ఇండియాకు అమెరికా వైస్ ప్రెసిడెంట్

ఇండియాకు అమెరికా వైస్ ప్రెసిడెంట్

న్యూఢిల్లీ, నిర్దేశం:
తెలుగింటి అల్లుడు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబ సమేతంగా నాలుగు రోజుల పాటు భారతదేశంలో పర్యటించనున్నారు. అమెరికా ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జేడి వాన్స్.. తొలి భారత పర్యటనకు రానున్నారు. జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్, భారత సంతతికి చెందిన మొదటి అమెరికన్ సెకండ్ లేడీ కావడం విశేషం. భారత పర్యటనలో భాగంగా జేడి వాన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై, భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక, వాణిజ్య ఒప్పందాలు, భౌగోళిక రాజకీయ అంశాలు, ఇండో-పసిఫిక్ భద్రత, AI, డ్రోన్ టెక్నాలజీలపై చర్చలు జరపనున్నారు. భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో కీలకమైనదిగా జేడి వాన్స్ భారత్ పర్యటనను భావిస్తున్నారు. వాణిజ్య ఒప్పందాలు, టారీఫ్‌లు, భౌగోళిక రాజకీయ అంశాలపై జరిగే చర్చలు రెండు దేశాల భవిష్యత్తు సహకారానికి దిశానిర్దేశం చేయనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ తన భార్య ఉషా వాన్స్, ముగ్గురు పిల్లలు (ఇవాన్, వివేక్, మిరాబెల్)తో కలిసి నాలుగు రోజుల భారత పర్యటనకు రానున్నారు.  ప్రధానమంత్రి నివాసంలో నరేంద్ర మోదీతో వాన్స్ సమావేశమవుతారు. ఇద్దరి మధ్య కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో 2030 నాటికి భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరగనున్నాయి. అమెరికా విధించిన టారీఫ్‌ల వ్యవహారంపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. అనంతరం వాన్స్ కుటుంబానికి విందు ఇవ్వనున్నారు ప్రధాని మోదీ.భారత పర్యటనలో జేడీ వాన్స్ కుటుంబం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించనుంది.

ఏప్రిల్ 21న ఢిల్లీలోని అక్షర్‌ధామ్ స్వామి నారాయణ్ ఆలయం, స్థానిక మార్కెట్‌లను సందర్శించనున్నారు. ఏప్రిల్ 22న రాజస్థాన్‌లోని జైపూర్‌లో అంబర్ ఫోర్ట్, హవా మహల్ వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. ఏప్రిల్ 23న ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు. ఏప్రిల్ 24న ఉదయం 6:40 గంటలకు ఢిల్లీ నుండి అమెరికాకు తిరిగి ప్రయాణం కానున్నారు. మోదీ విందు తర్వాత, వాన్స్, అతని కుటుంబం జైపూర్‌కు బయలుదేరుతారు. జైపూర్‌లో రాంబాగ్ ప్యాలెస్‌ హెరిటేజ్ హోటల్‌‌లో బస చేయనుంది వాన్స్ కుటుంబం. మంగళవారం జైపూర్ లో వివిధ చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పిలువబడే అంబర్ ఫోర్ట్, హవా మహల్‌ను సందర్శిస్తారు. రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో మధ్యాహ్నం జరిగే సభలో జేడి వాన్స్ ప్రసంగిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో దౌత్యవేత్తలు, విదేశాంగ విధాన నిపుణులు, భారత ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొనే అవకాశం ఉంది. ట్రంప్ పరిపాలనలో భారత్-అమెరికా సంబంధాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది.జైపూర్‌లో ఒక రోజు పర్యటన తర్వాత, వాన్స్ కుటుంబం బుధవారం ఆగ్రా తాజ్ మహల్ ను సందర్శిస్తారు. భారతీయ హస్తకళలు, కళాఖండాల ప్రదర్శనకు ప్రసిద్ధి చెందిన ఓపెన్-ఎయిర్ ఎంపోరియం అయిన శిల్పగ్రామ్‌ను కూడా పర్యటిస్తారు. అనంతరం తిరిగి జైపూర్ చేరుకుంటారు.

ఏప్రిల్ 24న ఉదయం భారత్ పర్యటన ముగించుకుని అమెరికా బయలుదేరుతారు.భారత్ పర్యటనలో భాగంగా జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే అంశంపై క్లారిటీ లేదు. ఇప్పటి వరకు ఉన్న షెడ్యూల్ ప్రకారం వాన్స్ కుటుంబం ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రమే పర్యటించే అవకాశం ఉంది. ఉషా వాన్స్ (ఉషా బాల చిలుకూరి వాన్స్), మొట్టమొదటి ఆసియా అమెరికన్, హిందూ అమెరికన్ ద్వితీయ మహిళగా చరిత్ర సృష్టించారు. ఉషా కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో తెలుగు భారతీయ వలస కుటుంబంలో జన్మించారు. ఉషా తల్లిదండ్రులు క్రిష్ చిలుకూరి, లక్ష్మి చిలుకూరి, ఇద్దరూ ప్రొఫెసర్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఆమె పూర్వీకులు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలం మార్కొండపాడు గ్రామానికి చెందిన వారు. ఉషా వృత్తి పరంగా న్యాయవాది. ఉషా, జేడీ వాన్స్ యేల్ లా స్కూల్‌లో కలుసుకున్నారు. 2014లో కెంటకీలో హిందూ సంప్రదాయంలో మతాంతర వివాహం చేసుకున్నారు. జేడీ వాన్స్ క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తారు, అయితే ఉషా హిందూ మతాన్ని గౌరవిస్తారు. జేడి ఉషా దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇవాన్, వివేక్, మిరాబెల్. 2024 అమెరికా ఎన్నికల్లో ఉషా జేడి వాన్స్ రాజకీయ ప్రచారంలో కీలక పాత్ర పోషించారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »