– పదవులు వదిలి రాజకీయాల్లోకి వస్తే పట్టించుకోని ప్రజలు
– మంచివారని జనాల్లో చర్చలో ఉన్నా ఓట్లెందుకు వేయడం లేదు?
– రాజకీయాల్లోకి ఇలాంటి వారు రాకూడదా?
నిర్దేశం, హైదరాబాద్: సమాజానికి ఏదో చేద్దామని రాజకీయాల్లోకి వచ్చేవారిని ప్రజలు నిజంగా ఆదరిస్తారా అనేది ఎప్పటి నుంచో ఉన్న అతిపెద్ద ప్రశ్న. రాజకీయాల్లో రాణించేవారిని గమనించడం. రాజకీయాన్ని రాజకీయం చేసేవారే అంతా. సమాజం మీద ప్రేమ కలిగి, సామాజిక కార్యక్రమాలు చేసే వారు కొందరు రాజకీయాల్లో ఉన్నప్పటికీ, వారు కూడా సోకాల్డ్ రాజకీయ నాయకుల పార్టీల్లో రెండో వరుసలోనో మూడో వరుసలోనో ఉంటారు. ప్రజల్లో ఏదో మార్పు తెద్దామని ఉన్నత పదవులు వదిలి రాజకీయాల్లోక వచ్చిన తెగులు రాష్ట్రాల్లోని బ్యూరోక్రాట్లకు తగులుతున్న ఎదురుదెబ్బలు చూస్తుంటే మారాల్సింది రాజకీయ నాయకులా, ప్రజలా అనే చర్చ సాగాలి.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఐపీఎస్ అధికారిగా, గురుకుల సెక్రెటరీగా మంచి పేరు సంపాదించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మూడేళ్ల క్రితం తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. నిజానికి ఉన్నత ఉద్యోగాలు వదిలిన నాయకులు అధికారంలో ఉన్న పార్టీల్లో చేరుతుంటారు. కానీ, ప్రవీణ్ కుమార్ అందుకు భిన్నంగా తన ఐడియాలజీకి తగ్గ బహుజన్ సమాజ్ పార్టీని ఎంచుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి పోటీకి దిగి గెలవలేకపోయారు. ఇలా కాదని బీఆర్ఎస్ నుంచి మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసినా మళ్లీ చేదు అనుభవమే మిగిలింది.
జయప్రకాష్ నారాయణ
చాలా కాలం క్రితమే ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి లోక్ సత్తా అనే సంస్థతో సామాజిక కార్యక్రమాలు చేసి మంచి పేరు సంపాదించిన జయప్రకాష్ నారాయణ.. తర్వాతి కాలంలో ఆ సంస్థను రాజకీయ పార్టీగా మార్చారు. మిగతా పార్టీల కంటే భిన్నంగా ఆ పార్టీని చెప్పుకోవచ్చు. రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేయదు ఆ పార్టీ. కారణం, ప్రజలకు అసౌకర్యం కలిగించే ఏ పనీ చేయమని అంటారు జయప్రకాష్. అలాంటి పార్టీ నుంచి కూకట్ పల్లి నుంచి జయప్రకాష్ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ, తర్వాతి కాలంలో ఆ పార్టీ గుర్తింపే కనుమరుగైంది.
జేడీ లక్ష్మీనారాయణ
మాఫియా కింగ్ గాలి జనార్ధన్ రెడ్డిని అరెస్టు చేయడంతో సంచలన పోలీస్ అధికారిగా వార్తల్లోకెక్కిన జేడీ లక్ష్మీనారాయణ సీబీఐలో చాలా కాలం పని చేశారు. ఆయన పేరులోని జేడీ సీబీఐలో జాయింట్ డైరెక్టర్ నుంచి వచ్చిందనే విషయం తెలిసిందే. అయితే ఐపీఎస్ పదవీ విరమణ చేసిన రాజకీయాల్లో ప్రవేశించిన ఆయన జనసేన పార్టీ నుంచి విశాఖపట్నం లోక్ సభ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించారు.
ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న చాలా మంది నేతల కంటే వీళ్లు చాలా రెట్లు నయమని ప్రజల్లోనే చర్చ నడుస్తుండడం కామన్. వీరి గురించి చాలా మంది పాజిటివ్ గానే మాట్లాడతారు. అయినా, వీరు రాజకీయాల్లోకి రాణించలేకపోవడం, ఓడిపోవడం ఆలోచించదగ్గ విషయం. సామాజిక ఆలోచనాపరులుగా మంచి గుర్తింపు ఉండే ఇలాంటి వారిని ప్రజలు ఎందుకు ఆదరించడం లేదనేది ఐదు ట్రిలియన్ డాలర్ల ప్రశ్న. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకునే వారికి ఇలాంటి సంఘటనలు నిరాశ కలిగిస్తున్నాయి.