– ప్రభుత్వ ప్రకటనలపై రేవంత్ సర్కార్ పై తీవ్ర విమర్శలు
– అప్పుడు కేసీఆర్ ను తిట్టి, ఇప్పుడదే చేస్తున్న కాంగ్రెస్
– ఎదుటి వారికి చెప్పేందుకు నీతులంటూ విమర్శలు
నిర్దేశం, హైదరాబాద్: మందికి బుద్ధి చెప్పి మనోడు గోదాట్ల పడ్డట్లు ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్ కథ. కేసీఆర్ హయాంలో వార్తా పత్రికల్లో ప్రభుత్వ ప్రకటనలు ఇస్తే.. ఏడేడు ఫీట్లు ఎగిరెగిరి పడ్డ రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కంటే తానేం తక్కువ అనుకున్నారో ఏమో పత్రికల్లో ప్రకటనలతో రెచ్చిపోయారు. రైతు రుణ మాఫి అమలు చేసిన ముచ్చట తెలిసిందే. ఇదే సందు అనుకున్నట్టు ఉన్నరు.. ఆ భాష, ఈ భాష తేడా లేకుండ అన్ని భాషల పత్రికలలొల్ల గుమ్మడికాయంత అక్షాలతో ప్రకటనలు ఇచ్చారు. ‘ఈ కాలపు అతి పెద్ద వేడుక.. రైతన్నలకు రుణ మాఫీ పండగ’ అనే టైటిల్ తో రైతులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పైన రేవంత్ రెడ్డి పెద్ద ఫొటో.. చూడంగనే అనిపిస్తది కోట్లు కుమ్మరించిర్రని.
కాంగ్రెస్ నేతల ఆస్తులు అమ్మి ఇస్తున్నరా?
రుణమాఫీ మీద రేవంత్ రెడ్డి ప్రచారం చూస్తుంటే.. కాంగ్రెస్ నేతలు సొంత ఆస్తులు అమ్మి సమాజానికి ఏదో చేసినట్లే ఉన్నది. గతంలో రుణమాఫీ ఎప్పుడు కానట్టు, గతంలో ప్రజల గురించి ఇంకే ప్రభుత్వం ఆలోచించనట్టు.. ప్రజల కష్టాలు తీర్చనీకి, తామేదో ఆకాశం నుంచి ఊడిపడ్డట్లు.. ముఖ్యమంత్రి, మంత్రుల దగ్గరి నుంచి గ్రామంలో ఉండే కార్యకర్తదాక కాంగ్రెస్ నేతల అతి ఎవరికి అందెటట్టు లేదు. అధికారం ఇచ్చింది ప్రజలు, టాక్సులు కట్టి ప్రభుత్వ ఖజానా నింపేది ప్రజలు. కానీ, ఆ సోయి ఏ సర్కారుకు ఉండదు. కాంగ్రెస్ కూడ అట్లనే ఉన్నది. మాటకు ముందోసారి సోనియా, రాహుల్ అంటరు.. మాటకు తర్వాతోసారి అంటనే ఉన్నరు. పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలకు గాంధీ కుటుంబం నుంచి పైసల సంచులేం రాలేదు కదా.
పైసలే లేవన్నరు.. ప్రకటనలకెక్కడివి?
కాంగ్రెస్ పార్టీ అధికారంలకు రాంగనే కేసీఆర్ సర్కార్ తెలంగాణను నిండా ముంచిందని, అప్పుల పాటు చేసిందని మస్త్ విమర్శలు చేసిర్రు. రోజుకు 207 కోట్ల రూపాలు పెట్టి గత సర్కార్ చేసిన అప్పే చెల్లిస్తున్నమని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన రేవంత్ సర్కార్ కు నిజంగా ప్రజల మీద ఏమాత్రమన్న పట్టింపు ఉంటే ఈరోజు ఈ ప్రకటనలు ఇచ్చేదా? గత ఏడాది బడ్జెట్ కంటే కూడా ఈ ఏడాది తక్కుత బడ్జెట్ ప్రవేశపెట్టింది సర్కార్. ఏమంటే, ఖజానా ఖాళీగా ఉన్నది, పైసలేడికి ఐతలేవని మంత్రులంతా చేతులెత్తిర్రు. మరి ఇప్పుడు ప్రకటనలకు ఎందుకు ఇంత దుబారా ఖర్చు పెడుతున్నరు? నీతులు ఉన్నై ఎదుటొల్లకు చెప్పెతందుకే అన్నట్లు ఉన్నది రేవంత్ రెడ్డి ముచ్చట. చేసే పని చారాణ అయితే, దాని ప్రచారానికి మాత్రం బారాణ అన్నట్లే ఉన్నది. ఉన్న పైసలతోటి మంచిగ పని చేయాల్సిపోయింది. దుబారా ఖర్చులకే ఖజానా ఖాళీ చేస్తున్నరను.
మాట మీద ఉండని కాంగ్రెస్
రాజకీయాల్లో కాంగ్రెస్ ఎక్కువ అనుభవం ఉన్న పార్టీ. అట్లనే ఇచ్చిన మాట తప్పడంలో కూడా కాంగ్రెస్ పార్టీ సీనియారిటీ చాలానే పెద్దది. కొత్త నాయకులొచ్చినప్పుడు కొత్తగా ఏదో అయిదని అనుకుని ఓటేస్తే.. నోట్లె మట్టికొట్టినంత పనైతంది. కేసీఆర్ సర్కారును గద్దె దించనీకి కాంగ్రెస్ చెప్పిన ముచ్చట్లు అన్నీ ఇన్ని కాదు. ఆరారు గ్యారంటీల పేరుతో ఓ లెక్కన గారడే చేసిర్రు. ఆరు గ్యారెంటీలల్ల ఒక్క గ్యారెంటీ కూడ పూర్తిగ అమలు కాలేదు. మహాలక్ష్మీ గ్యారెంటీలో ఒకటైన ఒక్క బస్సు మాత్రమే అమలైంది. కాంగ్రెస్ అధికారంలకు వచ్చి ఏం చేసిందంటే చెప్పనీకి ఇదొక్కటి తప్పితే ఇంకేం లేదు. పచ్చిగ చెప్పాలంటే.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అన్నింటినీ మూసీ నదిలో వేసి పాలన సాగిస్తున్నరు.