– బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కేటాయింపులు
– ఇతర అవసరాలకు వాడుతున్న ప్రభుత్వాలు
– కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు ఇదే కోవ
– పలు రంగాలకు కేటాయించిన నిధులు ఇంతే
నిర్దేశం, హైదరాబాద్: దేశంలో చాలా అభివృద్ధి చేయాలి. రోడ్లు వేయాలి, చెత్త తీయాలి, విమానాశ్రాయాలు కట్టాలి, పోర్టులు నిర్మించాలి, రైల్వేలు పొడగించాలి. వీటన్నికంటే ముందు దేశంలో మనుషులు ఎదుర్కొనే ప్రత్యక్ష సమస్యలు కొన్ని ఉన్నాయి. వీటిలో మొదటి ఆకలి. అవును.. ఈ దేశంలో ప్రభుత్వం రేషన్ ఇస్తే కానీ రెండు వేళ్లు నోట్లో పెట్టలేని వారు ఉన్నారు. ముందు వారికి అన్నం పెట్టాలి. ఇళ్లు నిర్మించాలి. చదువు చెప్పించాలి, వారి ఆరోగ్యం కాపాడాలి. ఇన్ని దరిద్రాలను మిగతా సమాజం కంటే అతి ఎక్కువగా భరిస్తున్న ఓ వర్గం ఉంది. వారిని ఈ దేశంలో రాజ్యాంగ పరిభాషలో ఎస్సీ, ఎస్టీలు అంటారు.
భారతీయ సమాజంలో ఎక్కువ కాలం నుంచి, ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నది ఈ రెండు వర్గాలే. అందుకే వీరిని మిగిలిన సమాజంతో పాటుగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చేసే ఖర్చులో కొంత ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తారు. బడ్జెట్ పరిభాషలో దానిని ఎస్సీ, ఎస్టీ కేటాయింపులుగా పేర్కొంటారు. అయితే చిత్రంగా.. ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించిన నిధులను ఎస్సీ, ఎస్టీలకు ఖర్చు చేయడం లేదు. నిన్నీమధ్య కొన్ని ఉదంతాలు వినే ఉంటాం. కర్ణాటక కాంగ్రెస్ సర్కారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం 14,730 కోట్ల రూపాయల ఎస్సీ-ఎస్టీ నిధులను దారి మళ్లించింది. ఇక మధ్యప్రదేశ్ ప్రభుత్వం అయితే ఎస్సీ, ఎస్టీలను కనీసం పశువులుగా కూడా చూడడం లేదేమో.. ఎస్సీ-ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఏకంగా గోరక్షణకు, మత ప్రదేశాల్లో నిర్మాణాలకు మళ్లించింది.
నిజానికి ఇది ఈరోజు కొత్త కాదు. గణంత్ర రాజ్యంలో ఆది నుంచి కొనసాగుతున్న అతి దుర్మార్గమైన ఆచారం. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు. ప్రతి బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు ఉంటుంది. బడ్జెట్ చదివేటప్పుడు అత్యంత వెనుబడిన ఆ కులాలకు కోకాపేట భూములు రాసిస్తున్నట్లు గొప్పలు పోతారు. తీరా చూస్తే.. ఆ నిధుల్లో వారికి వెళ్లేది చిల్లి గవ్వ కూడా ఉండదు. ప్రభుత్వాల అవసరాలకు వాటిని వాడుకుంటారు. ఎందుకలా వాడుకున్నారనే కారణం కూడా చెప్పరు.
గతంలో చంద్రబాబు ఇవే నిధుల నుంచి పసుపు-కుంకుమ అనే కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుకు వైయస్ ప్రభుత్వం ఇవే నిధులను వాడుకుంది. కేసీఆర్ కూడా ఈ నిధులను ప్రాజెక్టుల నిర్మాణానికి వాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి తక్కువ తినలేదు. ఆయన కూడా అమ్మ ఒడి లాంటి పథకాలకు ఎస్సీ,ఎస్టీ నిధులే వాడుకున్నారు. ఒక మాట చెప్పాలంటే.. ఎస్సీ, ఎస్టీల నిధుల కేటాయింపే రిజర్వ్ నిధులుగా ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అంటే, వాటిని అలా పక్కన పెట్టుకుని అవసరాలకు వాడుకోవడానికి అన్నమాట.
దారి మళ్లింపులో ఎస్సీ, ఎస్టీ నిధులది పెట్టని కోట. ఇక సందర్భాన్ని బట్టి ఇతర నిధులు కూడా దారి మళ్లుతూ ఉంటాయి. హైదరాబాద్ మెట్రో కోసం గత మూడేళ్లుగా చేసిన కేటాయింపులేవీ అందుకు నోచుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. ఇక తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కూడా ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం 17,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎప్పటిలాగే ఇవీ దారి మళ్లుతాయా.. లేదంటే ఏమైనా ఖర్చు చేస్తారా చూడాలి.