నిర్దేశం, వాషింగ్టన్: ఆరోగ్యంగా ఉండాలంటే యోగా ఒక మంచి మార్గం. ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా యోగాకు ఆదరణ పెరిగింది. అయితే ఈ యోగాకు సంబంధించి ఒక బాధాకరమైన ఘటన చోటు చేసుకుంది. యోగా గురువు గురు కృష్ణ పట్టాభి జోయిస్ మనవడు శరత్ జోయిస్ (53) కన్నుమూశారు. అది కూడా ఆరోగ్యం కోసం యోగా క్లాసులు చెప్తున్న సందర్భంలో మరణించడం శోచనీయం. సోమవారం వర్జీనియా విశ్వవిద్యాలయం సమీపంలో హైకింగ్ ట్రయిల్‌లో గుండెపోటు వచ్చిందని ఆయన సోదరి షర్మిలా మహేష్ ధృవీకరించారు.
శరత్ జోయిస్ ప్రఖ్యాత యోగా శిక్షకుడు. అతను ఈ కళను తన తాత కృష్ణ పట్టాభి జోయిస్ నుంచి నేర్చుకున్నాడు. గురు కృష్ణ పట్టాభి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఆయన అనుచరులలో గ్వినేత్ పాల్ట్రో, మడోన్నా వంటి ప్రముఖులు ఉన్నారు. 2009లో తన తాత మరణంతో జాయిస్ వారసత్వాన్ని తీసుకున్నారు.
2019లో, శరత్ జోయిస్ తల్లి సరస్వతి రంగస్వామి ఈ ఇన్‌స్టిట్యూట్‌ని కె పట్టాభి జోయిస్ అష్టాంగ యోగ శాలగా మార్చారు. శరత్ యోగా సెంటర్ అనే కొత్త కేంద్రాన్ని ప్రారంభించారు. శరత్ ఇన్‌స్టిట్యూట్‌కి ప్రతి నెలా 5,000 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ప్రతి సెషన్‌లో దాదాపు 350-400 మంది విద్యార్థులు వచ్చేవారు. ఆయన ఆఫ్రికా, ఆసియా, యూరప్, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలకు అష్టాంగ యోగాను వ్యాప్తి చేసే బోధకులకు శిక్షణ ఇచ్చారు.
న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. ఆయన మరణించిన రోజున, జాయిస్ వర్జీనియా విశ్వవిద్యాలయంలో ఒక సెమినార్‌కు హాజరయ్యారు. దాదాపు 50 మంది విద్యార్థులతో వాకింగ్ వెళ్లి కొన్ని ఆసనాలు వేశారు. ఇక విద్యార్థులతో యోగా గురించి చెప్తుండగా ఒక్కసారిగా కిం పడిపోయారు. ఆయనకు గుండెపోటు వచ్చింది.