తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, బీఆర్ఎస్ (టీఆర్ఎస్) మొన్నటి మునుగోడు ఉప ఎన్నిక వరకు ఎంఐఎం సహా ఏ పార్టీతోనూ ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదు. ఒంటరిగానే పోటీ చేసింది. రాష్ట్ర విభజన నేపధ్యంగా జరిగిన 2014 ఎన్నికల్లోనూ, ఆ తర్వాత 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటిరిగానే పోటీ చేసింది. విజయం సాధించింది. ఉప ఎన్నికల్లో, జీహెచ్ఎంసి సహా రాష్ట్ర్రంలోని మున్సిపల్, కార్పొరేషనలు, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అక్కడక్కడ స్థానికంగా పొత్తులు పెట్టుకున్నా. రాష్ట్ర స్థాయిలో మాత్రం ఒంటరిగానే పోటీ చేసింది. ఎంఐఎంతో సహా మరే ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. ఎన్నికల తర్వతా సంఖ్యా బలాన్ని పెంచుకునేందుకు ముఖ్యమంత్రి కేసేఆర్ (బీజేపీ, ఎంఐఎం మినహా) అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు కడువాలు కప్పి కారు ఎక్కించారు.కానీ, ఎన్నికలకు ముందు మాత్రం మొన్నటి మునుగోడు ఉప ఎన్నిక వరకు ఏ పార్టీతోనూ ప్రత్యక్ష్యంగా పొత్తు పెట్టుకోలేదు. మొదటి సారిగా మునుగోడులో ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర శాసన సభలో ఎంఎఐఎం ను తమ మిత్ర పక్షంగా సగౌరవంగా ప్రకటించారు. విపక్షాలు ముఖ్యంగా బీజేపీ ఎన్ని విమర్శలు చేసినా, చివరకు రజాకార్ల పార్టీ అన్నా కేసీఆర్ పట్టించుకోలేదు. అవును.. ఎంఐఎం మా మిత్ర పక్షమని కేసీఆర్ ఒకటికి రెందు సార్లు స్పష్తం చేశారు. అంతే కాదు. ఎంఐఎం ఇతర రాష్ట్రాల్లో విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను స్వాగతించారు. కానీ ఇంత వరకూ ఎంఐఎంతో పొత్తు పెట్టుకునే ఆలోచన మాత్రం చేయలేదు. అయితే, ఇప్పుడు మిత్ర పక్షాలు (ఎంఐఎం, బీఆర్ఎస్) మధ్య దూరం పెరిగింది. దూరం పెరగడం కాదు, ఎంఐఎం ఏకంగా బీఆర్ఎస్ కు తలాక్ చెప్పెసిందని అంటున్నారు. ఒక విధంగా ఎంఐఎం మిత్ర పక్షం బీఆర్ఎస్ కు షాకిచ్చింది. వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. గత ఎన్నికల్లో, మిత్ర పక్షం అభ్యర్ధన మేరకు ఎంఐఎం కేవలం ఎనిమిది స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. ఏడు స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి మాత్రం, అల్లుడు అల్లుడే పేకాట పేకాటే అనే విధంగా ఎన్నికల పొత్తు ప్రస్తావన మాత్రం ఇంతవరకు చేయలేదు. మరోవంక, బీఆర్ఎస్ కు ఎంఐఎం తలాక్ చెప్పినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో శనివారం(ఫిబ్రవరి 4) ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య జరిగిన మాటల యుద్ధం కూడా అదే సంకేతాలు ఇస్తోందని అంటున్నారు.అసెంబ్లీలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సీఎం కేసీఆర్, మంత్రులు తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వరంటూ మండిపడ్డారు. మీరు చెప్రాసిని చూపిస్తే వారినే కలుస్తామంటూ ఎద్దేవా చేశారు. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. గొంతు చించుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదని.. ఏడుగురు సభ్యులు ఉన్న పార్టీకి గంటలు గంటలు సమయం ఇవ్వటం సరి కాదన్నారు. శానససభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఇంతకు ముందు అక్బర్ బాగానే మాట్లాడేవాడని ఇప్పుడు ఎందుకు కోపం వస్తుందో అర్థం కావటం లేదన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అక్బరుద్దీన్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఎంఐఎంకు కేవలం ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని కేటీఆర్ చేసిన కామెంట్ కు కౌంటర్ గా వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లలో పోటీ చేసే ప్రయత్నం చేస్తాం. కనీసం 15 మంది ఎమ్మెల్యేలు ఉండేలా చూస్తాం అంటూ అక్బరుద్దీన్ ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక ఉన్న ఆంతర్యమేంటని శ్రేణులు మల్లగుల్లాలు పడుతున్నాయి.ఇప్పటి వరకు మిత్ర పక్షంగా ఉన్న బీఆర్ఎస్, ఎంఐఎం స్నేహబంధం తెగిపోయినట్లేనా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైందని అంటున్నారు. మరోవైపు బీజేపీ పదేపదే చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టే వ్యూహంలో భాగమే ఈ ప్రకటన అనే చర్చ కూడా జరుగుతోంది. నిజంగానే ఎంఐఎం 50 స్థానాల్లో పోటీ చేస్తే, ఆపార్టీ 15 సీట్లు గెలుచుకునే విషయం ఎలా ఉన్నా బీఆర్ఎస్ కు ఆమేరకు నష్టం అయితే ఖాయంగా జరుగుతుందని అంటున్నారు.