విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజును తన కళ్లతో చూసి, ఆయనకు సేవలందించిన శతాధిక వృద్దుడు బీరబోయిన బాలుదొర కన్నుమూశారు. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఆయన వయసు 111 సంవత్సరాలు. వయసు మీదపడిన కారణంగా వచ్చిన అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా మంచానికే పరిమితమైన ఆయన, ఆదివారం నాడు మరణించారు. 1924లో అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ వారిపై పోరాటం జరుపుతున్న సమయంలో బాలుదొర బాలుడిగా ఉండేవారు.
అప్పట్లో తాను ఎత్తయిన కొండలపై ఉన్న అల్లూరి సీతారామరాజుకి, ఆయన అనుచరులకు ఆహార పదార్థాలను తీసుకుని వెళ్లి అందించేవాడినని, ఆయన్ను దగ్గరగా చూసే భాగ్యం తనకు లభించడం పూర్వజన్మ సుకృతమని, నాటి ఘటనలను బాలుదొర ఎంతో మందితో పంచుకునేవారు. ఆయన మరణవార్తను గురించి తెలుసుకున్న చుట్టుపక్కల వారు నివాళులు అర్పించేందుకు కొండపల్లికి తరలివచ్చారు.
Tags: Alluri Seetaramaraju, Balu Dora, Passes Away