నిర్దేశం, న్యూఢిల్లీ: దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారు? ఏఏ పరిస్థితుల్లో ఉన్నారనే అంశంపై కులగణన చేయాలని చాలా కాలంగా డిమాండ్ నడుస్తోంది. బిహార్ లో నితీశ్ కుమార్ ప్రభుత్వం కేవలం రెండు నెలల్లో కులగణన పూర్తి చేసింది. అప్పటి నుంచి ఈ డిమాండ్ మరింత పెద్దదైంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పక్కన పెట్టి ఇప్పుడు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తోంది. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ.. అసంబద్ధ కారణాలు చెప్పి తప్పించుకుంటోంది. ఇక స్థానిక పార్టీల తీరు జాతీయ పార్టీలలాగే ఉంది.
ఇలాంటి సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో కుల ప్రాతిపాదికన విద్యార్థుల జనాభా గణనను సాధించారు. ఈ విషయం సహా మరో 11 అంశాలను డిమాండ్ చేస్తూ 15 రోజులుగా విద్యార్థులు చేస్తున్న నిరాహార దీక్షకు జేఎన్‌యూ ఎట్టకేలకు అంగీకరించింది. అయితే కేవలం 6 డిమాండ్లకు మాత్రమే ఆమోదించింది. ఇందులో కులగణన కీలకమైంది. గతంలో మాదిరిగానే జెఎన్యూ దాని స్వంత ప్రవేశ పరీక్షను నిర్వహించడం, క్యాంపస్‌లో కుల గణన నిర్వహించడం, స్కాలర్షిప్ మొత్తాన్ని పెంచడం, ప్రవేశానికి సంబంధించిన వైవా-వోస్ మార్కుల వెయిటేజీని తగ్గించడం, అలాగే పీఎస్ఆర్ గేట్‌ను తెరిచి కేంద్రాలను ఎస్ఎఫ్సీ ఎన్నికలు నిర్వహించడం వంటి అంశాలకు జేఎన్‌యూ ఆమోదం తెలిపింది.
నిజానికి.. స్వాతంత్ర్యం సాధించి 75 ఏళ్లు గడిచిపోయినా దేశంలో వెనుకబడిన కులాల సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం మారలేదనే వాదనలు ఉన్నాయి. అలాగే వారి జనాభా ఎంతో కూడా స్పష్టత లేదు. జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలను మాత్రమే లెక్కిస్తూ వస్తున్నారు. అప్పడెప్పుడో 1931లో బ్రిటీషు హయాంలో చేసిన కులగణనే నేటికీ ప్రమాణికం అవుతోంది. అయితే అది 100 ఏళ్ల క్రితం నాటిది. అప్పటి డేటాతో ఇప్పటి బీసీ సమాజ స్థితిగతులను అంచనా వేయలేం. అందుకే కొత్తగా కులగణన చేయాల్సిన అవసరం ఉంది.
అనేక బీసీ సంఘాలు, సమాజికవేత్తలు, బీఎస్సీ లాంటి కొన్ని పార్టీలు చాలా కాలంగా కులగణన డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ సైతం కొంత కాలంగా ఈ నినాదం ఎత్తుకోవడం హర్షనీయమే కానీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పటికీ కులగణన ప్రారంభం కాలేదు. సరికదా.. అసలు చేసే ఉద్దేశం కూడా కనిపించడం లేదు. ఇక స్థానిక పార్టీలు తీరు దాదాపుగా ఇలాగే ఉంది. డీఎంకే, జేఎంఎం లాంటి పార్టీలు వెనుకుబడిన సామాజిక వర్గాల నాయకత్వంలోనే ఉన్నప్పటికీ కులగణనను వారు పట్టించుకోవడం లేదు. మరి దేశవ్యాప్తంగా కులగణన ఎప్పుడు జరుగుతుందో చూడాలి.