నిర్దేశం, హైదరాబాద్: ప్రెస్ నోట్ బీసీ కులాల్లోని యువ, మహిళా పారిశ్రామికవేత్తలకు వారి వ్యాపారాభివృద్ధి, కొత్త పరిశ్రమల స్థాపన కోసం శిక్షణా తరగతులు, మార్గదర్శకం చేస్తూ వస్తున్న “బ్యాక్ వార్డ్ క్లాస్సేస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ – బిక్కి” సంస్థ ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్కని కలిసి బీసీ పారిశ్రామిక విధానం, బీసీ ప్రోక్రూట్మెంట్ పాలసీల గురించి చర్చించారు. ఈ సమావేశంలో బిక్కి అధ్యక్షుడు చీరాల నారాయణ, సెక్రటరీ డా. దాసరి కిరణ్, రాష్ట్ర సమన్వయకర్త పరికిపండ్ల సుమంత్ లు గురువారం సెక్రటేరియట్ లోని ఉప ముఖ్య మంత్రి గారి కార్యాలయంలో కలిసి బీసీ పారిశ్రామిక వేత్తలకు సంబంధించిన సమస్యలు, వారి పరిష్కార మార్గాలు, ప్రభుత్వం నుండి అందాల్సిన సహాయ సహాకారాలు గురించి చర్చించారు.
బిక్కి తరపున మొత్తం పది ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ, ముఖ్యంగా బీసీ పారిశ్రామిక, ప్రొక్యూర్మెంట్ పాలసీ ని తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా బిక్కి ప్రతినిధులు కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన బట్టి గారు, త్వరలోనే మీ ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించి, సాధ్యమైనంత త్వరలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునేలా చూస్తానని హామీ ఇచ్చారు. కుటీర, కుల, చేతి వృత్తులకు ఆధునిక సాంకేతికతను జోడించి కొత్త ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతామని, ప్రత్యేక సబ్సిడీలు, రాయితీలు తదితరాలు కల్పించడమే కాకుండా, కొత్తగా బీసీ పారిశ్రామిక విధానానికి పునాదులు కూడా వేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బిక్కి ప్రతినిధులు తెలిపారు.
బిక్కి ప్రతిపాదనలు:
1. యువ, మహిళా బీసీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక బీసీ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలి. దానికి ప్రత్యేక నిధులను కూడా కేటాయించాలి.
2. బీసీ పారిశ్రామిక విధానాన్ని ప్రకటించడమే కాకుండా ఎంబీసీ కులాల కోసం ప్రత్యేక విధానాన్ని ప్రకటించాలి. ప్రతి రంగంలో బీసీల వాటాను నిర్దేశించాలి.
3. ప్రభుత్వం విడుదల చేసే వివిధ ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన టెండర్లలో బీసీలకు ప్రత్యేక వాటా(30%) కేటాయించాలి. ఆయా టెండర్లలో ఎవరూ పాల్గొనకపోతే, మూడుసార్లు ప్రకటించిన మీదట సాధారణ ప్రజలకు అవకాశమివ్వాలి.
4. బీసీలల్లో పారిశ్రామికవేత్తలు తక్కువగా ఉన్న దృష్ట్యా, అంకుర పరిశ్రమలకు అవకాశాలు కలిగేలా పారిశ్రామిక అనుభవం, మరియు ఈఎండీ మినహాయింపులు కల్పించాలి.
5. కుల వృత్తులకు సంబంధించిన ఎలాంటి ఉత్పత్తి గాని, సేవకు సంబంధించిన టెండర్లలో బీసీలకు మాత్రమే అవకాశం ఇచ్చేలా చూడాలి. అందుకోసం ప్రత్యేక చట్ట రూపకల్పన చెయ్యాలి.
6. కంపెనీ స్థాపనలో అవసరమయ్యే భూ విక్రయం మరియు లీజ్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజులో పూర్తి మినహాయింపు ఇవ్వాలి.
7. పారిశ్రామిక భూముల్లో బీసీల లెక్కలు తీసి, మా న్యాయపరమైన వాటా మాకు అందేలా చొరవ చూపెట్టాలి.
8. బీసీ పారిశ్రామికవేత్తలకు వృత్తి నైపుణ్య శిక్షణతో పాటు పారిశ్రామికాభివృద్ధికి సంబంధించిన వ్యవస్థాపకత అభివృద్ధి శిక్షణ తరగతులను ప్రభుత్వమే నిర్వహించాలి. అందుకుగాను, స్థానికంగా పని చేస్తున్నటువంటి బీఐసీసీఐ (బిక్కీ) లాంటి సంస్థలతో కలిసి పని చెయ్యాలి.
9. ప్రపంచీకరణ నేపథ్యంలో కుటీర, కుల, చేతి వృత్తులను ఆధునీకరించేలా యూనివర్సిటీలలో పని చేస్తున్నటువంటి ప్రొఫెసర్ లతో కలుపుతూ ఇండస్ట్రీ – అకాడమిక్ ప్రాజెక్ట్స్ కి మద్దతు ఇవ్వాలి. అందుకోసం నిధులు కూడా కేటాయించాలి. ఆ పరిశోధన ద్వారా వచ్చే మేథో సంపత్తిని వారి పేరిట నమోదు జరగడమే కాకుండా వారి ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్ లో అమ్మేలా చొరవ చూపాలి.
10. ప్రత్యేక విద్యుత్ సబ్సిడీ, భూ సబ్సిడీ లను కల్పిస్తూ, పారిశ్రమల వ్యవస్థాపనలో ఉండే పెట్టుబడులను, మరియు నిర్వహణా ఖర్చులను తగ్గించేలా చూడాలి.