రాహుల్ గాంధీ సామాజిక న్యాయం అమలయ్యేనా?
– ప్రాతినిధ్యం లేని కులాలకు న్యాయం జరిగేనా?
– గ్రూపు రాజకీయాలతో పెరిగిన ఆశావాహులు
– కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ కు 1 దక్కే చాన్స్
– ఇప్పటికే కాంగ్రెస్ పై రెడ్డి ముద్ర, ప్రజల్లో వ్యతిరేకత
– డీఎస్పీ గంగాధర్ కు అవకాశం ఇస్తే అన్నింటా కాంగ్రెస్ అదృష్టం
నిర్దేశం, హైదరాబాద్ః
రాహల్ గాంధీ చెప్పుకొస్తున్న సామాజిక న్యాయం మైసూర్ బజ్జీలో మైసూర్ లాగే మారింది. ఆయనేమో బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల జనాభా ప్రకారం.. అన్ని రంగాల్లోనూ ప్రాధాన్యత ఉండాలంటున్నారు. కానీ, కాంగ్రెస్ నేతలేమో దాన్ని ఎంతమాత్రం పాటించడం లేదు. మన తెలంగాణ రాష్ట్రమే చూసుకుంటే.. కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ అని ఎప్పుడో పడిపోయిపోయిన పేరు..
ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కులగణన చేసి గొప్పలు చెప్పుకుంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. తమ పార్టీలో ప్రభుత్వంలో ఆ కులాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలన్న ఆలోచన చేయడం లేదు. సీఎం కుర్చీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు సహా అన్ని పదవుల్లో మెజారిటీ రెడ్లను నింపుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకే ఒక స్థానంలో పోటీ చేసినప్పటికీ అక్కడ కూడా రెడ్డినే నిల్చోబెట్టారు.
చట్టసభల్లో అన్ని కులాల ప్రాతినిధ్యం చాలా అవసరం. వారిని పైకి తీసుకురావాల్సిన భాద్యత ప్రభుత్వానికే ఉంటుంది. ఇప్పటి వరకు జరిగింది జరిపోయింది. కానీ, ఇకనైనా దాని మీద దృష్టి పెట్టొచ్చు. తెలంగాణ ప్రాంతంలో 5 ఎమ్మెల్సీలకు నోటిఫికేషన్ వచ్చింది. ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఈ ఎమ్మెల్సీల్లో నాలుగు స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఒక స్థానం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు వెళ్లే అవకాశం ఉంది. అయితే నాలుగు స్థానాల్లో సామాజికంగా వెనుకబడిన కులాలకు కాంగ్రెస్ టికెట్లు ఇస్తే రాహుల్ గాంధీ చెప్పే సామాజిక న్యాయానికి కాస్తైనా అర్థం ఉంటుంది.
కాంగ్రెస్ చెప్పే మాటలకు చేష్టలకు పొంతన లేకనే మొన్నటి గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. విచిత్రంగా కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఆ స్థానాల్లో గెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. రెడ్డి కాంగ్రెస్ అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. కాంగ్రెస్ బహిష్కృత నేత తీన్మార్ మల్లన్న సహా.. మధు యాష్కి లాంటి పార్టీ నేతలు కూడా కాంగ్రెస్ ను అగ్రకుల పార్టీలాగే మాట్లాడుతున్నారు. ఇక బయటి వారి సంగతి పెద్దగా చెప్పనక్కర్లేదు అనుకుంట. ఇలాంటి పరిస్థితిలో తన చేతిలో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీల్లో అయినా కాంగ్రెస్ సామాజిక న్యాయాన్ని పాటించి తీరాలి. ఇది ఆ పార్టీకి అల్టిమేటమే.
నిజానికి గ్రాడ్యూయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పు చేసింది. డీఎస్పీ గంగాధర్ ను అభ్యర్థిగా తీసుకుని ఉంటే.. కాంగ్రెస్ గెలిచేది. ఎందుకంటే.. ఎన్నికల ముందు అభ్యర్థుల్లో అందరి కంటే ముందు వరుసలో గంగాధరే ఉన్నట్లు సర్వేల్లో తేలింది. గంగాధర్ కు ప్రజాధరణ ఎక్కువగా ఉందని అనేక సర్వేలు చెప్పాయి. ఇదే కాకుండా.. సామాజిక వర్గంగా కూడా డీఎస్పీ గంగాధర్ ను తీసుకుంటే కాంగ్రెస్ మంచి పేరు వచ్చేది. ఎందుకంటే.. సమాజంలో అత్యంత వెనుకబడిన బుడ్గజంగం ఆయనది. ఆ సామాజిక వర్గం నుంచి మొదటిసారి యూనివర్సిటీ లెవల్లో ఉన్నత చదువులు చదివి, డీఎస్పీ వరకు ఎదిగిన వ్యక్తి ఆయన. ఆయనకు కనుక అవకాశం ఇస్తే.. కాంగ్రెస్ ఖాతాలో ఒక ఎమ్మెల్సీ పెరగడమే కాకుండా.. కాంగ్రెస్ చెప్తున్న సామాజిక న్యాయానికి అర్థం వచ్చేంది. ప్రజల్లో కూడా కాంగ్రెస్ ప్రతిష్ట పెరిగేది.
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువ. సీఎంను కూడా లెక్కచేయకుండా గ్రూపు రాజకీయాలు ఉంటాయి. ఆ గ్రూపు రాజకీయాల వల్లే డీఎస్పీ గంగాధర్ కు రావాల్సిన టికెట్ దూరమైంది. లేదంటే, గంగాధరే పోటీలో ఉండేవారు. గెలిచేవారు. ఈరోజు బీజేపీ ఓడిపోయేది. ప్రభుత్వ వ్యతిరేకత కంట్రోల్ అయ్యేది. కాంగ్రెస్ ఇమేజ్ పెరిగేది. ఒక్క గంగాధర్ ను వదులుకోవడం వల్ల కాంగ్రెస్ ఇవన్నీ పోను.. తీవ్ర వ్యతిరేకతతో పాటు రెడ్డి పార్టీగా మరింత బద్నాం అయింది. డీఎస్పీ గంగాధర్ కు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని అనేక సంఘాలు, కులాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. అయినప్పటికీ అవి కాంగ్రెస్ చెవికి ఎక్కడం లేదు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన దెబ్బ తర్వాతైన కాంగ్రెస్ కళ్లు తెరిస్తే మంచిది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి డీఎస్పీ గంగాధర్ ఒక మంచి అవకాశం. రాహుల్ గాంధీ సామాజిక న్యాయం అమలు ఇక్కడి నుంచే అయితే.. తెలంగాణలో కాంగ్రెస్ కు మంచి పేరు వస్తుంది. మరి రాహుల్ సామాజిక న్యాయం అమలు అయ్యేనా?