– మొదటిసారి పోటీలో కనిపించని రెడ్డీలు
– రేసులో మధుయాష్కి, మహేష్ కుమార్, పొన్నం, సంపత్ కుమార్
– ముగ్గురు బీసీలు గౌడ సమాజిక వర్గమే
నిర్దేశం, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీ ఈసారి చాలా ఆసక్తికరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో పదవులు అంటే ముందు వరుసలో ఉండేది రెడ్డీలే. కానీ ఈసారి బీసీల మధ్య పోటీ కొనసాగుతోంది. వీరితో పాటు ఒక దళితుడు సైతం ఈ పోటీలో ఉండడం గమనార్హం. విచిత్రంగా రేసులో ఉన్న ముగ్గురు బీసీ నేతలు మధుయాష్కి, మహేష్ కుమార్, పొన్నం ప్రభాకర్ లు గౌడ సామాజిక వర్గానికి చెందినవారే. ఇక నాలుగో పోటీదారు సంపత్ కుమార్ ఒక్కరే దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. అయితే, ఈ నలుగురిలో ఎవరికి అవకాశం దక్కుతుంది అంటే చెప్పడం కష్టంగానే ఉంది. నలుగురు నేతలు సమఉజ్జీలుగానే ఉన్నారు.
రేసులో ఉన్న నలుగురిలో ఎవరి అవకాశం ఎంత?
మధుయాష్కి గౌడ్: సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో విధేయులకు పదవులు దక్కుతుంటాయి. ఈ కోణంలో చూస్తే ప్రస్తుతం రేసులో ఉన్నవారిలో మధుయాష్కి పార్టీకి నమ్మకమైన నేత. గతంలో రెండు సార్లు ఎంపీగా గెలిచి గాంధీ కుటుంబానికి దగ్గరగా మెలిగారు. అంతే కాకుండా 2007 నుంచి ఏఐసీసీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. విధేయతకే పట్టం కట్టాలనుకుంటే మధుయాష్కికే అవకాశం దక్కుతుంది.
మహేష్ కుమార్ గౌడ్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్.. రేవంత్ రెడ్డి తర్వాత పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అంతే కాకుండా బీసీ సంఘాలు నేతలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. రాహుల్ గాంధీ కొంత కాలంగా ఓబీసీ అంశాన్ని ప్రముఖంగా చెప్తున్నారు. రాష్ట్రంలో కూడా బీసీ సంఘాలను తమవైపుకు తిప్పుకోవాలి అనుకుంటే మహేష్ కు అవకాశం దక్కుతుంది.
పొన్నం ప్రభాకర్ గౌడ్: నిజానికి కాంగ్రెస్ ఈ మధ్య భిన్నంగా ఆలోచిస్తోంది. సీనియారిటీ కాకుండా ఫైర్ బ్రాండ్లకు పదవులు ఇస్తోంది. రేవంత్ రెడ్డి కూడా అలానే అధ్యక్షుడు అయ్యారు. రాష్ట్రంలో మళ్లీ ఇదే కొనసాగించాలంటే ప్రస్తుతం రేసులో ఉన్న వారిలో పొన్నం ప్రభాకర్ ముందు వరుసలో ఉంటారు. విద్యార్థి నేత నుంచి కాంగ్రెస్ లో ఎదిగిన పొన్నంకు అధ్యక్ష పదవికి అవకాశాలు చాలానే ఉన్నాయి. కానీ, ప్రస్తుతం మంత్రిగా ఉండడం కొంత అడ్డంకే. అయితే అధ్యక్ష పదవి ఇస్తే మంత్రి రాజీనామా చేయాల్సి ఉండొచ్చు.
సంపత్ కుమార్: పై ముగ్గురు నేతలకు ఎంత అవకాశం ఉందో.. సంపత్ కుమార్ కు కూడా అంతే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో కనిపించిన ధోరణే ఇందుకు ఉదాహరణ. కాంగ్రెస్ చరిత్రలో మొదటిసారి దళిత వ్యక్తి ఖర్గేను పార్టీ అధినేత చేశారు. ఇది కాంగ్రెస్ కు మంచి మైలేజ్ ఇచ్చింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ కు ఇలా వర్కౌట్ అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి. పైగా రెడ్డి ఆధిపత్యం అనే మరక కూడా కాస్త పల్చన అవుతుంది.