ఎయిడ్స్ మహమ్మారి లేని సమాజ నిర్మాణానికి అన్ని వర్గాల వారు తమ వంతు కృషిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ అన్నారు. మంగళవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్బంగా ఎయిడ్స్ పై అవగాహన కల్పించే విధంగా బ్యానర్లను ప్రదర్శించారు. 2020 సంవత్సర నినాదమైన మద్దతు తెలుపుద్దాం బాధ్యత పంచుకుందాం అనే అంశం పై జిల్లా వైద్యారొగ్య శాఖ అధికారి ప్రసంగించారు. జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా ఎయిడ్స్ పై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దీని ఫలితంగా జిల్లాలో హెచ్.ఐ.వి కేసులు తగ్గాయని అన్నారు. ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ర్యాలీలు నిర్వహించడం లేదని తెలిపారు. జిల్లాలోని ప్రాథమిక ఆసుపత్రులు, ప్రభుత్వం ఆసుపత్రులలో అవగాహన బ్యానర్లు ప్రదర్శిస్తున్నామని తెలిపారు. ఎయిడ్స్ వ్యాధి ఎప్పుడు వస్తుందో తెలియదు కాని, దాని బారినపడి చనిపోయిన తర్వాత అందరికి తెలియపరుస్తుందని అన్నారు. ఎయిడ్స్ వ్యాధికి చికిత్స లేదని, చికిత్స కంటే అది రాకుండా నివారించడమే మార్గమని అన్నారు. సాంఘీక కట్టుబాట్లు లేనిచోట, వేశ్యా గృహాలు, విశృంఖల శృంగారం జరిపే చోట ఈ వ్యాధి ఎక్కువ వస్తుందని ఆయన అన్నారు. జీవితం, సమాజం, కట్టుబాట్లపై ఆలోచన లేక చాలా మంది నాశనమవుతున్నారని, ముఖ్యంగా యువత దీనిబారిని ఎక్కువగా పడుతున్నారని, చదువుకున్నవారైన ఈ వ్యాధిపట్ల సరైన అవగాహన లేక పోవడమే ఈ వ్యాధి వ్యాప్తికి కారణమని అన్నారు. నాగరికత అభివృద్ది చెందుతున్న కొద్ది వింత పోకడలు వస్తున్నాయని, నేటి సమాజంలో డేటింగ్ సంస్కృతి వచ్చి, మానవాళి చావును తొందరగా కొనితెచ్చుకుంటున్నారని అన్నారు. అక్రమ సంబంధాలను ఖండించాలని, వ్యాధి వస్తే తదనంతర పరిణామాలపై విస్తృత ప్రచారం చేసి, ప్రజల్లో అవగాహన, చైతన్యం తేవాలన్నారు. హెచ్.ఐ.వి పాజిటివ్ వచ్చిన వారు ఎ.ఆర్.టి మందులు తప్పనిసరిగా వాడడం మొదలుపెట్టాలని, గర్బిణి స్త్రీలకు హెచ్.ఐ.వి అని తెలిస్తే పిల్లలకు రాకుండా నివారించవచ్చు అని అన్నారు. మన జిల్లాలో ఎయిడ్స్ చాలా వరకు తగ్గుతుందని, ప్రజలు ఎయిడ్స్ పట్ల అవగాహన పెంచుకోని రక్త పరీక్షలు నిర్వహించుకోవాలని కోరారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి, సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి, మంథని ఆసుపత్రి, ప్రాంతీయ ఆసుపత్రి గోదావరి ఖని,ఎన్టిపిసి టీ బి సెంటర్ మరియు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్ఐవి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వారు నిర్వహించిన సమావేశంలో పాల్గోన్నారు.జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం వాసుదేవరెడ్డి , జిల్లా ఎయిడ్స్ నియంత్రణ పిఆర్ శ్రీనివాస్, , వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.జిల్లా పౌర సంబంధాల అధికారి, పెద్దపల్లిచే జారీచేయనైనది.ప్రజానేత్ర రిపోర్టర్ లక్ష్మి నారాయణ పెద్దపల్లి