నిర్దేశం, టోక్యోః జపనీయులు అంటే నిజాయితీకి, కష్టపడేతత్వానికి మారు పేరు. జపాన్ అవినీతి, అక్రమాలే కాదు.. చిన్న చిన్న తప్పిదాలు కూడా పెద్దగా కనిపించవు. దాదాపు ప్రతి రంగంలో కఠినమైన, బలమైన విధానాలు ఉంటాయి. అయితే తప్పు చేస్తే ప్రాణం కోల్పేయేంతటి కఠిన చట్టమే ఉంటే..? ఊహించుకుంటేనే గుండో జేబులోకి వస్తుంది కదా. అలాంటి విధానమే జపాన్‌కు చెందిన షికోకు బ్యాంక్ పెట్టింది. ఈ పాలసీ ప్రకారం, ఉద్యోగి ఏదైనా ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు తేలితే, ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది. తాము ఎలాంటి ఆర్థిక అక్రమాలకు పాల్పడబోమని, ఏదైనా విధంగా అవకతవకలు లేదా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలితే ఆత్మహత్య చేసుకుంటామని ఉద్యోగంలో చేరేముందు ప్రమాణం చేయాలి. దీనికి సంబంధించి లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్
బ్యాంక్ వెబ్‌సైట్ స్క్రీన్‌షాట్ ను ఎక్స్ లో షేర్ చేశారు. దీనిలో ”ఈ బ్యాంక్‌లో పనిచేసే వ్యక్తి ఎవరైనా బ్యాంక్ నుండి డబ్బును దొంగిలించినా లేదా ఇతరులను దొంగిలించేలా చేసినా తన సొంత ఆస్తి నుండి తిరిగి చెల్లించి ఆత్మహత్య చేసుకుంటారు” అని ఆ బ్యాంకు ప్రమాణంలో ఉంది. బ్యాంకు వెబ్‌సైట్ ప్రకారం, 23 మంది ఉద్యోగులు రక్తంతో ఈ ప్రమాణం చేశారు. ఈ ప్రమాణం బ్యాంకు కార్యకలాపాలను నిర్ధారించడానికి రూపొందించబడింది.
‘సెప్పుకు’ అంటే ఏమిటి?
పోస్ట్ ప్రకారం, బ్యాంకులో ఏదైనా ఆర్థిక లావాదేవీలో ఏవైనా అవకతవకలు జరిగినట్లు నిరూపితమైతే, బాధిత ఖాతాదారులకు ఆ సొమ్మును నిందితులు తిరిగి చెల్లించాలి. ఆపై ‘సెప్పుకు’ పాల్పడతారని వెబ్‌సైట్ స్పష్టం చేస్తుంది. సెప్పుకు హర-కిరి అని కూడా అంటారు. ఇది జపాన్‌లో ఒక రకమైన ఆత్మహత్య. గౌరవాన్ని కాపాడుకోవడానికి ఇది చారిత్రాత్మకంగా ఆచరిస్తూ వస్తున్న సంప్రదాయం. బ్యాంక్ ప్రకారం, ప్రమాణం ఒక బ్యాంకు ఉద్యోగిగా మాత్రమే కాకుండా సమాజంలోని సభ్యునిగా కూడా నైతికత, బాధ్యత యొక్క స్వభావాన్ని నొక్కి చెప్తుంది. అలాగే ఈ ప్రమాణ పత్రాన్ని షికోకు బ్యాంక్ ప్రత్యేక ఆస్తిగా చెప్తుంటారు.