్రెస్ పార్టీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీని కడిగిపారేసేవారు. ముఖ్యంగా అట్టడుగు కులాల విషయంలో కాంగ్రెస్ వైఖరి బ్రిటిషర్ల కంటే దారుణమని చెప్పేవారు.” అంత కంటే పాత నియంతృత్వం, అంత కంటే అణచివేత, అంతకంటే వివక్ష. స్వాతంత్ర్యం తరువాత, కాంగ్రెస్ పార్టీ ధర్మశాలగా మారింది, ఇక్కడ విలువలకు స్థానం లేదు. మూర్ఖులు, దుష్టులతో నిండిపోయింది” అని అంబేద్కర్ అన్నారు.
అక్టోబర్ 1951- ఫిబ్రవరి 1952 మధ్య జరిగిన ఈ ఎన్నికలలో అంబేద్కర్ బొంబాయి నార్త్ సెంట్రల్ నుంచి పోటీ చేశారు. అశోక్ మెహతా నేతృత్వంలోని సోషలిస్టు పార్టీ ఆయనకు మద్దతు ఇచ్చింది. ఇది ద్వంద్వ సభ్యత్వ నియోజకవర్గం. అంటే ఒక సాధారణ అభ్యర్థితో పాటు ఎస్సీ/ఎస్టీ అభ్యర్థి ఒకే స్థానంలో పోటీ చేస్తారు. (1932లో అంబేద్కర్ సాధించిన కమ్యూనల్ అవార్డు ఇదే. తర్వాత గాంధీ వల్ల ఇది పోయింది). ఈ ఆచారం 1961 వరకు దేశంలో ప్రబలంగా ఉంది. ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ నేత ఎస్.ఎ. డాంగే వంటి సీనియర్ నేత అంబేద్కర్ కు పోటీగా నిలబడ్డారు. అయితే ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ్ సదోబా కజ్రోల్కర్‌పై 15,000 ఓట్ల తేడాతో అంబేద్కర్ ఓడిపోయారు.
అయితే, ఈ ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు జరిగాయని అంబేద్కర్ ఆరోపించారు. 5 జనవరి 1952 నాటి పీటీఐ నివేదిక ప్రకారం.. “బొంబాయి ప్రజల అఖండమైన మద్దతును ఎంత దారుణంగా తప్పుదోవ పట్టించగలిగారనేది ఎన్నికల కమీషనర్ దర్యాప్తు చేయవలసిన వాస్తవం” అని అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్, అశోక్ మెహతా ఇద్దరూ కలిసి ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ఫలితాన్ని రద్దు చేయాలని, అది చెల్లదని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో 74,333 బ్యాలెట్ పేపర్లు తిరస్కరణకు గురయ్యాయి. అంటే ఆ ఓట్లను లెక్కించలేదు. అంబేద్కర్ ఓడిపోయింది 15,000 ఓట్లతో. ఈ ఓటమికి కమ్యూనిస్టులను సైతం అంబేద్కర్ విమర్శించారు. తన ఓటమి కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారని అంబేద్కర్ అన్నారు.
1954 ఎన్నికల్లో రెండోసారి ఢీ
అంబేద్కర్ ఓడిపోయినప్పటికీ, కాంగ్రెస్ ఆయనను రాజ్యసభ సభ్యునిగా నియమించింది. కానీ అంబేద్కర్ ఆ పదవి తీసుకోవడానికి సముఖత చూపలేదు. కారణం, తన శత్రువులపై ఆధారపడటం ఇష్టం లేదు. ప్రజా బలంతో గెలిచే లోక్‌సభలో తిరిగి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అందులో భాగంగా.. 1954లో మహారాష్ట్రలోని భండారా నియోజకవర్గం నుండి ఉప ఎన్నికలో రెండవసారి పోటీకి దిగారు. కాంగ్రెస్ మరోసారి ఆయనను ఓడించింది. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి 8,500 ఓట్ల మెజారిటీ వచ్చింది. రాజ్యసభ ఇవ్వడానికి ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీనే అంబేద్కర్ ను మరోసారి ఓడించింది.
అంబేద్కర్‌ను పావులా మార్చాలనుకున్న కాంగ్రెస్
అంబేద్కర్‌కు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదు. 1952, 1954 ఎన్నికల్లో అంబేద్కర్ ను కాంగ్రెస్ ఓడించిందన్న విషయం తెలుసుకున్నాం. అయితే అంతకు ముందు 1946లో జరిగిన మరొక ఉదంతాన్ని గుర్తు చేసుకోవాలి. అప్పటి రాజ్యాంగ పరిషత్ కు పశ్చిమ బెంగాల్ లోని జెస్సోర్-ఖుల్నా నియోజకవర్గం నుంచి 1946లో అంబేద్కర్ ఎన్నికయ్యారు. అయితే రాజ్యాంగ పరిషత్‌కు అంబేద్కర్ ఎన్నికను కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు ఎవరూ ఇష్టపడలేదు. ముఖ్యంగా వల్లభాయ్ పటేల్, బిజి ఖేర్, కిరణ్ శంకర్ రాయ్ బహిరంగంగానే తీవ్రంగా వ్యతిరేకించారు. నెహ్రూకి కూడా ఇష్టం లేదు. అందుకే 1947లో దేశ విభజన సమయంలో అంబేద్కర్ గెలిచిన ఆ నియోజకవర్గాన్ని తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్)లో కలిపేసింది కాంగ్రెస్. దాంతో ఆయన రాజ్యాంగ సభకు దూరమయ్యారు.
తిరిగి రాజ్యాంగ పరిషత్తుకు ఎలా వచ్చారు?
రాజ్యాంగ పరిషత్‌లో అణగారిన వర్గాలకు సరైన భాగస్వామ్యం లేకపోవడంపై బ్రిటన్ ప్రధానిని కలిశారు అంబేద్కర్. తాను లేకపోతే షెడ్యూల్డ్ కులాలు సహా మిగిలిన వెనుకబడిన సమాజాన్ని కాంగ్రెస్ నిలువెల్లా ముంచుతుందని తన ఆవేదనను బ్రిటన్ ప్రధానితో చెప్పారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ, నెహ్రూకి గట్టిగా చెప్పారు బ్రిటన్ ప్రధాని. దీంతో రాజ్యాంగ సభలోకి అంబేద్కర్ ను తీసుకోక తప్పలేదు కాంగ్రెస్ పార్టీకి. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్, బి.జి. ఖేర్ వంటి ప్రముఖ కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్‌లోకి తిరిగి ప్రవేశించడాన్ని సమర్థించారు. ప్రారంభంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, డాక్టర్ అంబేద్కర్‌కు ఉన్న అపార అనుభవం కారణంగా గాంధీ, నెహ్రూలు తరువాత అంగీకరించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన డాక్టర్ ఎంఆర్ జయకర్ బొంబాయి నియోజకవర్గం నుంచి రాజీనామా చేయడంతో అంబేద్కర్‌కు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, తిరిగి రాజ్యాంగ సభకు వచ్చారు.
తన సొంత ప్రాంతం బొంబాయిలో దళితులను కాంగ్రెస్ వశపర్చుకోవడంతో అంబేద్కర్ కు ఏమాత్రం సంబంధం లేని బెంగాల్ వరకు వెళ్లవలసి వచ్చింది. 1940 సమయంలో షెడ్యూల్డ్ కులాల హక్కులు, ప్రాతినిధ్యంపై అంబేద్కర్ కు కాంగ్రెస్ కు మధ్య చాలా వివాదాలు జరిగాయి. కాంగ్రెస్ విధానాలను అంబేద్కర్ తీవ్రంగా విమర్శించేవారు. ఈ నిరసనను కాంగ్రెస్ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. అంబేద్కర్ సహా ఆయన మద్దతుదారులు, అభ్యర్థులను ఓడించే బలమైన దళిత అభ్యర్థులను ఎంపిక చేయాలని సర్దార్ పటేల్ ను బొంబాయికి పంపారు.
శత్రువ్వాన్ని దాటి హీరోగా నిలిచిన అంబేద్కర్
కాంగ్రెస్ పార్టీతో రాజకీయ శత్రుత్వం ఉన్నప్పటికీ, రాజ్యాంగ సభకు వచ్చిన తర్వాత, డాక్టర్ అంబేద్కర్ తన కాంగ్రెస్ సహచరులతో కలిసి భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. రాజ్యాంగాన్ని రూపొందించే పనిని చాలా చక్కగా, హేతుబద్ధంగా చేశారు. దేశంలోని అన్ని వర్గాలకు సమానమైన, న్యాయమైన రాజ్యాంగాన్ని తయారు చేయడమే తన ప్రధాన లక్ష్యమని అంబేద్కర్ చెప్పడమే కాదు, నిరూపించారు కూడా. అంబేద్కర్ దృక్పథం చూసి కాంగ్రెస్ నాయకులకు దిగ్భ్రాంతి కలిగించింది. చాలా మంది కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ పట్ల ప్రభావితమయ్యారు. ఆయనతో మెతకగా వ్యవహరించడం ప్రారంభించారు. విమర్శకులు కూడా ఆయన శైలిని, పని తీరును మెచ్చుకోవడం ప్రారంభించారు.
బాబాసాహేబ్ అంబేద్కర్ తన జీవిత చరమాంకం వరకు ఈ దేశంలోని బహుజన సమాజం గురించి తపన పడ్డారు. ఏ సందర్భంలోనూ తన పోరాటాన్ని వదులుకోలేదు. తన సమాజం కోసం శత్రువుతో కూడా కలిసి పని చేయడానికి సిద్ధమయ్యారు. అలా అని ఎప్పుడూ వారికి లొంగిపోలేదు. తన ఆశయాలకు భంగం కలుగుతుందనుకుంటే ఎవరితోనైనా క్షణంలో విభేదించేవారు. అందుకే అంబేద్కర్ ను తన దారికి తెచ్చుకుందామని కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దేశంలోని 90 శాతం బహుజన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా హక్కులు కల్పించిన ఆయన.. ఆధ్యాత్మికంగా కూడా నూతన మార్గాన్ని చూపించాలనుకున్నారు. అందుకే బౌద్ధమతాన్ని స్వీకరించారు. అయితే బౌద్ధం తీసుకున్న 6 నెలలకే ఆయన మరణించారు. మరింత కాలం బతికుంటే వెనుకబడిన కులాల్లోని కోట్లాది మంది నేడు బౌద్ధులుగా మారిపోయేవారు. ఇంతటి గొప్ప వ్యక్తి కాబట్టే ఒక్క మన దేశానికే కాదు, ప్రపంచ మానవాళికి మహనీయుడు అయ్యారు బాబాసాహేబ్ అంబేద్కర్.
– టోనీ బెక్కల్, రాజకీయ విశ్లేషకులు