నిర్దేశం, హైదరాబాద్: దేశంలో అతిభీకర పరిస్థితిగా చెప్పుకునే ఎమర్జెన్సీ(అత్యవసర పరిస్థితి) విధించి మంగళవారంతో 50 ఏళ్లు పూర్తవుతాయి. దేశంలో ఇప్పటి వరకు 3 సార్లు ఎమర్జెన్సీ విధించగా, అందులో రెండుసార్లు ఇందిరా గాంధీ హయాంలోనే విధించారు. అయితే అంతకు ముందు రెండు ఎమర్జెన్సీలు వేరు కానీ, 1975 జూన్ 25న నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఏకపక్షంగా విధించిన ఎమర్జెన్సీ దేశాన్ని ఓ కుదుపు కుదిపివేసింది. ప్రజల కనీస హక్కులను కాలరాస్తూ 21 నెలల పాటు అప్రకటిత నియంతృత్వం రాజ్యమేలి, 1977 మార్చి ఎన్నికలలో ఇందిర ఘోర పరాజయంతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది. అందుకే జూన్ 25ను భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా అభివర్ణించారు. ఇక
3 సార్లు ఎమర్జెన్సీ
* మొదటి ఎమర్జెన్సీ 1962లో భారత్-చైనా యుద్ధం సమయంలో దేశ మొదటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ ఎమర్జెన్సీ విధించారు. ఇది 26 అక్టోబర్ 1962 నుంచి 10 జనవరి 1968 వరకు కొనసాగింది.
* రెండోది భారత్-పాకిస్తాన్ యుద్ధం సమయంలో 1971 డిసెంబర్ 3 నుంచి 7 వరకు ఎమర్జెన్సీని ఇందిరాగాంధీ విధించారు. ఈ రెండు సందర్భాల్లోనూ దేశంలోకి విదేశీ చొరబాట్లను ఆపే ఉద్దేశంతో ఎమర్జెన్సీ విధించారు.
* మూడవది దేశంలో అంతర్గత అలజడి పేరుతో 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు విధించారు. అంతర్గత కారణాలు అని బయటికి చెప్పినా, తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకే ఇందిరా ఈ నిర్ణయం తీసుకున్నారని వేరే చెప్పనక్కర్లేదు. ఎమర్జెన్సీ ముగియగానే ప్రజాస్వామ్య విజయంగా సంబరాలు చేసుకున్నారు.
ఎమర్జెన్సీ ఎందుకు విధించారు?
పాకిస్తాన్-బంగ్లాదేశ్ యుద్ధంలో కలుగజేసుకుని దేశంలో తిరుగులేని నేతగా ఎదిగారు ఇందిరా గాంధీ. ఆ తర్వాత 1971లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 352 సీట్ల గెలుచుకుంది. అపరకాళి, పేదలపెన్నిది, ప్రియతమ నేతగా ఎదగడమే కాకుండా, శక్తివంతమైన నేతగా అవతరించారు. అయితే నాలుగేళ్లకు కథ మారిపోయింది. దేశంలో కరువు, నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. అప్పటికే ప్రజలు ప్రభుత్వం మీద రగిలిపోతున్నారను. అదే సమయంలో రాయ్ బరేలి నుంచి ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు 1975 జూన్ 12న తీర్పునిచ్చింది. ఎన్నికలకు వెళ్దామంటే పరిస్థితి వేరేగా ఉంది. ఇక తన ఎన్నిక రద్దు చేయడం ఇందిరాకు పరువు సమస్యగా మారింది. దీంతో ఎమర్జెన్సీ విధించాలనే ఆలోచనకు వచ్చారు ఇందిరా.
ఇందిరా సూచన మేరకు రాష్ట్రపతి ఎమర్జెన్సీ విధించారు
వెంటనే ఇందిరా అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ మహ్మద్ ను సంప్రదించి ఎమర్జెన్సీ డిక్లరేషన్ మీద సంతకం చేయాలని కోరారు. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంది. దీంతో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 352(1) ప్రకారం 25 రాత్రి జూన్ 1975న దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి ఇందిరా గాంధీని ప్రధానిగా ఉండేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కాకపోతే ఆమె లోక్ సభ సభ్యతమే రద్దు చేశారు. కానీ, ఇందిరా తన లోక్ సభ సభ్యత్వం రద్దు కావడాన్ని అత్యంత అవమానంగా భావించారు.
21 నెలల పాటు కొనసాగిన ఎమర్జెన్సీ
1975 జూన్ 25న విధించిన ఎమర్జెన్సీని 21 నెలల పాటు అంటే 1977 మార్చి 21 వరకు దేశంపై విధించారు. ఎమర్జెన్సీ ప్రకటనతో పౌరులందరి ప్రాథమిక హక్కులు రద్దు చేశారు. మరీ దారుణం ఏంటంటే.. రాజ్యాంగంలోకి అత్యంత కీలకమైన స్వేచ్ఛగా జీవించే హక్కు ఆర్టికల్ 21 కూడా రద్దు చేశారు. దేశంలో ప్రతిపక్ష నేతల అరెస్టుల పర్వం మొదలైంది. జయప్రకాష్ నారాయణ్, లాల్ కృష్ణ అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, జార్జ్ ఫెర్నాండెజ్ వంటి పెద్ద నాయకులు సహా లక్షల మందిని అరెస్టు చేశారు. దేశంలోని జైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. పోలీసుల నుంచి భారీ వేధింపుల కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఎమర్జెన్సీ సమయంలో అనేక రకాల నల్ల చట్టాలు అమలు చేశారు. ఎలాంటి అభియోగాలు లేకుండా ప్రజలను నిర్బంధించారు. మీడియాను సెన్సార్ చేశారు. బలవంతంగా స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఎమర్జెన్సీ ఫలితం
ఎమర్జెన్సీ అనంతరం 1977లో లోక్ సభ ఎన్నికలు జరిగాయి. స్వప్రయోజనాల కోసం తమ స్వేచ్ఛను హరించి, ఇబ్బందులకు గురి చేసిన నేతలకు ప్రజలకు గట్టిగానే బుద్ధి చెప్పారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమి పాలైంది. జనతాదళ్ కూటమి అధికారంలోకి వచ్చింది. మొదటిసారి కాంగ్రెసేతర వ్యక్తి మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారు.