నిర్దేశం, న్యూఢిల్లీ: తిరుపతి లడ్డూ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు తన వ్యాఖ్యలతో కోట్లాది భక్తుల మనోభావాలను గాయపరిచారని పేర్కొంది. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం ఉందా? నెయ్యి కల్తీపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? అని కోర్టు ప్రశ్నించింది. లడ్డూ కల్తీ జరిగిందని చెప్పడానికి శాంపిల్ ల్యాబ్‌కు పంపించారా? లడ్డూను ముందుగానే పరీక్షలకు ఎందుకు పంపలేదని నిలదీసింది.
టీటీడీ తరఫు లాయర్‌పై ప్రశ్నల వర్షం
‘‘‘సెప్టెంబర్ 18వ తేదీ నాటి సీఎం ప్రకటనకు ఆధారాలు ఉన్నాయా? నెయ్యిని రిజెక్ట్ చేశారని ఈవో చెప్పారు కదా. నెయ్యి రిజెక్ట్ చేశాక వాడే పరిస్థితి ఉండదు కదా. ఇదంతా పబ్లిక్ డొమైన్లో ఉంది కదా. జులైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్‌లో చెప్పారెందుకు? ఎన్డీడీబీ మాత్రమే ఎందుకు? మైసూర్ లేదంటే గజియాబాద్ ల్యాబ్‌ల నుంచి సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? కల్తీ నెయ్యిని లడ్డూలో వాడిట్లు ఆధారాల్లేవ్. లడ్డూ కల్తీ జరిగిందని తేల్చేందుకు శాంపిల్‌ను ల్యాబ్‌కు పంపించారా?’’ అని టీటీడీ లాయర్ సిదార్థ్ లూథ్రాను ప్రశ్నించింది.
ధర్మాసనం ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ప్రభుత్వం తరపు న్యాయవాది సిదార్థ్ లూథ్రా నీళ్లు నమిలారు. ఆ నాలుగు ట్యాంకులు వాడలేదని కోర్టుకు తెలిపారు. ఈ తరుణంలో ఇరువైపులా వాదనలను రికార్డ్ చేసిన అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి(గురువారం) వాయిదా వేసింది.