గద్దర్ మరణ వార్తతో…
గద్దర్.. ఈ పేరు వినగానే విప్లవ పాటలు గుర్తుకు వస్తాయి. నిషేదిత మావోయిస్టు ఉద్యమానికి పాటల ఊపీరి పోసిన గద్దర్ కన్ను మూసాడనే వార్తను జీర్ణించుకోలేక పోతున్నారు ప్రజలు. అతను పాడిన పాట.. మాట తుపాకి తూటాలకంటే పదునైనదిగా ఉండేది. విప్లవ గీతాలు వినిపించగానే గద్దరన్నా పాడిన పాటనా..? అనే స్థాయిలో అతని పాటలు ప్రజల హృదయాలలో నిలిసాయి.
గద్దర్ కు తల్లిదండ్రులు పెట్టిన పేరు విఠల్ రావు. తరతరాలుగా అణచబడ్డ దళిత కుటుంబంలో పుట్టిన అతని పాటకు పెట్టిన పేరు గద్దర్. అసలు పేరును మరిచి పోయిన జనం అతనిని ప్రేమతో గద్దర్ అని పిలిసే వారు.
గద్దర్ పేరు వెనుక కథ
ఔను.. గద్దర్ పేరు వెనుక పెద్ద కథ ఉంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్దించక ముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన ‘గదర్ పార్టీ’ వీరోచితంగా పోరాటాలు చేసింది. ఇగో ఆ గదర్ పార్టీ నుంచి పార్టీని తొలగించి నక్సలైట్ ఉద్యమ నేత కొండపల్లి సీతారామయ్య విఠల్ రావుకు బదులుగా గద్దర్ గా పేరు పెట్టారు. నక్సలైట్ ఉద్యమంలో పని చేసే వారందరికి తల్లిదండ్రులు పెట్టిన పేరుకు బదులుగా మరో పేరుతోనే చలామణి అవుతారు. అది ఉద్యమంలో భాగమే..
బ్యాంక్ జాబ్ కు బై చెప్పి..
మెదక్ జిల్లా తూప్రాన్ కు చెందిన గుమ్మడి విఠల్ రావు అలియాస్ గద్దర్ ఇంజనీరింగ్ చదివి బ్యాంక్ లో క్లర్క్ ఉద్యోగం చేసేవారు. కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో ప్రారంభించిన నక్సలైట్ ఉద్యమంలో విప్లవ గీతాలు పాడుతూ ప్రజలు హృదయాలలో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు పొందారు. బ్యాంక్ ఉద్యోగానికి బై చెప్పి విప్లవ బాట పట్టిన గద్దర్ దేశ వ్యాప్తంగా విప్లవోద్యమ విస్తరణలో తన పాత్రను ఎవరు కాదనలేరు.