కోరిక తీరకుండానే కన్ను మూసిన డీఎస్..
నిర్దేశం, నిజామాబాద్ :
ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి.. ఇగో.. డీఎస్ శ్రీనివాస్ కూడా కోరిక తీరకుండానే శనివారం తెల్లవారు జామున కన్ను మూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలను శాసించిన నేతగా ఆయనకు పేరుంది. రెండు పర్యాయాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంలో కీలక పాత్ర పోషించారనేది జగమెరిగిన సత్యం. ఏదో ఒకరోజు సీఎం కావాలనేది డీఎస్ కోరిక. కానీ మారిన రాజకీయాలలో ఆయన సీఎం కాలేక పోయారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు తాను సీఎం అయ్యే అవకాశాలు ఉండే. కానీ.. ఆ సమయంలో ఎమ్మెల్యేగా ఓడి పోవడం అతని బ్యాడ్ లక్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే యెండెల లక్ష్మీనారాయణ పదవికి రాజీనామా చేశారు. దీంతో జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా డీ.శ్రీనివాస్, బీజేపీ అభ్యర్థిగా లక్ష్మీనారాయణ మరోసారి పోటీ చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్నందున డీఎస్ ఓడి పోవడంతో సీఎం పదవి మిస్ అయ్యింది. ఆ ఎన్నికలలో తాను ఎమ్మెల్యేగా గెలిపిస్తే సీఎం అవుతానని ప్రచారం చేశారు. అయినా.. ప్రజలు తెలంగాణ సెంటిమెంట్ వైపు మొగ్గు చూపడంతో డీఎస్ సీఎం పదవికి దూరమయ్యారు.