నిర్దేశం, న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి కాంగ్రెస్, బీజేపీ సహా ఆధిపత్య కుల పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ పార్టీలు దళిత నాయకులను నిరంతరం విస్మరిస్తున్నారని ఆమె ఆరోపించారు. హర్యానాలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఉటంకిస్తూ.. ఈ పార్టీలకు గడ్డు పరిస్థితులు వచ్చిన సమయాల్లో మాత్రమే దళితులను గుర్తుకు తెచ్చుకుంటున్నాయని, అయితే అధికారంలోకి వచ్చినప్పుడు వారిని విస్మరించాయని మాయావతి మండిపడ్డారు. హర్యానాలో కాంగ్రెస్ నేత కుమారి సెల్జా మీద సొంత పార్టీ నేతలే కులోన్మాద వ్యాఖ్యలు చేయడంపై మాయావతి తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు.
“ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ సహా ఇతర కులతత్వ పార్టీలు తమ గడ్డు రోజుల్లో దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, పార్టీల్లో కీలక పదవులు ఇవ్వాలని గుర్తొస్తాయి. దేశంలో ఇప్పటివరకు జరిగిన రాజకీయ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. కానీ ఈ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు దళితులను పట్టించుకోరు. హర్యానాలో కూడా అన్ని పదవుల్లో తమ కులస్థులకు మాత్రమే పదవులు ఇచ్చారు. అవమానానికి గురవుతున్న దళిత నాయకులు తమ మెస్సయ్య బాబాసాహెబ్ డా. భీమ్‌రావ్ అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని అలాంటి పార్టీలకు దూరంగా ఉండాలి. తమ సమాజాన్ని అలాంటి పార్టీలకు దూరంగా ఉంచేందుకు తమ పోరాటాన్ని కొనసాగించాలి’’ అని అన్నారు.
రిజర్వేషన్లు, రాజ్యాంగ హక్కులపై హెచ్చరిక
దళితులకు రిజర్వేషన్లపై కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే వ్యతిరేకిస్తున్నదని మాయావతి విమర్శించారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇటీవలి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. రిజర్వేషన్లను ముగించాలని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలు ఈ రాజకీయ పార్టీల్లో “రాజ్యాంగ వ్యతిరేక, రిజర్వేషన్ వ్యతిరేక” సెంటిమెంట్‌ల పట్ల జాగ్రత్త వహించాలని ఆమె హెచ్చరించారు.
హర్యానా కాంగ్రెస్ అయోమయం
హర్యానా కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అంతర్గత కలహాల నేపథ్యంలో మాయావతి స్పందించారు. ఇందులో సీనియర్ నాయకుడు భూపేంద్ర సింగ్ హుడా, ప్రముఖ దళిత నేత కుమారి సెల్జా మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సెల్జ ప్రచారానికి దూరంగా ఉండటంతో పార్టీలో తన భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. ఉక్లానా నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు శైలజ ఆసక్తి చూపారని, అయితే ఆమెకు టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించిందని, బదులుగా ఆమె మేనల్లుడికి టికెట్ ఇచ్చారు. దీనికి సెల్జా అంగీకరించకపోవడంతో పార్టీలో విభేదాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలే ఆమెపై కులోన్మాద వ్యాఖ్యలు చేశారు. హర్యానా ఎన్నికల్లో ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఇబ్బందిగా మారింది.