మాయావతిని చంపేయాలని కాంగ్రెస్ అంటే బీజేపీ ఎందుకు సైలెంట్ గా ఉంది?
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉదిత్ రాజ్ ఉన్నట్టుండి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కృష్ణుడు ఒక మాట చెప్పాడని, దాని ప్రకారం మాయావతి చంపేయాలంటూ దుర్మార్గమైన రీతిలో స్పందించారు. నిజానికి.. చిన్న చిన్న కామెంట్లకు పార్లమెంట్ లో బల్లలు పగిలిపోతాయి. మీడియా చానళ్లలో స్పీకర్లు పగిలిపోయేలా డిబేట్లు నడుస్తాయి. ఇక రాజకీయ పార్టీ నేతల ఆవేశాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూడో ప్రపంచం యుద్దం వచ్చినంత పనైపోతుంది. అలాంటిది, మాయావతి చంపేస్తామంటే ఎలాంటి అలికిడీ లేదు. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మినహా మరెవరూ ఇది తమకు పట్టనట్లే ఉన్నారు. చిత్రంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దొరుకుతుందా అని గోతికాడి నక్కలా ఎదురుచూసే భారతీయ జనతా పార్టీ కూడా ఎంత మాత్రం పట్టించుకోకుండా ఉంది. ఒక రకంగా చూస్తే.. కాంగ్రెస్, బీజేపీల కలయికకు నిదర్శనం ఈ సందర్భం. మరి వారి కలయిక ఎందుకోసం? ఆ అవసరం వారికి ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం.
దేశం మొత్తం కాంగ్రెస్ వర్సెస్ ఇతర పార్టీలు అన్నట్లు ఉన్న సందర్బం ఆది. ఆ సమయంలో బీజేపీ అంత పెద్ద స్థాయిలో లేదు. బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ స్థాయిలో ఇంత పెద్ద పార్టీ అవుతుందని కాంగ్రెస్ ఊహించలేదు. పైగా, దేశ సామాజిక పరిస్థితుల గురించి తెలిసిందే కదా. ఒక చమార్ కులంలో పుట్టిన కాన్షీరాం అనే వ్యక్తి ఆధిపత్య కుల పార్టీలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పార్టీని నిర్మిస్తే ఏ ఆధిపత్య కుల పార్టీ అయినా కళ్లల్లో బొగ్గులు పోసుకుని మంట పెట్టుకుంటుందని వేరే చెప్పనక్కర్లేదు. కాంగ్రెస్, బీజేపీలకు అదే అనిపించింది. దీనికి తోడు మాయావతి యూపీలో మొట్టమొదటి పూర్తి కాలం (5 ఏళ్లు) ప్రభుత్వాన్ని నడిపించి ఆధిపత్య కులాలకు చెమటలు పట్టించారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలకు అప్పుడు మొదలైంది అభ్యంతరం. బీజేపీలో ఉన్న దళితుల గురించి, కాంగ్రెస్ లో ఉన్న దళితుల గురించి మనం మాట్లాడుతూనే ఉంటాం. సొంత పార్టీలో ఒంగి దండాలు పెట్టే దళితులంటేనే గిట్టని పార్టీలకు వారికి వ్యతిరేకంగా పార్టీ ఉంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ఉంది అన్నప్పుడు.. తమలోని అగ్రకుల అహంకారం పేట్రేగి సహజంగానే వారిని ఏకం చేస్తుంది. కాకపోతే, అది బయటికి కనిపించకుండా.. నేను గిల్లినట్టు చేస్తా, నువ్వు అరిచినట్లు చెయ్ అన్నట్లు ఉంటుంది. బహుశా ఈ మాట చెప్తే చాలా మంది నమ్మరు. కానీ, చరిత్రను తిరగేసి చూస్తే అర్థం అవుతుంది.
కుర్చీ కొట్లాటలో అగ్రకుల పార్టీలకు పోటీ ఉంటుంది. కానీ, ఆ కుర్చీ ఒక నిమ్న కులానికి వెళ్తుందంటే వారిలో చైతన్యం వస్తుంది. మండల్ ఉద్యమం అనంతరం ఈ చైతన్యం బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఏర్పడింది. కాకపోతే, తమను శత్రువులుగా చూయించుకుంటూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకత్వంలో ఉన్న పార్టీలను అంతం చేయడం ఆ పార్టీల కర్థవ్యం అయింది. సామాజిక న్యాయం అనే మాటెత్తిన పార్టీలను చంపుతూ వచ్చాయి. మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం జనతా పార్టీ ఆధ్వర్యంలో 1977 మార్చి 24న ఏర్పడింది. జనతా పార్టీ నాయకత్వం అది. అలా ఇద్దరు ప్రధానులను ఇచ్చింది. అలాగే జనతా దళ్ పార్టీ ముగ్గురు ప్రధానులను ఇచ్చింది. సమాజ్ వాదీ జనతా పార్టీ ఒక ప్రధానిని ఇచ్చింది. ఈ మూడు పార్టీలు సామాజిక న్యాయం అనే ఉద్దేశంతో ఏర్పడినవే. ఆ పార్టీల్లోని నాయకులు చాలా మట్టుకు శూద్ర నాయకులు. మరి, ఈ మూడు పార్టీలను చంపేసింది కాంగ్రెసేనని వేరే చెప్పనక్కర్లేదు. అలాంటిది, కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సరిపోని, సరితూగని భారతీయ జనతా పార్టీని చంపడం లెక్క కాదు. చంపకపోగా.. ఆ పార్టీ నిరంతరం ఎదుగుతూ వచ్చింది. కాంగ్రెస్ తలుచుకుంటే, బీజేపీ కూడా కాలగర్భంలో కలిసిపోయేదే. కానీ నేడు కాంగ్రెస్ కంటే పెద్ద పార్టీ అయింది. కారణం.. జెండాలు వేరైనా ఆ రెండు పార్టీల ఎజెండా ఒకటే. అదే అగ్రకులా రాజకీయం.
శూద్రులనే ఓర్చుకోని కాంగ్రెస్ పార్టీ దళితులు ముందుకు వస్తే ఊరుకుంటుందా? ఈమాత్రం ఆలోచన రావడానికి పెద్ద పెద్ద చదువులు, విశ్లేషనలు అవసరం లేదు. మన దేశ కుల వ్యవస్థపై కనీస అవగాహన ఉన్నా అర్థం అవుతుంది. పైగా, బీఎస్పీ ఎక్కడైతే ఎదిగిందో కాంగ్రెస్ అక్కడ చచ్చిపోయింది. అంత పెద్ద యూపీ నుంచి కాంగ్రెస్ పార్టీని మెడపట్టుకుని బయటికి గెంటేశారు కాన్షీరాం. అసలే దళితులు అంటే, వారి చేతిలో భంగపాటు. అప్పటి నుంచి కాంగ్రెస్ రగులుతూనే ఉంది. ఏదో ఒక విధంగా బీఎస్పీని అంతం చేసి.. దళిత, ముస్లిం ఓట్లను తన ఓటు బ్యాంకుగా చేసుకోవాలి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది ( ఈ రెండు వర్గాలు కాంగ్రెస్ పార్టీకి కట్టర్ ఓట్ బ్యాంక్ అని తెలిసిందే కదా). ఇక మత పరంగా ఓట్లు సంపాదించి గద్దెనెక్కే బీజేపీకి.. కులాల గురించి మాట్లాడితే అంతకంటే ఎదురుదెబ్బ ఉండదు. పైగా, దళిత నాయకత్వం ఎదిగితే ఓర్చుకోలేని తనం ఎలాగూ ఉంది. అందుకే ఈ రెండు పార్టీలు ఒకరికొకరు చెప్పుకోకపోయినా.. తమ ఉద్దేశాలను ఉమ్మడిగానే అమలు చేస్తూ వస్తున్నాయి. అందుకే.. బీఎస్పీని బీజేపీ బీ-టీం అని కాంగ్రెస్ అంటే.. బీజేపీ గమ్మున ఉంటుందే తప్ప నోరు తెరిచి తమకు సంబంధం లేదని చెప్పదు. దళితుల మీద అగాయిత్యాలు జరిగినప్పుడు పార్టీలకతీతంగా అగ్రకులాల ఐక్యత ఎలా ఉంటుందో.. దళిత నాయకత్వంలో ఉన్న పార్టీ మీద దాడి జరిగినప్పుడు అగ్రకుల పార్టీలకు అంతే ఐక్యత ఉంటుంది. కులం అనేది రాజకీయాలకు అతీతం కాదని గుర్తుంచుకోవాలి మరి.