కాలేజీ నుంచి నేరుగా గంజాయికే.. హైదరాబాద్ లో ఏం జరుగుతోంది?

– డీ అడిక్షన్​ సెంటర్లకు క్యూ గంజాయి బాధితులు
– గంజాయి బాధితుల్లో 25 ఏండ్లలోపు వారే ఎక్కువ
– ఎర్రగడ్డ మెంటల్​ హాస్పిటల్​ కు నెలకు పదుల సంఖ్యలో బాధితులు
– ప్రైవేట్​ డీ అడిక్షన్​ సెంటర్లకు వేల సంఖ్యలో గంజాయి బాధితులు

నిర్దేశం, హైదరాబాద్​: సిటీకి చెందిన సంతోష్​​ శివారులోని ఓ ఇంజనీరింగ్​ కాలేజీలో బీటెక్​ చదువుతున్నాడు. కాలేజీకి రెగ్యూలర్​గా వెళ్లేవాడు. కాలేజ్​ టైమ్​ అయిపోగానే ఇంటికి వచ్చి, ఏదైనా వర్క్​ చేసుకునేవాడు. కానీ, కొన్ని నెలల నుంచి సంతోష్​ ఇంటికి సరిగ్గా రావట్లేదు. ఒకవేళ వస్తే అర్థరాత్రిళ్లు అందరూ పడుకున్నాక వచ్చేవాడు. ఏమైందని పేరెంట్స్ అడిగితే… వారిపై అగ్రెస్సివ్ గా బిహేవ్​ చేసేవాడు. కోపంగా, చిరాకుగా, ఎప్పుడూ దేని గురించో ఆలోచిస్తూ ఉండేవాడు. మత్తుకోసం తహతహలాడేవాడు. ఒకానొక సందర్భంలో గంజాయి కోసం పిచ్చెక్కేలా తయారయ్యాడు. అతనిలో వచ్చిన మార్పులను గమనించిన పేరెంట్స్ ఫ్రెండ్స్​ దగ్గర ఆరా తీశారు. సంతోష్​ చాలా రోజుల నుంచి కాలేజీకి రెగ్యూలర్​ వెళ్లట్లేదని, కాలేజీ ఫ్రెండ్స్​ ద్వారా గంజాయి, సిగరెట్లకు అడిక్ట్​ అయ్యాడని తెలిసింది. పరిస్థితి చేయి దాటిందని పేరెంట్స్​ కు అర్థమయింది. తెలిసివారి ద్వారా ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలోని డీఅడిక్షన్​ సెంటర్ కు సంతోష్ ను తీసుకొచ్చారు పేరెంట్స్​. సంతోష్​ గంజాయి, సిగరెట్లు ఎలా అలవాటు చేసుకున్నాడు. ఇప్పుడు అతని మానసిక పరిస్థితి ఏంటి? అని డాక్టర్లు అన్ని విధాలుగా పరీక్షించారు. సంతోష్​ మళ్లీ సాధారణ స్థితికి రావడానికి కొన్ని మెడిసిన్స్​, కౌన్సిలింగ్​ ఇవ్వడం ప్రారంభించారు. మెడిసిన్​, కౌన్సిలింగ్​ కు సంతోష్​ రియాక్ట్​ అవడం ప్రారంభించాడు. నెల రోజుల వ్యవధిలోనే సంతోష్​ సాధారణ స్థితికి చేరుకున్నాడు. సంతోష్ పేరెంట్స్​​ అతని పరిస్థితిని తొందరగా గుర్తించి సరైన ట్రీట్​ మెంట్​ ఇప్పించడం వల్ల సాధారణ స్థితికి చేరుకున్నాడు. ఇది ఒక్క సంతోష్ సమస్యనే కాదు.. ఇంటర్​, డిగ్రీ, ఇంజనీరింగ్​, ఎంబీబీఎస్​ చదువుతున్న ఎంతో మంది విద్యార్థుల సమస్య.

యువత మత్తుకు అడిక్ట్​ అవుతోంది. గంజాయి, ఆల్కహాల్, సిగరెట్స్​, డ్రగ్స్​ ఇలా ప్రతి మత్తు పదార్థం తీసుకునేవారిలో యువతే ఎక్కువగా ఉంటున్నారు. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలు అడ్డాగా మత్తు మాఫియా విస్తరిస్తుండటంతో… బాధితులలో ఎక్కువ శాతం 25 ఏండ్లలోపే ఉంటున్నారు. మత్తు పదార్థాల బారిన పడిన యువత… వాటి నుంచి బయటపడడానికి డీ అడిక్షన్​ సెంటర్లకు క్యూ కడుతున్నారు. సిటీలోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలల ఉన్న.. డీ అడిక్షన్​ సెంటర్​ కు రోజూ పదుల సంఖ్యలో గంజాయి అడిక్షన్​ బాధితులు వస్తున్నారు. ఇతర ప్రైవేట్​ డీఅడిక్షన్​ సెంటర్లలో ట్రీట్​మెంట్​ తీసుకునేవారి సంఖ్య వెలల్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. యువత ఒక గంజాయి మాత్రమే కాకుండా ఓపియాడ్​, . బెంజోడయాజిపైన్ లాంటి నిద్ర మాత్రలు, పెయిన్​ కిల్లర్స్​ కూడా యువత ఎక్కవగా అడిక్ట్ అవుతున్నారు. కొందరిని పేరెంట్స్​ గుర్తించి ట్రీట్​మెంట్ ఇప్పిస్తుండగా, మరికొందరు మత్తులో తూలుతూ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు.

కాలేజీ విద్యార్థులే ఎక్కువ
సిటీలో గుర్తింపు ఉన్నవి, లేనివి అన్ని కలిపి100 కు పైనే డీ అడిక్షన్​ సెంటర్లు ఉన్నాయి. ఎర్రగడ్డ మెంట్​ హాస్పిటల్​ లోని డ్రగ్​ ట్రీట్​మెంట్​ క్లినిక్​ కు ప్రతినెల సగటున 20 మంది గంజాయి బాధితులు వస్తుండగా, ఇతర ప్రైవేట్​ సెంటర్​ కు నెలలో వేలల్లో బాధితులు వస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువ శాతం 25 ఏండ్లలోపు వయసున్న వారే ఎక్కువగా ఉంటున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్​, ఇంజనీరింగ్​, ఎంబీబీఎస్​ స్టూడెంట్స్​ డీటీసీ వచ్చేవారిలో ఉంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు. గంజాయి, ఆల్కహాల్​, సిగరెట్లు, డ్రగ్స్​ తీసుకోవడాన్ని యువత ఫ్యాషన్​ గా ఫీల్​ అవుతున్నారని, స్కూళ్లు, కాలేజీలలో ఫ్రెండ్స్ ద్వారా మందు, సిగరెట్​ నుంచి క్రమంగా గంజాయి, డ్రగ్స్​ తీసుకునే వరకు వెళ్తున్నారని చెబుతున్నారు. మరికొందరు స్లీపింగ్​ ట్యాబ్లెట్స్​, పెయిన్ కిల్లర్స్​ కూడా తీసుకుంటున్నారు. ఎర్రగడ్డ డీటీసీకి ఓపియాడ్​ తోపాటు, బెంజోడయాజిపైన్ లాంటి ట్యాబ్లెట్స్​ బాధితులు కూడా వస్తున్నారు. పిల్లలపై పేరెంట్స్ మాత్రమే కాదు, స్కూల్​, కాలేజీలలో టీచర్స్, లెక్చరర్లు, ప్రొఫెసర్లకు​ కూడా వారి కదలికలపై కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

ఎర్రగడ్డ డీటీసీకి సంవత్సరాల వారీగా వస్తున్న బాధితుల సంఖ్య
మత్తు పదార్థం       2020-2022       2023         2024(మే వరకు)
గంజాయి                    421               200            83
ఓపియాడ్​                   25                  25             14
బెంజోడయాజిపైన్​         66                 45              19
నికొటిన్​                      2913           1748          940
ఆల్కహాల్​                   3749           2162          1067

తొందరగా గుర్తిస్తే ట్రీట్​మెంట్​ ఈజీ
మత్తు పదార్ధాలకు అడిక్ట్​ అయినవారిని ప్రధానంగా అవి ఎలా అలవాటయ్యాయి, ప్రస్తుతం వారి మానసిక స్థితి​ ఏంటి అనే విషయాలు తెలుసుకొని ట్రీట్​మెంట్​ ప్రారంభిస్తామని డాక్టర్లు చెబుతున్నారు. ప్రభావం తక్కువగా ఉన్నవారు ఇంటివద్దే ఉంటూ మెడిసిన్​ వాడి, రెండు వారాలకు ఒకసారి కౌన్సిలింగ్​ తీసుకుంటే సరిపోతుందని, ప్రభావం ఎక్కువగా ఉన్నవారిని ఇన్​ పేషంట్స్​ గా అడ్మిట్​ చేసుకొని మెడిసిన్​ ఇవ్వడం, కౌన్సిలింగ్​ తో పాటు ఇంజక్షన్స్​ ద్వారా ట్రీట్​ మెంట్ అందిస్తామని డాక్టర్లు చెబుతున్నారు. అయితే సాధారణంగా ట్రీట్​ మెంట్​ నెల రోజుల్లో పూర్తవుతుందని, బాధితుడి కండీషన్​ ను బట్టి కొన్నిసార్లు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని ఎర్రగడ్డ మానసిక వైద్యశాల సైకియాట్రిస్ట్ డాక్టర్​ ఫణికాంత్​​ తెలిపారు. అయితే డీ అడిక్షన్​ సెంటర్ల గురించి చాలా మందికి తెలియకపోవడం, వీటి గురించి సరైన ప్రచారం లేకపోవడంతో ట్రీట్​మెంట్ కోసం అంతంత మాత్రంగానే వస్తున్నారు. డీటీసీ సెంటర్లలో డ్రగ్స్​ కు బానిసలవ్వడం వల్ల కలిగే నష్టాలతో పాటు, ఆ వ్యసనం నుంచి ఎలా బయటపడాలో కౌన్సిలింగ్​ ద్వారా చెబుతారు. అవసరం అయితే పేరెంట్స్​ అంగీకారంతో ట్రీట్​మెంట్​ ప్రారంభిస్తారు.

పిల్లలపై పేరెంట్స్​ దృష్టి పెట్టాలి: డాక్టర్​ ఉమా శంకర్​, సూపరింటెండెంట్​, ఎర్రగడ్డ
యువత ఎక్కువగా గంజాయికి బానిసలు అవుతున్నారు. మత్తు పదార్థాలు విచ్చలవిడిగా లభిస్తుండటంతో యువత ఎక్కువగా అటువైపు మళ్లుతున్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడినవారు ఎప్పుడూ కోపంగా, చికాకుగా, అందోళనగా కనిపిస్తారు. చదువు మీద దృష్టి పెట్టలేరు. ఎప్పుడూ అభద్రతాభావంతో ఉంటారు. తమపై దాడి చేస్తారేమో అనే భయంతో… ఇతరులపై అగ్రెస్సివ్​ గా బిహేవ్​ చేస్తారు. పేరెంట్స్​ పిల్లలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వారి కదలికలను గమనిస్తూ ఉండాలి. వారికి ఎంత పాకెట్​ మనీ అవసరమో అంతే ఇవ్వాలి. ఒకవేళ మత్తు పదార్థాలకు బానిసలు అయినట్లు గుర్తిస్తే… వెంటనే ట్రీట్​మెంట్​ ఇప్పించాలి. మందులు, కౌన్సిలింగ్​ ద్వారా వారిని సాధారణ స్థితికి తీసుకురాగలం.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!