ప్రధాని మోదీ నాయకత్వంలో వికసిత భారత్- 2047 ను సాకారం చేయటంలో కార్మికులది కీలకపాత్ర
అన్ని రంగాల్లో ఆత్మనిర్బర్ భారత్ దిశగా శర వేగంగా అడుగులు వేసేందుకు కార్మికుల భాగస్వామ్యం చాలా అవసరం
– కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ
భువనేశ్వర్/ న్యూఢిల్లీ, నిర్దేశం:
అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో శనివారం జరిగిన భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రతినిధుల (బీఎంఎస్) అనుబంధ పారిశ్రామిక విభాగానికి చెందిన పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ నేషనల్ కాన్ఫెడరేషన్ 15వ త్రైవార్షిక ప్రారంభోత్సవ సమావేశాలలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ కార్మికుల ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసేందుకు ఈ – శ్రమ్ పోర్టల్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి చేపట్టిన అవగాహన కార్యక్రమాలతో ఇప్పటి వరకు 30 కోట్ల మంది కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని అన్నారు. 70 ఏళ్లుగా శ్రామిక, కార్మికుల పక్షాన నిలబడుతూ వారి కోసం పనిచేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద కార్మిక సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్ అని, బీఎంఎస్ వ్యవస్థాపకులు, ప్రచారక్ శ్రీ దత్తో పంత్ ను స్మరించుకున్నారు. భారత ప్రధాని మోదీ నాయకత్వంలో వికసిత భారత్ – 2047 కలను సాకారం చేసేలా అన్ని రంగాల్లో దేశాన్ని ఆత్మ నిర్బర్ భారత్ దిశగా శర వేగంగా అడుగులు వేసేందుకు కార్మికుల భాగస్వామ్యం అవసరమని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం నారీ శక్తిని బలోపేతం చేసేలా, ప్రసూతి చట్టాన్ని సవరించి, సెలవులను 12 వారాల నుంచి 20 వారాలకు పెంచినట్టు తెలిపారు. అలాగే కనీస వేతనాన్ని 10 వేల నుంచి 21 వేలకు పెంచి కార్మికులకు అండగా నిలిచామని, ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను 12 వేల నుంచి 18 వేలకు పెంచామని అన్నారు. ఉద్యోగుల పెన్షన్ పథకాన్ని సవరించి కనీస పెన్షన్ నెలకు వెయ్యి రూపాయలకు, గ్రాట్యుటీ మొత్తాన్ని 2018 నుంచి 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచినట్టు శ్రీనివాస వర్మ తెలిపారు. ఈఎస్ఐ చందాదారులకు మరణ బీమా కవరేజ్ గరిష్ట పరిమితిని 3.6 లక్షల నుంచి 6 లక్షలకి పెంచి వారికి ప్రయోజనం చేకూర్చామని, అసంఘటిత రంగ కార్మికులకు ఈఎస్ఐ ప్రయోజనాలను విస్తరింపజేశామని అన్నారు. మొన్నటి బడ్జెట్లో స్విగ్గి, జామోటోలో పని చేసే కార్మికులు కూడా ఈ – శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించిన ఘనత తమకే దక్కిందని అన్నారు. మోదీ నిర్ణయంతో కోటి మందికి ప్రయోజనం చేకూరుతోందని అన్నారు. రానున్న రోజుల్లో కార్మికుల సంక్షేమానికి మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని, మజ్దూర్ సంఘ్ ప్రతినిధులు ఈ సమావేశం ద్వారా తమ దృష్టికి తీసుకువచ్చే తీర్మానాలను అధికారులతో స్టడీ చేసి సాధ్యమైనంత త్వరగా అమలు చేసేందుకు కృషి చేస్తానని, కార్మికులు తమ హక్కులతో పాటు బాధ్యతలను కూడా నెరవేర్చాలని కేంద్ర మంత్రి వర్మ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆలిండియా బీఎంఎస్ ప్రెసిడెంట్ హరన్మయ్ పాండ్యా జీ, ఆల్ ఇండియా బీఎంఎస్ ప్రభారి పిఎస్ఈఎన్ఎస్ ఎస్.మల్లేశం జీ, ఆల్ ఇండియా బీఎంఎస్ కార్యదర్శి రామ్‌నాథ్ గణేశా జీ, పెద్ద సంఖ్యలో మజ్దూర్ సంఘ్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.