నిర్దేశం, న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికలు హర్యానా, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లోనే జరిగాయి. మెజారిటీ తగ్గిన బీజేపీ, పుంజుకున్న కాంగ్రెస్ వాదనల నేపథ్యంలో ప్రారంభమైన ఈ ఎన్నికలు దేశ వ్యాప్తంగా చాలా ఆసక్తిని రేపాయి. ఇక పోలింగ్ అనంతరం వచ్చిన ఎగ్జిట్ పోల్స్ డిఫరెంట్ మూడ్ ను ప్రొజెక్ట్ చేశాయి. అయితే, ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించిన ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా అవాస్తవమని తేలిపోయాయి. జమ్మూ కశ్మీర్ విషయంలో కాస్త అటుఇటుగా అనిపించినప్పటికీ, హర్యానాలో పూర్తి విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి.
జమ్మూ కశ్మీర్ లో జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ దాదాపుగా మెజారిటీ దగ్గరికి ఫలితాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 46 స్థానాలు కావాల్సి ఉండగా, ఆ పార్టీ 42 స్థానాలు గెలుచుకుంది. ఇక బీజేపీ గతంలో కంటే ఇప్పుడు బాగానే పుంజుకుంది. ఏకంగా 29 స్థానాలతో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో మొదటిసారి అడుగుపెట్టబోతోంది. ఈ ఎన్నికల్లో పీడీపీ, కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతిన్నాయి. కాంగ్రెస్ 6, పీడీపీ 3 స్థానాలకే పరిమితం అయ్యాయి.
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఫలితాలు
మొత్తం సీట్లు 90 (మెజారిటీ మార్క్ 46)
జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 42
బీజేపీ 29
కాంగ్రెస్ 6
జమ్మూ కశ్మీర్ పీడీపీ 3
స్వతంత్రులు 7
ఇతరులు 3
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి ఘన విజయం సాధించింది బీజేపీ. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 46 స్థానాలు కావాల్సి ఉండగా, బీజేపీ ఏకంగా 51 స్థానాలు గెలుచుకుని ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. హర్యానాలో బీజేపీకి ఇదే అతిపెద్ద విజయం. ఇక గెలుస్తుందనుకున్న కాంగ్రెస్ 34 సీట్లతో సరిపెట్టుకుంది. సంకీర్ణం వస్తే చక్రం తిప్పుదామనుకున్న ఐఎన్ఎల్డీ-బీఎస్పీ కూటమికి నిరాశే ఎదురైంది. ఐఎన్ఎల్డీ 2, బీఎస్పీ ఒక స్థానాల్లో గెలిచాయి.
హర్యానా అసెంబ్లీ ఫలితాలు
మొత్తం సీట్లు 90 (మెజారిటీ మార్క్ 46)
బీజేపీ 51
కాంగ్రెస్ 34
ఐఎన్ఎల్డీ 2
బీఎస్పీ 1
స్వతంత్రులు 3