వన్యజీవి రామయ్య మృతి
నిర్దేశం, ఖమ్మంః
పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల సంతాపం తెలిపారు. రామయ్య మరణం సమాజానికి తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రాగాడ సానుభూతి తెలియజేశారు. ప్రకృతి, పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి వనజీవి రామయ్య అని సీఎం రేవంత్ అన్నారు. ఆయన సూచించిన మార్గాలు నేటి యువతకు మార్గదర్శకం అని సీఎం రేవంత్ అన్నారు. పర్యావరణ రక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వనజీవి రామయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రాస్థిస్తున్నట్టు సీఎం రేవంత్ తెలిపారు.
ప్రకృతి ప్రేమికుడు, హరిత స్వాప్నికుడు, వనజీవి రామయ్య మృతి సమాజానికి తీరని లోటుని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వృక్షో రక్షతి రక్షితః అన్న సిద్ధాంతాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించి, మొక్కలను బిడ్డలవలే పెంచిన వ్యక్తి రామయ్య అని హరీష్ రావు అన్నారు.రామయ్య మృతిపై అటు ఏపీ మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వనజీవి రామయ్య మరణం బాధాకరం అన్నారు. “వృక్షో రక్షతి రక్షితః” అన్న ఆయన జీవన సందేశమే ఆయన జీవిత సారాంశమని తెలిపారు.
చెట్లను మన వంశపారంపర్యంగా భావించి, వాటిని సంరక్షించడం ద్వారా మన భవిష్యత్తును కాపాడతామని చెప్పిన ఆయన, అసలైన పర్యావరణ యోధుడని లోకేష్ తెలిపారు. ఆయన చూపిన మార్గాన్ని మనందరం అనుసరిస్తేనే ఆయనకు నిజమైన నివాళి అవుతుందని లోకేష్ అన్నారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.వృక్షో రక్షతి రక్షితః అన్న సిద్ధాంతాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించిన వ్యక్తి పద్మశ్రీ వనజీవి రామయ్య. ఈయన శనివారం(ఏప్రిల్ 12) తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కోటి మొక్కలు నాటి ఇంటి పేరును వనజీవిగా మార్చుకున్న వ్యక్తి దరపల్లి రామయ్య. ఆయన సేవలకు గాను 2017లో కేంద్ర ప్రభుత్వం రామయ్యను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.