రక్తంతో ‘‘తడిసిన’’ ఉద్యమం
నక్సల్స్ – పోలీసుల హింస ఆగేదెప్పుడు..?
ధారావాహిక – 08
‘‘దున్నేవానిదే భూమి’’ అనే నినాదంతో నక్సలైట్లు తమ ఉద్యమాన్ని ఉదృతం చేశారు. గ్రామీణ ప్రాంతాలలో భూములు లేని పేదలను సంఘటితం చేశారు. భూస్వాముల భూములలో ఎర్రజెండాలు పాతి గ్రామ రక్షణ దళాల ఆధ్వర్యంలో భూములు పంపిణి చేశారు. కానీ.. భూపోరాటాలకు సంబంధించి దళాలు అన్ని చేయాలనే దృక్పథం వల్ల, భవిష్యత్‌లో రానున్న లీగల్ సమస్యలు చర్చించక పోవడం, ప్రజల్లో ఆర్థిక వాదాన్ని అధ్యయనం చేయక పోడంతో నిర్బంధ కాలంలో భూపోరాటాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడ్డది భారత కమ్యూనిష్టు పార్టీ (మార్క్సిస్ట్`లెనినిస్ట్) మావోయిస్టు పొలిట్‌బ్యూరో.. దున్నెవానిదే భూమి నిజం కావాలంటే ప్రజారాజ్య అధికారం కావాలన్న సృహను ప్రజల్లో ఇంకా పెంచాలని, సిద్ధాంత నిబంద్ధత, త్యాగనిరతి కలిగిన క్యాడర్‌ను రూపొందించాలని, చదువుకున్న వారిని ఆకర్షించాలని పేర్కొంది. క్యాడర్ లొంగుబాటుకు సాహిత్య అధ్యానాన్ని నిర్లక్ష్యం చేయడం ఒక కారణంగా సమీక్షలో చర్చించింది. యువజన, మహిళ సంఘాల నిర్మాణం పనితీరు మెరుగు పరుచాలని, గ్రామ కమిటీల్లో కొందరి పెత్తనానికి చరమ గీతం పాడి అందరి భాగస్వామ్యం పెంచాలని సహాకార పంఘాలకు కూడా ఇవ్వాలని ఇంటిలిజెన్స్ నెట్‌వర్క్ మరింత పెంచుకోవాలని సూచించింది. అధ్యయనం నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించినట్లయితే సంక్షోభాల నుంచి బయటపడగలమని అభిప్రాయపడింది.
నక్సల్స్ ఉద్యమ అద్యయనం.. సమీక్ష ఉద్యమాన్ని ఇదే రీతిలో ముందుకు తీసుకుపోవాలన్న నిర్ణయాన్నే వెల్లడిరచింది. సమీక్ష యావత్తూ పార్టీ నిర్మాణ లోపాలను సమీక్షించింది. మొత్తంగా ఉద్యమ స్పరూపాన్ని మార్చడం, ఉద్యమ ఎత్తుగడలతో గాని, చర్చలు ప్రతి చర్యలు విషయంలో గానీ మార్పులు సూచించలేదు. పోలీసులను ముఖ్య శత్రువులుగా పరిగణించడంలో మార్పులేదు. సాయుధ పోరాటం విషయంలో వెనకడుగూ లేదు.

నేటి ఉద్యమం పరిస్థితి..
శతృవు బలమైన దెబ్బకు కొద్దిసేపు ఏర్పడే దిగ్రాంతి వంటి పరిస్థితి ఉద్యమంలో వ్యక్తమైంది. దళాలు చెదిరి పోవడం లొంగిపోవడంతో నక్సల్స్ ఉద్యమాన్ని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయకుండా భారత దేశ వ్యావ్తంగా విస్తరించాలని నిర్ణయించింది. మళ్లీ నిర్మాణం చేసుకుని రావాల్సి రావడంతో తాత్కలికంగా ఏర్పడిన స్థబ్దతను అమరులైన ముఖ్యనేతలు సురపనేని జనార్దన్ రావు, మల్లోజుల కోటేశ్వర్‌రావు, నల్లా ఆదిరెడ్డి, మాధవ్, శీలం నరేష్, సంతోష్‌రెడ్డి, రాజ్ కుమార్, దొంతు మార్కెండెయా, పటెల్ సుధాకర్, రాంచందర్, మల్లన్న, సత్యంలు అస్తమయం అయినా వారి సితాభస్మం నుంచే పునర్జన్మ పొందాలన్న పట్టుదల, అక్కడక్కడా పేల్చివేతలతో ఉనికి చాటే యత్నం, కాడర్‌లో మనోధైర్యానికి యత్నాలు. హింసపైనే విశ్వాసం. ప్రజల్లో ప్రారంభమైన వ్యతిరేకతను గమనించని పరిస్థితి రాజ్యం వేయి చేతులతో విరుచకపడ్డా పోరాటమును ఒంటి చేత్తోనే ఎదుర్కొనే వ్యూహంతో నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం సాయుద పోరాటమే ఏకైక మార్గంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది భారత కమ్యూనిష్టు పార్టీ (మార్క్సిస్ట్`లెనినిస్ట్) మావోయిస్టు పార్టీ..

రేపు…
ఉద్యమం పుట్టింది సమస్యల్లోంచి కాబట్టి సమస్య తీరనంత వరకూ ఉద్యమం నిలిచిపోదు. నిర్బంధం ఎదురైన ప్రతిసారీ నీరుగారినట్టు కన్పించడం. దళాలు అంతమైనప్పుడు కార్యకలాపాలు ఆగిపోవడం మళ్లీ శక్తియుక్తులు కూడదీసుకోవడం గత అనుభవం. నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగం, ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత, అమ్మివేత, ఉద్యోగుల కుదింపు, రైతును వ్యవసాయం నుంచే తరిమివేసే ధరల విధానం ఇవన్నీ ఉద్యమానికి ఊతమిచ్చే పరిస్థితి. ఆకలి, నిరాశ, నిరుద్యోగం, పీడన తిష్ట వేసిన సమాజంలో ఉపాధి, స్వేచ్ఛ, పీడన నుంచి రక్షణ, వ్యక్తి వికాసానికి అనువైన వాతావరణం కల్పించనంత వరకు ఈ యుద్దకాండ కొనసాగుతూనే ఉంటుంది. అందుకే ఉద్యమాలకు ఇది విరామం.. విరమణ కాదు.. నూతన ప్రజాస్వామిక విప్లవం సాధించే వరకు దీర్ఘకాలిక సాయుధ పోరాటం జరుగుతునే ఉంటుందని మావోయిస్టులు నమ్మి ఇంకా పోరాటాలు చేస్తున్నారనేది నగ్న సత్యం..
( ఇప్పటికి సమాప్తం.. )