నో ఫ్లయింగ్ జోన్ గా తిరుమల

నో ఫ్లయింగ్ జోన్ గా తిరుమల

తిరుమల, నిర్దేశం:
కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమల క్షేత్రం పవిత్రతను కాపాడేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు. చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సమయం నుండి తిరుమల క్షేత్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలను చైర్మన్ బీఆర్ నాయుడు తీసుకున్నారు. ఇప్పటికే తిరుమలలో విధులు నిర్వహిస్తున్న అన్యమత ఉద్యోగులను పలువురిని రిలీవ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆలయ పవిత్రతను కాపాడేందుకు నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు టీటీడీ చైర్మన్ లేఖ రాశారు. ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమలపై ఎటువంటి విమానాలు వెళ్లకూడదని పండితులు చెబుతుంటారు. అయినప్పటికీ పలుమార్లు విమానాలు ఆలయం పై చక్కర్లు కొట్టిన ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. తిరుమలకు సమీపంలో రేణిగుంట విమానాశ్రయం ఉన్న నేపథ్యంలో, ఇలాంటి ఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయని కూడా స్థానికులు అభిప్రాయ పడే పరిస్థితి. కానీ ఆలయ పవిత్రతను కాపాడేందుకు తిరుమల ఆలయం పై నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని ఎప్పటి నుండో డిమాండ్ వినిపిస్తోంది. ఆలయం పై విమానం ఎగరడం అపచారంగా భక్తులు భావిస్తారు. అందుకే తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించే దిశగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు.తాజాగా టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు ఇదే అంశానికి సంబంధించి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు. ఆ లేఖలో తిరుమల క్షేత్రాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని చైర్మన్ కోరారు. ఆగమశాస్త్రం ఆలయ పవిత్రత, భద్రతతో పాటు భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని ఆయన కోరారు. తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, ముఖ్యంగా హెలికాప్టర్లు ఇతర వైమానిక కదలికలతో ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన వాతావరణానికి భంగం కలుగుతుందని చైర్మన్ అభిప్రాయపడ్డారు. తిరుమల యొక్క సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటానికి నో ఫ్లయింగ్ జోన్ ప్రకటన ముఖ్యమైన అడుగు అవుతుందని లేఖలో చైర్మన్ పేర్కొన్నారు. అయితే చైర్మన్ లేఖపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. తిరుమలను నో ఫ్లై ఫ్లయింగ్ జోన్ గా ప్రకటిస్తే ఎప్పటినుండో భక్తులు కోరుతున్న డిమాండ్ నెరవేరినట్లని చెప్పవచ్చు.ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు కల్పించే దర్శనంలో భాగంగా స్థానిక దర్శన కోటా టోకెన్లను టీటీడీ జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు తిరుపతి స్థానికులకు మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, తిరుమల స్థానికులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఉదయం 5 గంటల నుండి శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ విషయాన్ని గమనించి తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానిక భక్తులు ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. కాగా ఈనెల 4 వ తేదీన స్థానిక భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కల్పించనున్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »