నాగిరెడ్డి సిట్ ఏమైంది..?
- నయీం కేసును కాంగ్రెస్ ప్రభుత్వం విచారిస్తే బీఆర్ ఎస్ పెద్దలకు జైలు ఖాయం
- బీఆర్ఎస్ పెద్దలు, పోలీసు అధికారుల పేరులతో నయీం ఆస్తులు..
- నయీం ద్వారా వందల కోట్లు లాభ పడ్డ మాజీ డీజీపీ ఎవరు..?
తప్పు చేసినోళ్లను శిక్షించాల్సింది చట్టం… ఆ చట్టాన్ని రక్షించి నేరాలు జరుగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదే.. కానీ.. ఓ నరహంతకుడితో నేరాలు చేయించి లాభ పడ్డాది అక్షరాల పోలీసు అధికారులే.. ఆ తరువాత పొలిటికల్ లీడరులు.. అయినా.. ఆ కేసును తొక్కి పెట్టింది బీఆర్ ఎస్ ప్రభుత్వం.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ నయీం కేసును తిరుగదోస్తే.. పోలీసు ఉన్నతాధికారులతో పాటు బీఆర్ ఎస్ పార్టీకి చెందిన పెద్దలు ఊచలు లెక్కించాల్సిందే..
ఔను.. మీరు చదివింది అక్షరాల నిజం.. ఏడేళ్ల క్రితం నరహంతకుడు నయీంను ఎన్ కౌంటర్ చేసిన తరువాత స్వాధీనం చేసుకున్న ఆస్తుల అడ్రసు ఎక్కడా అనే ప్రశ్న తలెత్తుతుంది. బినామీల పేరులతో ఉన్న ఆస్తులు బీఆర్ ఎస్ పెద్దల పేరులతో రిజిస్ట్రేషన్ అయ్యాయి. మరి కొన్ని పోలీసు ఉన్నతాధికారులు తమ పేరులతో ఆస్తులను మార్చుకున్నారు. ఈ నయీం కేసులో కిక్ ఏమిటంటే ఓ మాజీ డీజీపీ స్వయంగా నయీం వల్ల వందల కోట్ల లాభ పడ్డట్లు వెలుగులోకి వచ్చింది. నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నయీం కేసును పున : పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు.
నయీం ఎన్ కౌంటర్ నేపథ్యం..
నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీం.. అతనో నరహంతకుడు. కరడు గట్టిన నేరస్తుడు. రంగారెడ్డి, హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాలలో గ్యాంగ్ స్టర్ నయీంకు రెండు దశాబ్దాలకు పైగా నేర చరిత్ర ఉంది. నక్సలైట్లను హంతం చేయడానికి నయీంను పోలీసు ఉన్నతాధికారులే ప్రొత్సహించడం ట్విట్. హైదరాబాద్ చుట్టు పక్కల చాలా మంది మిస్ అయ్యారు. నయీం ముఠాను కిడ్నాప్ చేసి హత్యలు చేసి అడ్రసు లేకుంబడా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నయీంపై 40 కి పైగా హత్యలు, బెదిరింపు కేసులతో పాటు లెక్కలేనన్ని సెటిల్ మెంట్లను తన ఖాతాలో వేసుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలలో పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అతను. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ సమీపంలో పోలీసులు 8 ఆగష్టు 2016లో నయీంను ఎన్ కౌంటర్ లో అంతం చేసారు. ఆ తరువాత ఆ కేసు ఏమైందానేది అంతు చిక్కని కథలా మిగిలింది.
పక్కా వ్యూహంతో నయీం ఎన్ కౌంటర్..
నరహంతకుడిగా మారిన నయీంను అంతమొందించాలని కేసీఆర్ ప్రభుత్వానికి నివేదిక అంద చేశాయి ఇంటిలిజెన్స్ వర్గాలు. అతని ఆగడాలు పెరిగి పోవడంతో పాటు బీఆర్ ఎస్ నేత, మాజీ నక్సలైట్ సాంబ శివుడు సోదరులను హంతమొందించడం, కేసీఆర్ సన్నిహితులను డబ్బుల కోసం నయీం ముఠా బెదిరించడంతో ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. అప్పటికే పోలీసు ఉన్నతాధికారులతో నయీంకు సంబందం ఉన్నందున అత్యంత గోప్యంగా ఎన్ కౌంటర్ కు వ్యూహం రూపొందించినట్లు తెలిసింది. అప్పటి ఇంటిలిజెన్స్ వింగ్ చీఫ్ శివధర్ రెడ్డి, స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరో చీఫ్ సజ్జనార్, కౌంటర్ ఇంటిలిజెన్స్ చీఫ్ రాజేశ్ కుమార్ ల వ్యూహం ప్రకారం పక్కా సమాచారంతో ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు నల్గొండ జిల్లాలో సూపరిండెంట్ ఆఫ్ పోలీసుగా విధులు నిర్వహించిన అనుభవం ఉన్నందున నయీం ముఠా వివరాలు సేకరించడం సులువైంది.
నయీంతో సంబంధం ఉన్న పోలీసులపై చర్యలేవి..?
నయీంతో పోలీసు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఉన్న సంబందాలపై పక్కా సమాచారం సేకరించారు. నయీంకు సంబందించిన 150 స్థలాలను ముందుగానే గుర్తించిన ఈ ముగ్గురు ఉన్నతాధికారులు నయీం ఎన్ కౌంటర్ సమయంలోనే పోలీసులు ఎక్కడి వారక్కడా దాడులు చేసి కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. బినామీ పేరులతో ఉన్న ఆస్తులను గుర్తించారు. ఎస్ ఐ నుంచి ఎస్ పీ వరకు, సర్పంచ్ నుంచి మంత్రి వరకు ఆ నేరస్థుడు నయీంతో సంబంధం ఉన్న విషయాన్ని గుర్తించి పకడ్బందీగా దాడులు నిర్వహించారు. కానీ.. డీఐజీ, ఐజీ లాంటి అధికారులపై చర్యలు తీసుకోలేరనే ఆరోపణలు ఉన్నాయి.
నాగిరెడ్డి సిట్ ఏమైంది..?
తెలంగాణ తొలి డీజీపీ అనురాగ శర్మ ఈ నయీం కేసును సీరియస్ గా తీసుకున్నారు. అతని నేర సామ్రాజ్యంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించాలని విచారణ చేయడానికి మొదట సిట్ ను ఏర్పాటు చేసారు. అంజనీ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. నయీం ఎన్ కౌంటర్ సమయంలో హైదరాబాద్ సిటీ కమీషనర్ గా పని చేస్తున్న మహేందర్ రెడ్డికి కూడా సమాచారం ఇవ్వకుండా పోలీసు ఉన్నతాధికారులు జాగ్రత్త పడ్డారు. కొంత కాలానికి అనురాగ శర్మ రిటైర్ కావడంతో డీజీపీగా మహేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అప్పటి వరకు ఉన్న సిట్ ఇన్ చార్జీ అంజనీ కుమార్ ను తప్పించి తనకు అనుకూలంగా ఉండే నాగిరెడ్డిని సిట్ ఇన్ చార్జీగా నియమించడం వెనుక అసలు రహస్యం ఏమిటనే ప్రశ్న ఉద్బవించింది.
ఇంటిలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని తప్పించడం వెనుక..?
ఇంటిలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. నిజాయితీగా విధులు నిర్వహిస్తారు. తప్పు ఎవరు చేసిన తప్పు అంటారు. నయీంతో కొందరు పోలీసు ఉన్నతాధికారులకు సంబంధాలు ఉన్నందున ఎన్ కౌంటర్ సమయంలో తీసుకున్న జాగ్రత్తల వల్ల అతనినే టార్గెట్ చేశారు ఓ పోలీసు ఉన్నతాధికారి. సీఎం కేసీఆర్ కు లేని పోని ఆబద్ద కథనాలు చెప్పి ఇంటిలిజెన్స్ చీఫ్ గా శివదర్ రెడ్డిని తప్పించడంలో అతను సక్సెస్ అయ్యారు. అలాగే తనకు నయీం కేసులో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న సిట్ చీఫ్ అంజనీ కుమార్ ను తప్పించిన ఓ పోలీసు ఉన్నతాధికారి నాగిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అంజనీ కుమార్ సిట్ అధికారిగా విచారణ చేస్తే తాను నయీంతో బెదిరించి కోట్ల రూపాయలు ల్యాండ్స్ ను తన పేరుతో, కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్న విషయం బహిర్గతం అవుతుందని ఆ పోలీసు ఉన్నతాధికారి జాగ్రత్త పడ్డట్లు తెలుస్తోంది.
బీఆర్ ఎస్ పెద్దల చేతిలోకి నయీం బినామీ ఆస్తులు..?
నయీం ముఠా అమాయకులను బెదిరించి స్వాధీనం చేసుకున్న ఆస్తులు వందల కోట్లు. బినామీల పేరులతో ఉన్న ఆస్తులు కూడా కోట్లల్లోనే ఉంటాయి. అయితే.. నాగిరెడ్డి సిట్ అధికారిగా నయీం ముఠా ఆస్తులను, అతనితో సంబంధం ఉన్న పొలిటికల్ లీడరులు.. ఎస్పై నుంచి ఎస్ పి వరకు ఉన్న పోలీసు అధికారుల వివరాలను ప్రభుత్వానికి అంద చేశారు. నయీం బినామీల వద్ద ఉన్న ఆస్తులను సీఎంకు అత్యంత సన్నిహితులు కొందరు తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలిసింది. నయీం ముఠా వల్ల లాభ పడ్డ పోలీసు ఉన్నతాధికారుల వివరాలు నాగిరెడ్డి సిట్ ప్రభుత్వానికి అంద చేసిన పట్టించుకోలేదని తెలిసింది.
నయీంతో లాభ పడ్డ బీఆర్ ఎస్ పెద్దలపై చర్యలేవి..?
నయీం ముఠాతో సంబంధాలు ఉన్న బీఆర్ ఎస్ పెద్దల పేర్లను అప్పటి కేసీఆర్ ప్రభుత్వానికి అంద చేసింది నాగిరెడ్డి సిట్. అయితే.. అప్పటి శాసన మండలి డిప్యూటీ స్పీకర్ నేతి విద్యాసాగర్ కు, అప్పటి మంత్రి జగదీశ్ రెడ్డికి, రాజ్యసభ సభ్యుడు ఆర్ . క్రిష్ణయ్య, బీఆర్ ఎస్ నేత నర్సింహరెడ్డి, ఎంఎల్ సీ కన్నె ప్రభాకర్ లకు నయీంతో సంబందాలు ఉన్నాయని సిట్ విచారణలో తేలింది. అయితే.. ఈ కేసును సీరియస్ గా తీసుకుంటే తమ పార్టీ పరువు పోతుందని భావించిన కేసీఆర్ ప్రభుత్వం నయీం కేసును తొక్కి పెట్టినట్లు తెలుస్తోంది. ఏడేళ్లుగా ఆ కేసును పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
నయీంతో లాభ పడ్డ మాజీ డీజీపీ ఎవరు..?
నయీం ముఠాపై విచారణ చేసిన సిట్ కు అసక్తికర మైన విషయాలు తెలిసాయి. అతనిని అడ్డు పెట్టుకుని లాభపడ్డవారిలో ఎస్సై, సీఐ, డీఎస్పీ, అడిషనల్ ఎస్ పీ, ఎస్ పీ లతో పాటు డీజీపీ వరకు సంబంధం ఉన్నట్లు తేలింది. అయితే.. డీజీపీ పేరును గోప్యంగా ఉంచిన పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అతని పేరు లేకుండానే రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే.. పోలీసు కమీషనర్ గా ఉన్నప్పుడు నయీంతో సంబంధాలు పెట్టుకున్నట్లు తెలిసింది.ఆ నయీం ద్వారా కోట్ల రూపాయలు లాభ పడ్డట్లు తెలిసింది.
హీరోయిన్ సౌందర్య వందల కోట్ల ల్యాండ్స్ ఏమైనవి..?
సినీ హీరోయిన్ సౌందర్య బ్రతికినప్పుడు సైబరాబాద్ కమీషనరెట్ పరిధిలోని వట్టి నాగులపల్లిలో పది ఎకరాలు ల్యాండ్ కొనుగోలు చేసింది. ఆ ల్యాండ్ ను తన సోదరుడు కె.ఎస్. అమర్ నాథ్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించింది. సౌందర్య మరణించడంతో ఆ ల్యాండ్ పై పోలీసు కమీషనర్ గా పని చేసి ఆ తరువాత డీజీపీ గా రిటైర్డ్ అయిన అధికారి కన్ను పడ్డట్లు తెలిసింది. 2005లో సౌందర్య సోదరుడు కె.ఎస్. అమర్ నాథ్ ను నయీంతో బెదిరించి వందల కోట్ల ఆ పది ఎకరాల ల్యాండ్ ను తన పేరుతో పాటు సోదరుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలుస్తోంద. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా ఆస్తులు కొనుగోలు చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పని సరి. ఆ పోలీసు ఉన్నతాధికారి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండానే తన పేరుతో కోట్ల రూపాయలు ల్యాండ్ ను రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. నయీంతో లాభ పడిన ఈ మాజీ డీజీపీ వట్టి నాగుల పల్లి ల్యాండ్ వ్యవహరంపై విచారణ జరిపిస్తే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు పోలీసు వర్గాలు.
కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేస్తే..
నయీం ముఠా ఆరాచకాల వల్ల అమాయక ప్రజలు నష్ట పోయారు. నరహంతకుడైన నయీం పేరు చెబితే చాలు వివాదస్పద స్థలాలు అతని పేరుతో రిజిస్ట్రేషన్ కావాల్సిందే. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలతో పాటు భువనగిరి డివిజన్ లో నయీం బెదిరింపులతో కోట్లు నష్ట పోయారు అమాయక ప్రజలు. అయితే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నయీం కేసును తిరిగి విచారణ చేపిస్తే బీఆర్ ఎస్ పెద్దలతో పాటు పోలీసు అధికారులు జైలు ఊచలు లెక్కించాల్సి వస్తోంది. సినీ నటి సౌందర్య ల్యాండ్ ను తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్న మాజీ డీజీపీ బండారం బయట పడుతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నయీం కేసును నిజాయితీ గల పోలీసు ఆఫీసర్ తో విచారణ జరిపించాలని ప్రజలు కోరుతున్నారు.
యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్