పండుగల సీజన్ కొనసాగుతోంది. త్వరలో దీపావళి పండుగ కూడా రాబోతోంది. దీపావళికి వివిధ రకాల పిండి వంటలు, స్వీట్లు ఇంట్లో తయారు చేసుకుంటారు. ఇక, దీపావళికి చాలా మంది బహుమతులు ఇస్తూ ఉంటారు. ఇదో సంప్రదాయం. ఇక, చాలా మంది బాదం పప్పుల్ని గిఫ్ట్‌గా ఇస్తుంటారు. లేదంటే బాదం పప్పులతో చేసిన స్వీట్స్ బంధువులకు పంపుతుంటారు. దీంతో దీపావళికి బాదం పప్పుకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అంతే కాకుండా బాదం పప్పుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
➵ బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
➵ బాదంలో విటమిన్-ఇ, కాల్షియం, శరీరానికి మేలు చేసే కొవ్వులు, పీచు పదార్థాలు, రైబోప్లోవిన్, మాంగనీస్, కాపర్ సైతం ఉంటాయి.
రోజుకు ఎన్ని తీసుకోవాలి?
➵ పెద్దవాళ్లు రోజుకు ఎనిమిది నుంచి పదికి బాదం పప్పులను మించకుండా తీసుకోవాలి.
➵ పిల్లలు నాలుగు నుంచి ఆరు బాదం పప్పులను తీసుకోవాలి. అయితే,
➵ బాదంను నేరుగా తినేయకుండా నీటిలో 7 నుంచి 8 గంటలు నానబెట్టి, తొక్క తీసి తినాలి.
➵ నానబెట్టడం వల్ల పోషకాలు వేగంగా శరీరానికి అందుతాయి.
➵ బాదం ఆరోగ్యానికి మంచిది కదా అని అతిగా తినేయకండి.
➵ బాదం మొతాదు మించితే కొవ్వులు అమాంతంగా పెరిగిపోతాయి.
➵ శ్వాస సమస్యలు కూడా ఏర్పడవచ్చు.
➵ అతిగా బాదం తింటే శరీరంలో విషతుల్యాలు పెరిగే అవకాశం ఉంది.
ఎముకల బలోపేతానికి
➵ బాదం వల్ల శరీరానికి కాల్షియం లభిస్తుంది.
➵ పాలల్లో ఉన్నట్లే బాదంలో కూడా నాలుగో వంతు కాల్షియం ఉంటుంది.
➵ దీని వల్ల మీ ఎముకలు బలోపేతమవుతాయి. విరిగిపోకుండా స్ట్రాంగ్‌గా ఉంటాయి.
➵ బాదంలో పాస్పరస్ శాతం కూడా అధికం. ఇది మీ శరీరంలోని ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
➵ రక్తంలోని చక్కెర స్థాయిలను సైతం బాదం నియంత్రిస్తుంది.
➵ డయాబెటీస్ బాధితుల్లో మెగ్నీషియం లోపాన్ని బాదంతో భర్తీ చేయొచ్చు.
➵ బాదం తినేవారిలో టైప్-2 డయాబెటీస్, మెటాబాలిక్ (జీవక్రియ) సిండ్రోమ్ తదితర రసమస్యలు అదుపులో ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో గుర్తించారు.
నానబెట్టే ఎందుకు తినాలి
➵ బాదం పప్పులను రాత్రి నానబెట్టి.. ఉదయాన్నే తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
➵ ఎందుకంటే, బాదం పప్పులు మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్ధం మన శరీరం పోషకాలను గ్రహించకుండా చేస్తుంది.
➵ అందుకే బాదం పప్పులను నానబెట్టి తొక్కను తీసేసి తినడం ఉత్తమం.
➵ పుట్టుకతో వచ్చే లోపాలు రాకుండా చేసే ఫోలిక్ యాసిడ్ నాన బెట్టిన బాదంలో సమృద్ధిగా ఉంటుంది.
➵ నాన బెట్టిన బాదంలోని లిపేజ్ అనే ఎంజైమ్ అరుగుదలకీ, అనవసరమైన కొవ్వు కరగడానికీ ఉపయోగపడుతుంది.
➵ బాదం తింటే త్వరగా ఆకలి వేయదు.
➵ నానబెట్టిన బాదంలో ఉండే ఫ్లేవనాయిడ్స్ ట్యూమర్ ని పెరగనివ్వవు.
➵ బాదం పప్పులు గుండెకు మేలు చేస్తాయి.
➵ వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి.
➵ బాదం పప్పులో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకల బలానికి ఉపయోగపడతాయి.
➵ బాదం పప్పులు తింటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
➵ షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంచడానికి బాదం పప్పులు బాగా సహకరిస్తాయి. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో లాభాలు ఉన్నాయి.
అయితే, మార్కెట్‌లో ఉన్న డిమాండ్ కారణంగా కొందరు వ్యాపారులు నకిలీ బాదం పప్పును అమ్ముతున్నారు. నకిలీ బాదం పప్పుతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సంపూర్ణ పోషకాహార నిపుణుడు ప్రియాంషి భట్నాగర్ ప్రకారం.
➵ వ్యాపారులు హైడ్రోజన్ పెరాక్సైడ్, బ్లీచింగ్ ఏజెంట్లు వంటి హానికరమైన రసాయనాలను బాదంపప్పు రంగు పెరగడానికి వాడుతున్నారు.
➵ ఇవి కడుపు సమస్యలు, అలెర్జీలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.
➵ జీర్ణవ్యవస్థ పాడు అవుతుంది.
➵ కడుపు, ప్రేగుల లైనింగ్‌ను చికాకుపరుస్తాయి.
➵ కడుపు నొప్పి, వికారం, వాంతులు విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
➵ ఎక్కువ కాలం తినడం వల్ల శరీరంలో విష పదార్థాలు చేరుకుంటాయి. వీటిలో ఉండే రసాయనాలు కాలేయం, మూత్రపిండాలను దెబ్బతీస్తాయి.
➵ శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీంతో మీరు సులభంగా ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడతారు.
➵ కొన్ని బ్లీచింగ్ ఏజెంట్లు శరీరంలో క్యాన్సర్‌ను కూడా కలిగిస్తాయి.
➵ దురద, దద్దుర్లు వంటి తేలికపాటి లక్షణాల నుంచి అనాఫిలాక్సిస్ వంటి తీవ్రమైన పరిస్థితులకు గురవుతారు.
నకిలీ బాదం పప్పుల్ని ఎలా గుర్తించాలి?
➵ కొన్ని బాదంపప్పులను తీసుకుని శుభ్రమైన గిన్నెలో లేదా కంటైనర్‌లో ఉంచండి. గిన్నె శుభ్రంగా ఉండాలని గుర్తించుకోండి.
➵ గిన్నెలో బాదం పూర్తిగా మునిగిపోయేలా తగినంత నీరు కలపండి. వాటిని రాత్రంతా నాననివ్వండి.
➵ మరుసటి రోజు ఉదయం, బాదంపప్పును నీటిలో నుంచి తీసి.. వాటి తొక్క తీయండి.సహజ బాదంపప్పుల పొట్టు తేలికగా వస్తుంది. తొక్క తీసిన తర్వాత బాదం పప్పు తెల్లగా ఉంటుంది.
➵ నీరు గోధుమ రంగులోకి మారితే బాదంపప్పులో రసాయనాలు వాడినట్లు అర్థం.
➵ అదే నకిలీ బాదం పప్పుల తొక్క మాత్రం సులువుగా రాదు. చాలా కష్టంగా వస్తుంది. అంతేకాకుండా నీటి రంగును తనిఖీ చేయండి. నీటి రంగు శుభ్రంగా ఉంటే బాదం పప్పు మంచిదని అర్థం చేసుకోవచ్చు.
నకిలీదని గుర్తించగానే ఫుడ్ సేఫ్టీ అధికారులకు గాని పోలీసులకు గాని సమాచారం అందించండి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో మీ వంతు సహకారం అందించండి.