మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి
మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, నిర్దేశం:
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో మహిళలు రాజకీయంగా నష్టపోతున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనగణనతో ముడిపెట్టి కేంద్రం ఇప్పటికీ అమలు చేయడం లేదని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లు అమలుకానందు వల్ల మహారాష్ట్ర, ఢల్లీి, హర్యాన వంటి ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మహిళలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. జనగణనకు బడ్జెట్‌లో నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనగణన త్వరగా పూర్తిచేస్తే.. రాబోయే బీహార్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మరింత మంది మహిళలు ఎమ్మెల్యేలుగా అవుతారన్నారు. ప్రతీ మహిళకు రూ.2500 ఇస్తామన్న హామీని అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతామని చెప్పారు. మహిళా సంఘాల ద్వారా కిరాయికి తీసుకుంటున్న బస్సులకు ఆర్టీసీ సకాలంలో కిరాయి చెల్లిస్తుందో లేదో స్పష్టత ఇవ్వాలన్నారు. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచకపోవడం సరికాదని విమర్శించారు. మహిళలను ఎలా కోటీశ్వరులను చేస్తారో నిర్దిష్టమైన ప్రణాళికను ప్రభుత్వం బహీర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మహిళా కేంద్రీకృత పాలన చేశారని వెల్లడిరచారు. మహిళల కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. కేసీఆర్ పెట్టిన పథకాలను తీసేసే కర్కోటక ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో మహిళా, పురుషుల సమానత్వపు బొమ్మలు ప్రచురిస్తున్నారని వెల్లడిరచారు. అలాంటి చర్యలు తెలంగాణలో కూడా రావాల్సి ఉందన్నారు. ‘సమాజం ఎదుగుదలలో మహిళల పాత్ర గణనీయం. ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు సమాన హక్కులు, గౌరవం, నిర్ణయాధికారం రావాల్సి ఉంది. అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. చిట్యాల ఐలమ్మ, రాణి రుద్రమాదేవి వంటి వీర మహిళలు తెలంగాణ గడ్డపై పుట్టడం మనకు గర్వకారణం. మహిళలకు కులమతాలు లేవు.. మహిళలది ఒకే కులం. మహిళలలు ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలి. ఇళ్లలో మహిళలు ద్వితియ శ్రేణి పౌరులుగా ఉంటున్నారన్న వాదన వీగిపోవాలి. అమెరికాలో 40 శాతం మహిళలు ఉద్యోగాలు చేస్తుంటే, భారత్‌లో మాత్రం అది 17 శాతంగానే ఉంది. దేశంలో 50 శాతం మహిళలు ఉద్యగాలు చేస్తే దేశ జీడీపీకి మనం 5 లక్షల కోట్ల ఆదాయం ఇవ్వగలుగుతాం. కానీ మహిళలు ఉద్యోగాలు చేయదగడానికి గల సౌకర్యాలు ఉన్నాయా అన్నది ఆలోచించాలి. భూగర్భ గనులల్లో పనిచేయడం నుంచి అంతరిక్షంలోకి వెళ్లే వరకు మహిళలు ఎదిగారు. అయినా అనేక అవాంతరాలు ఉన్నాయి. వాటిని అధిగమించాల్సిన అవసరం ఉంది’ అని చెప్పారు.