నేటి రాజకీయాలను చూసి ఊసరవెల్లి సిగ్గు పడుతుంది..

ఊసరవెల్లి సిగ్గు పడుతుంది

  • పొలిటికల్ లో కనిపించని నైతిక విలువలు..
  • అధికార పార్టీలోకి పొలిటికల్ లీడర్ల ప్రయాణం..
  • నాడు కేసీఆర్.. నేడు రేవంత్ ఇద్దరూ ఇద్దరే..
  • పార్టీ ఫిరాయింపుల చట్టం ఉన్నా ఉపయోగం సున్నా..

‘‘ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట, ఇంకెవర్నీ మోసగించనని..!

ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట, తోటి జంతువుల్ని సంహరించినందుకు..!

ఈ కట్టుకథలు విని, గొర్రెలింకా పుర్రెలూపుతూనే వున్నాయి..!’’

మన దేశ రాజకీయ నేతలు, ప్రజల గురించి ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ ఒక్క మాటలో చెప్పారు.  నిజమే.. 75 ఏళ్ల ప్రజాస్వామ్యంలో కిరాతక మోసానికి గురవుతున్న ఓటర్లు.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ మోసపోడానికి సిద్ధమై ఉంటారు. అందుకే మన నాయకులు సులువుగా ధైర్యంగా నీతి తప్పుతుంటారు. ఇదే మన ప్రజాస్వామ్యం.

‘‘నా నాయకుడు కేసీఆర్, ప్రాణం పోయే వరకు గులాబీ జెండాతోనే ఉంటా’’ కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి చేసిన వ్యాఖ్యలు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం ‘‘నా రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతోనే మొదలైంది. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరాను’’ అని అన్నారు. దీనిపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంటే, కాంగ్రెస్ ప్రశంసలు కురిపిస్తోంది.

ఇంతకు ముందు ఇది రివర్స్ లో ఉండేది. అంటే, పార్టీ మారే నాయకులపై కాంగ్రెస్ విమర్శలు చేస్తే, అభివృద్ది కోసం మంచి పని చేశారని గులాబీ నేతలు పొగిడేవారు. అంతే కదా.. నీతి లేని రాజకీయంలో పాత్రలను, పరిస్థితులను బట్టి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి.

నిర్దేశం, హైదరాబాద్:

పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారారు. మొన్న కేశవరావు మారారు. అంతకు ముందు దానం నాగేందర్, కడియం శ్రీహరి, దొంతు రాంమోహన్ ఇలా చాలా మంది బీఆర్ ఎస్ కండువను పక్కన కేసీఆర్ మొఖం మీద కొట్టి కాంగ్రెస్ పార్టీలోనికి జంప్ అయ్యారు. పొలిటికల్.. రోజు రోజుకు పడి పోతున్న పొలిటికల్ లీడరుల నైతిక విలువలతో వృద్ద రాజకీయ నాయకులు సైతం సిగ్గు పడుతున్నాయి. అయినా.. పార్టీలు మారడం పొలిటికల్ లీడరులకు కొత్త కాదు. మన దేశంలో ప్రజాస్వామ్యం ఏర్పడిన నాటి నుంచి కొనసాగుతున్న నిరంతర ప్రక్రియ ఇది.

సరిగ్గా చెప్పాలంటే రాజకీయంలో నీతి అనేది బూతు. బహుశా ఎవరైనా నీతిగా ఉంటే మరీ ఇంత అమాయకుడు రాజకీయాల్లో ఏం చేస్తాడని తోటి నాయకులే కాదు, ఓటర్లు కూడా పక్కున నవ్వుతారు. మాట తప్పడంలో స్పీడు, పార్టీ మారడంలో జోరు ఉన్నవాడే నాయకుడిగా పైకొస్తాడు. లేదంటే జెండాలు మోసే కార్యకర్తలుగానే మిగిలిపోతారు. ఇక చెప్పే నీతులు, కోసే కోతలు.. ఎందుకంటారా? ప్రజాస్వామ్యమనేది ఒకటి ఉంది కదా. మొహమాటం కోసం తప్పదు.

ఊసరవెళ్లిలా రాజకీయాలు..

పార్టీలు మారడంలో మన నాయకుల స్పీడు చూస్తే ఊసరవెళ్లి కూడా ఖంగుతింటుంది. ఇచ్చిన మాట, కప్పిన కండువా, చెప్పిన సిద్ధాంతం మార్చడంలో ఒకరిని మించి మరొకరు ఉంటారు. కొందరైతే ఒకే రోజులో రెండు, మూడు పార్టీలు మారుతుంటారు. ఆ మధ్య దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీ రెడ్డి ఉదయం బీజేపీలో చేరి, సాయంత్రానికి మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. ఒక పార్టీ గురించి గొప్పగా స్పీచులు దంచి గంటలో ఆ పార్టీ మీద దుమ్మెత్తి పోయడం లేదంటే బండ బూతులు నేతను ఆకాశానికెత్తేలా పొగడటం మన దేశంలోనే ఉద్బవించిన కళ.

 

రాజకీయ నాయకులకు ఉండాల్సిన అర్హతలు

నాయకుడంటే సిద్ధాంతమో, జెండానో, అజెండానో కలిగినవాడు కాదు. కాలానికి అనుగుణంగా ఏ జెండానైనా మోసే అలవాటు ఉన్నవాడు. ఏ ఎండకు ఆ గొడుగే కాదు, ఏ చలికి ఆ దుప్పటి కప్పుకునేవాడు. పొద్దున పొగిడిన వాడిని సాయంత్రానికి తిట్టాలి, అవసరమనుకుంటే గంటలో మళ్లీ తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టాలి. మొత్తానికి మాట మార్చడంలో ప్రజలను ఏమార్చడంలో దిట్ట అయి ఉండాలి. చెప్పేది అబద్ధమైన కాన్ఫిడెన్స్ హై లెవెల్ లో ఉండాలి. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న చాలా మంది నేతలకు ఈ అర్హతలు ఉన్నాయి. అందుకే మన దేశ రాజకీయాలు మూడు పార్టీలు, ఆరు కండువాలుగా కొనసాగుతున్నాయి.

ఈ రాజకీయాల్ని పెంచి పోషించేది రెడ్డీలే

ప్రభుత్వాలు మారిపోగానే వెంటనే పల్టీలు కొట్టేది రెడ్డీలే. రాజకీయాల్లో మిగతావారు ఉన్నప్పటికీ, తెలుగు నేల మీద రాజకీయం అంటే రెడ్డీలేనని వేరే చెప్పనక్కర్లేదు. ఏ పార్టీలోనైనా సగానికి పైగా నేతలు రెడ్డిలే ఉంటారు. కమ్మలు, వెలమల లాంటి ఇతర కులాల నాయకత్వంలో కొన్ని పార్టీలు ఉన్నప్పటికీ మళ్లీ ఆ పార్టీలో కూడా మెజారిటీ నాయకులు రెడ్డీలే సుమీ. అందుకే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఏం జరిగినా కామన్ గా రెడ్డిలే కనిపిస్తారు. మరి, రాజకీయంగా ఏ డెవలెప్మెంట్ జరిగినా క్రెడిట్ వారికివ్వడమే కదా న్యాయం!

ప్రజల అభిప్రాయాలు కూడా ఇలాగే ఉన్నాయి

నాయకులు మాత్రమే ఇలా ఉన్నారనుకుంటే పొరపాటే. ప్రజలు కూడా ఇలాగే అలవాటు అయ్యారు. రాజకీయాల్ని చూసి చూసి వాళ్లు కూడా అలసిపోయారు. కొంత అప్డేట్ కూడా అయ్యారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటు వేసేందుకు తగినంత డబ్బు ఇవ్వలేదని ఓటర్లు రోడ్డు మీదకు వచ్చిన ధర్నా చేసిన సందర్భాలు ఎలా మర్చిపోగలం. మోసగాళ్లకు మోసగాడనే తరహాలో నీతి లేని రాజకీయ నాయకులతో ఇలాగే వ్యవహరించాలని ఓటర్లు ఆలోచిస్తున్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!