– టీఆర్పీ కోసం వెర్రివేషాలు వేస్తోన్న మీడియా
– యూట్యూబ్ వచ్చాక ఈ పిచ్చి మరీ ఎక్కువైంది
– వ్యక్తిగత జీవితాలకు శాపంగా మీడియా అత్యుత్సాహం
– చెప్పేవి నీతి వ్యాక్యలు.. టెలికాస్ట్ అయ్యేవి గాచిప్స్ కథలు
నిర్దేశం, హైదరాబాద్ః అదేదో సినిమాలో.. బ్రహ్మానందం రిపోర్టరుగా ఫీల్డుకు పోతాడు. అక్కడొక యువకుడు సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ యాంకర్ సరళకు చెప్తుంటాడు. అయితే, సదరు యువకుడు సూసైడ్ చేసుకోవడం లేట్ అవుతుంది. రిపోర్టర్ బ్రహ్మానందానికి చిర్రెత్తుకొచ్చి అతడి చేత బలవంతంగా పురుగుల మందు తాగిస్తాడు. ఆ తర్వాత యువకుడు ప్రాణాలతో కొట్టుకుంటుంటే టీఆర్పీ పెంచుకునేందుకు దాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తారు. తెలుగు మీడియా అచ్చం ఇలా ఉందంటే కరెక్టు కాదేమో. ఇంత కంటే ఎక్కువే ఉందనడం కరెక్ట్. ఎందుకంటే, బ్రహ్మానందం చేసిన ఆ సీన్.. మన తెగులు మీడియా నుంచి స్ఫూర్తి పొందిందే.
మోహన్ బాబు విషయంలో అతి చేసింది మీడియానే
సరే డైరెక్టుగా విషయంలోకి వద్దాం.. మూడు-నాలుగు రోజులుగా సీనియర్ నటుడు మోహన్ బాబు గురించి మీడియాలో రచ్చ నడుస్తోంది. మీడియా కెమెరాలు కూడా ఆయన ఇంటి చుట్టే తిరుగుతున్నాయి. అలా అని మోహన్ బాబుకు ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు తెలియలేదు. మర్డరూ జరగలేదు. పోనీ, వాళ్లింట్లో ఓ వంద కిలోల గంజాయైనా దొరికిందంటే అదీ కాదు. విషయం ఏంటంటే.. మోహన్ బాబుకి, ఆయన రెండవ కొడుకు మనోజ్ కు మధ్య ఆస్తి తగాదా నడుస్తోంది. పోనీ.. ఇదేమైనా కొత్త విషయమా అంటే అదీ కాదు. ఎంత ఆస్తి ఉంటే అంత గొడవా అని.. భారతీయ సమాజంలోని 90 ఇళ్లల్లో కామన్ గా జరిగే గొడవ. వాళ్లు సెలెబ్రిటీలు కాబట్టి రిపోర్టింగ్ చేయడం తప్పేమీ కాదు. కానీ, మీడియా అతి చేసి దాన్ని జనరంజకం చేశాయనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.
మంచు ఫ్యామిలీపై తీవ్ర ట్రోలింగ్
మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య చాలా కాలంగానే గొడవ జరుగుతోంది. అయితే తాజాగా మరోసారి వారి మధ్య గొడవ పెద్దదైంది. అయితే అక్కడ జరిగేదానితో పాటు కల్పితాలు కూడా మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిగో తోక అంటే, అదిగో పులి అన్నట్లు పుకార్లు రాజ్యమేలాయి. మీడియాకు ఇంకేం పని లేనట్లు, దేశంలో ఇంకేమీ జరగనట్టు మంచు కుటుంబం కాంట్రవర్సీని వేరే లెవల్ కు తీసుకెళ్లారు. హేళనలు, ప్రేలాపణలు.. అబ్బో.. గత మూడు రోజులుగా మంచు కుటుంబం కంచు పగలగొట్టారు. మీడియా చేసిన ఈ అతిని సోషల్ మీడియా వేరే లెవెల్ కు తీసుకెళ్లింది. తమ కుటుంబ గొడవను మరీ ఇంత కాంట్రవర్సీ చేస్తే సహజంగానే ఎవరికైనా కోపం వస్తుంది. కోపిష్టైన మోహన్ బాబు లాంటివారికైతే చిర్రెత్తుకొస్తుంది. అక్కడ జరిగింది కూడా అదే. అలా అని మోహన్ బాబు చేసింది కరెక్ట్ కాదు. దశాబ్దాల పాటు మీడియాతో మెదిలి పబ్లిక్ లైఫ్ లో ఉన్న వ్యక్తి అలా విచక్షణ కోల్పోకూడదు. అరవడం, అసహనం చూపించడం వేరు. కానీ, కొట్టడం దుర్మార్గమే. పైగా, ఏదో మాట్లాడడానికి వచ్చినట్టుగా దగ్గరికి వచ్చి కొట్టడం కిరాతకం.
యూట్యూబ్ వచ్చాక ఈ పిచ్చి ఎక్కువైంది
నిజానికి, తెలుగు మీడియాకు ఉన్న సర్వసాధారణమైన అలవాటే ఇది. పైగా, మెయిన్ స్ట్రీం చానల్స్ కి యూట్యూబ్ చానల్స్ కి మధ్య భీబత్సమైన వీవర్స్ ఫైట్ జరుగుతోంది. ఇక ఊరుకుంటారా.. అత్తాకోడళ్ల గొడవైనా సరే, స్నేహితుల మధ్య తగువైనా సరే, ప్రేమికుల యవ్వారం అయినా సరే.. దేన్నీ వదిలిపెట్టడం లేదు. సందు దొరికితే కెమెరాను బాత్రూంలోకి కూడా తీసుకెళ్లి అతి చేసేంతలా తయారయ్యరు (మొన్నామధ్య రాహుల్ గాంధీ బస్సులో ఉన్న టాయిలెట్ లోకి వెళ్లి మరీ గొప్పలు చెప్తూ వీడియో చేశారనుకోండి). కోతికి దొరికిందే కొబ్బరి అన్నట్లు.. ఏదైనా దొరికిందంటే.. ముందు వెనుక చూడడం లేదు, మంచి చెడు ఆలోచన ప్రస్తావనే లేదు. మీడియానే దాన్ని కాంట్రవర్సీ చేస్తోంది. అతి చేసి, చేయించి టీఆర్పీ పెంచుకుంటోంది. సుశాంత్ సింగ్ చనిపోయినప్పుడు అతడి గర్ల్ ఫ్రెండ్ రియాను మీడియా అతి దారుణంగా వేధించింది. రాత్రింబవళ్లు ఇంటిచుట్టూ కెమెరాలతో కూర్చున్నారు. ఇక శ్రీదేవి చనిపోయినప్పుడు అయితే, మీడియా చనిపోయిన సంఘటనపై చేసిన ఫ్రాంకు వీడియోలు మరీ దుర్మార్గం. నిన్నీ మధ్య ఒక అఘోరీ వెంట తీసిన పరుగుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది.
చెప్పేవి నీతి వాక్యాలు, టెలికాస్ట్ అయ్యేవి..
మీడియా అనగానే ఎక్కడా లేని గర్వం వస్తుంది. ప్రపంచాన్ని తామే నడిపిస్తున్నట్టు, ప్రజలను తామే ఉద్దరిస్తున్నట్టు, తాము మాత్రమే నిజాలు మాట్లాడుతున్నట్టు, తాము మాత్రమే నిష్పక్షపాతంగా ఉన్నట్టు భలే నీతులు చెప్తారు. మీడియా చానల్స్ లోగోలు చూస్తే ఈ యతి కనిపిస్తుంది. ప్రతి అక్షరం ప్రజల పక్షం అని ఒకటి, మెరుగైన సమాజం కోసం అని మరొకటి, ప్రతి క్షణం ప్రజా హితం అని మరొకటి, ఈ టీవీ మీ టీవీ అని ఇంకొకటి.. ఇలా.. ఈ ట్యాగ్ లైన్ చూస్తూ దిద్దతిరిగిపోతుంది. మరి చానల్ ఓపెన్ చేసి చూస్తే.. 10లో ఒకటి కూడా ప్రజా వార్తలు ఉండవు. గాసిప్స్, గ్యాంగ్ వార్స్, ఘర్షణ.. అన్నీ ఇలాంటివే ఉంటాయి. ఇంస్టాగ్రాంలో రీల్స్ చేసుకునే వారిని తీసుకువచ్చి ఇంటర్వ్యూ చేస్తారు. ఆ హీరోయిన్ ఎవరితో డేటింగ్ చేస్తుందో తెలుసా అంటూ గంటలపాటు స్టోరీలు చేస్తారు. బిగ్ బాస్ లాంటి వాటి గురించి లైవ్ అప్డేట్స్ ఇస్తారు. ఇక రాజకీయ-సామాజిక అంశాలంటారా.. ఏ ఏ చానల్ ఏ పార్టీకి పని చేస్తుందో, ఏ సామాజిక వర్గంవైపు ఉంటుందో లోకానికి తెలియనిది కాదు.
మీడియా వ్యాపారమా? సమాజ సేవనా?
ప్రజలు ఏది చూస్తారో అదే చూపిస్తున్నామనే వాదన మీడియాలో పని చేసే వారి నుంచి వినిపిస్తుంటుంది. ఏ చానల్ కు అయినా ఆదాయమే ప్రధానం. ఆదాయం లేకుండా ఏదీ చేయరు. మరలాంటప్పుడు తామేదో దేశ సేవ చేస్తున్నట్లు బిల్డప్ ఎందుకు? ఎంత మీడియా అయితే మాత్రం.. వ్యక్తిగత జీవితాల్లో కెమెరాలు పెట్టి కామెంట్లు చేసేంత అతి ఉంటే ఎట్లా? మీడియా పని చేసే వారికి కూడా వ్యక్తిగత జీవితాలు ఉంటాయి. వారి వ్యవహారాల గురించి ఇలాగే లైవ్ పెడితే ఊరుకుంటారా? ప్రజా అవసరాల్లో చొరవ తీసుకోవడం మంచిదే. కానీ, పనిమాలిన విషయాల్లో ప్రెస్ కార్డు చూపించి కాలర్ ఎగరేయడమే ఒగరుగా ఉంటుంది. మీడియా నిజంగా ప్రజా సేవలో ఉంటే నైతికంగా వ్యవహరించాలి. లేదు, వ్యాపారమే అంటే, ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే అర్హత లేదు. అది చట్ట విరుద్ధం కూడా. అలా అని, మీడియాను ఎవరూ నిరోధించలేరు. మీడియానే తనకు హద్దులు పెట్టుకోవాలి. సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి.
అసలు జర్నలిజం అనేది ఉందా?
తెలుగు మీడియాలో జర్నలిజం ఉందా అనేది అతిపెద్ద ప్రశ్న. ప్రతి చానల్ కు ఒక పార్టీ ఉంది. సారీ.. ప్రతి పార్టీకి ఒక చానల్ ఉంది. ఒక పత్రికా ఉంది. కొన్ని పార్టీలకైతే రెండు కంటే ఎక్కువే ఉన్నాయి. నిజానికి తెలుగు మీడియా అంతే ఇవే ఉన్నాయి. బహిరంగంగా రాజకీయ పార్టీలకు కొమ్ము కాసే చానళ్లు, పత్రికలు కూడా ప్రతిక్షణం ప్రజల పక్షం అని గంటకోసారి చెప్పుకుంటుంటే నవ్వే వస్తుంది. ఇక రాజకీయ పార్టీల నుంచి పుట్టినవి కాకుండా మిగతావి జర్నలిజాన్ని ఎర్నలిజంగా వాడుకుంటున్నాయి. ఎక్కడ ఆదాయమార్గముంటే అటు కొమ్ము కాస్తాయి. రాజకీయం వర్కౌట్ కాకుంటే మనం ముందే చెప్పుకున్నట్లు కాంట్రవర్సీల మీద చిల్లర ఏరుకుంటున్నాయి. ఈ మధ్య కాలంలో యూట్యూల్ చానళ్లు విపరీతంగా పెరిగిపోయాయి. అవైతే మరీనూ. ఎవరైనా చానల్ పెట్టొచ్చు, జర్నలిజంలో స్థిర పడొచ్చు. అయితే, కనీస భాష తెలియదు. కంటెంట్ అవగాహన కూడా ఉండదు. ఇలాంటి వాళ్లు వచ్చి ఇండిపెండెంట్ జర్నలిస్ట్, ఇంటలీజెండ్ మీడియా అనుకుంటూ అతి చేస్తేనే అసహ్యంగా ఉంటుంది.
– టోనీ బెక్కల్