నిర్దేశం, స్పెషల్ డెస్క్ః కన్నీళ్లు అనేవి మనుషుల ప్రత్యేక వ్యక్తీకరణ. భరించలేని దుఃఖం, తట్టుకోలేని ఆనందం.. ఇలా ఏదైనా బలమైన భావోద్వేగాన్ని చెప్పేది, చూపించేది కన్నీళ్లు మాత్రమే. ఆనందంతో ఏడ్చినా, సంతోషంతో ఏడ్చినా కన్నీళ్లే చివరి జవాబు. అయితే, ఏడ్చినప్పుడు ఈ కన్నీళ్లు ఎందుకు వస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? దీని గురించి శాస్త్రవేత్తలు చాలా ఆసక్తికరమైన వెల్లడించారు. అంతే కాదు, కన్నీళ్ల ద్వారా సంతోషం, దుఃఖం వేరు చేసి చెప్పొచ్చట.
కన్నీళ్లు ఎన్ని రకాలు?
కన్నీళ్లలో కూడా రకాలు ఉంటాయనే మీరు ఆశ్చర్యపోక మానరు. వాటిలో మూడు రకాల కన్నీళ్లు ఉన్నాయట.
బేసల్ కన్నీరు : ఈ కన్నీళ్లు కళ్లను లూబ్రికేట్ చేయడానికి, దుమ్ము నుండి రక్షించడానికి పని చేస్తాయి . ఇవి భావోద్వేగాలకు సంబంధించినవి కావు.
రిఫ్లెక్స్ కన్నీళ్లు : ఉల్లిపాయ కోసిన తర్వాత వచ్చే కన్నీళ్లను రిఫ్లెక్స్ టియర్ అంటారు. ఇవి కూడా భావోద్వేగాలకు సంబంధించినవి కావు.
భావోద్వేగ కన్నీళ్లు : సంతోషం, విచారం, కోపం లేదా మరేదైనా భావోద్వేగాల వల్ల వచ్చే కన్నీళ్లను భావోద్వేగ కన్నీళ్లు అంటారు.
భావోద్వేగ కన్నీళ్లు ఎందుకు వస్తాయి?
శాస్త్రవేత్తలు భావోద్వేగ కన్నీళ్లపై అనేక అధ్యయనాలు నిర్వహించారు. ఈ అధ్యయనాలు ఆనందంతో వచ్చే కన్నీళ్లకు, అలాగే దుఃఖంతో వచ్చే కన్నీళ్లకు మధ్య కొన్ని రసాయన వ్యత్యాసాలు ఉన్నాయని తేలింది. ఉదాహరణకు, విచారంతో వచ్చే కన్నీళ్లు ఒత్తిడి హార్మోన్ల స్థాయిలను కలిగి ఉంటాయి. అయితే ఆనందంతో వచ్చే కన్నీళ్లలో ఎండార్ఫిన్లు అధిక స్థాయిలో ఉంటాయి. ఎండార్ఫిన్ అనేది సహజమైన నొప్పి నివారిణి, ఇది మనకు సంతోషాన్నిస్తుంది.